రవీశ్‌కుమార్
న్యూఢిల్లీ / వాషింగ్టన్: పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమానే కూల్చివేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అభినందన్ పాక్ విమానాన్ని కూల్చడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ చెప్పారు. కూల్చడంపై ఎలక్ట్రానిక్ ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. ఎఫ్–16 ఫైటర్ జెట్లలో వాడే అమ్రామ్ క్షిపణి శకలాలను ఇప్పటికే మీడియా ముందు ప్రదర్శించిన విషయాన్ని గుర్తుచేశారు.
వీడియో సాక్ష్యాలను ఎందుకు చూపలేదు?
భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చివేశామని పాక్ చెప్పడాన్ని రవీశ్ తప్పుపట్టారు. పాక్‌తో ఘర్షణ సమయంలో మనం ఒక మిగ్–21 బైసన్ యుద్ధవిమానాన్ని మాత్రమే కోల్పోయిందని, దాన్ని నడుపుతున్న అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారని చెప్పారు. నిజంగానే పాక్ మరో విమానాన్ని కూల్చివేస్తే, వారం రోజులైనా ఆ సాక్ష్యాలను అంతర్జాతీయ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అదే నిజమైతే ఆ రెండో విమానం శకలాలు ఎక్కడున్నాయి? దాన్ని నడుపుతున్న పైలెట్లకు ఏమైంది? అనే విషయాలను పాక్ వెల్లడించాలన్నారు.
పాక్‌లోనే ఉన్నాడని అందరికీ తెలుసు..
పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాక్‌లో ఉన్నాడని ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి సభ్యులకు తెలుసని రవీశ్ చెప్పారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారకులైన జైషే ఉగ్రశిబిరాలు పాక్‌లో స్వేచ్ఛగా నడుస్తున్నాయన్న విషయం భద్రతామండలికి తెలుసని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, తదనంత పరిణామాలతో భారత్–పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు మార్క్‌తో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment