'ఇరాక్ లో తెలంగాణవాసుల క్షేమ సమాచారం తెలపండి'
ఇరాక్లో అంతరుద్ధ్యం నేపథ్యంలో స్వదేశం వచ్చేందుకు సుముఖంగా ఉన్న రాష్ట్ర వాసులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. ఇరాక్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తెలంగాణ వాసుల యోగక్షేమాలను తమకు తెలపాల్సిందిగా కేంద్రానికి రాసిన లేఖలో ఆయన కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఇరాక్ వెళ్లిన వారి వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 1038 మంది ఇరాక్లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వారిలో 858 మంది ముంబై ట్రావెల్స్ ఏజెన్సీ, మరో 180 మంది జైపూర్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా ప్రొటెక్టర్ అధికారికంగా వెళ్లారని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రానికి రాసిన లేఖలో వివరించారు.