కరోనా వేదన.. అరణ్య రోదన  | Telugu People Facing Problem In Iraq Due To Corona Lockdown | Sakshi
Sakshi News home page

కరోనా వేదన.. అరణ్య రోదన 

Published Fri, Apr 17 2020 3:39 AM | Last Updated on Fri, Apr 17 2020 3:39 AM

Telugu People Facing Problem In Iraq Due To Corona Lockdown - Sakshi

ఇరాక్‌లోని ఓ ఇంట్లో ఉన్న తెలంగాణ కార్మికులు

మోర్తాడ్‌ (బాల్కొండ) : ఇరాక్‌లో తెలంగాణకు చెందిన వలస కార్మికులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలే అఖామా రెన్యువల్‌ కాక అవస్థలు పడుతున్న కార్మికులకు లాక్‌డౌన్‌ శరాఘాతంగా మారింది. ఉపాధి కోల్పోయి నివాస స్థలాలకే పరిమితమైన కార్మికులకు చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల రోజులుగా అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో మనోళ్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఏం చేయాలో అర్థంకాక భయాందోళనతో జీవితం గడుపుతున్నారు. ఇరాక్‌లో తెలంగాణ జిల్లాల నుంచి వలస వెళ్లినవారు దాదాపు 13 వేల మంది కార్మికులు ఉంటారని అంచనా. గతంలో లక్ష మంది వరకు ఉండగా.. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో ఈ మధ్యనే ఎంతో మంది ఇంటిబాట పట్టారు. ఎలాగైనా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనే ఆశతో కొంత మంది అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇరాక్‌కు మొదట విజిట్‌ వీసాపై వెళ్లిన వారంతా అక్కడ అఖామాలను పొందారు. కాలపరిమితి ముగిసేలోపు రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ విషయంలో కొన్ని ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడినట్లు వెలుగు చూడటంతో ఇరాక్‌ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఫలితంగా విదేశీ కార్మికుల అఖామాల రెన్యువల్‌ను డిసెంబర్‌లో నిలిపివేసింది. గడువు ముగిసినా అఖామా లేనివారు మాత్రం రోజువారీ కూలీగా పనిచేస్తూ రహస్యంగానే జీవితం గడుపుతున్నారు.  

అర్ధాకలితో అలమటిస్తున్నాం  
అఖామాలు లేని కార్మికులకు అతీగతీ లేకుండా పోయింది. నెల రోజుల నుంచి లాక్‌డౌన్‌ అమలు వల్ల వీరి అవస్థలు వర్ణనాతీతం. గతంలో తీసుకున్న సరుకులతో కొన్ని రోజులు వెళ్లదీసిన కార్మికులు.. డబ్బులు లేక మళ్లీ సరుకులు కొనుగోలు చేయలేక పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజుకు ఒకపూట తింటూ అర్ధాకలితో అలమటిస్తున్నామని పలువురు కార్మికులు ‘సాక్షి’తో ఫోన్‌లో వాపోయారు. ఎలాగైనా స్వదేశానికి వద్దామన్నా రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేదన అరణ్య రోదనగా మారిందన్నారు.  

చొరవ చూపండి  
ప్రస్తుతం ఇరాక్‌లో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే అఖామా లేని కార్మికులు ఇంటి దారి పట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. తమకు పెద్ద దిక్కులేకుండా పోయిందని కా ర్మికులు వాపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి కనీస సౌకర్యాలు కల్పిం చేలా చొరవ చూపాలని  కోరుతున్నారు. 

వీరంతా సేఫ్‌ 
అయితే అఖామాను పొందిన కార్మికులకు ఆయా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు నివాసం, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశాయి. ఇరాక్‌లోని నిన్‌వేహ్, సలావుద్దీన్, దియాల, అంబర్, కిర్‌కుక్‌ ప్రాంతాలను మినహాయించి బాగ్దాద్, ఖుర్దిస్తాన్, ఎర్బిల్‌ తదితర ప్రాంతాల్లో వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత వీరికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.  

వారిని స్వదేశానికి రప్పించాలి  
ఇరాక్‌లోని తెలంగాణ గల్ఫ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొంత మంది కార్మికులకు నిత్యావసర సరుకులను అందించాం. అఖామా రెన్యువల్‌ కాని కార్మికులను గుర్తించి వారికి తిండి కోసం అవసరమైన సామగ్రిని చేరవేశాం. ఖుర్దిస్తాన్‌ పార్లమెంట్‌ సభ్యుడు ష్వాన్‌ జరారీ మా విన్నపానికి స్పందించి కార్మికులకు అవసరమైన నిత్యావసర సరుకులను మానవతా దృక్పథంతో అందించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత వలస కార్మికులను స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలి. 
– రాయల్వార్‌ రాంచందర్, ఉపాధ్యక్షుడు, టీజీఈడబ్ల్యూఏ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement