F-16 fighter jets
-
‘పాక్ విమానాన్ని కూల్చడం నేను చూశాను’
న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేయడాన్ని తాను చూసినట్లు స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం మింటీకి ‘యుద్ధ్ సేవా’ పతకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డు పొందనున్న తొలిమహిళ రక్షణ అధికారి మింటీనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘అభినందన్ వర్ధమాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేయడం నా స్క్రీన్ నుంచి చూశాను. ఆ సమయంలో ఆయనకు వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాను. బాలాకోట్ స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపాం. శత్రువులను నుంచి స్పందన వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాం. పాక్ దాడి చేస్తే.. తిప్పి కొట్టేందుకు మేం కూడా సిద్ధంగా ఉన్నాం. అపాయం తలపెట్టే దురుద్దేశంతోనే పాక్ విమానం భారత గగన తలంలోకి ప్రవేశించింది. కానీ అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం నుంచి గట్టిపోటీ ఎదురయ్యే సరికి వారి మిషన్ ఫెయిలైంది’ అని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్థాన్ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16ను అభినందన్ తన మిగ్ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగ్ కూడా కూలిపోవడంతో అభినందన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగారు. అక్కడి స్థానికులు ఆయనను పట్టుకుని పాక్ సైనికులకు అప్పగించారు. మూడు రోజుల తర్వాత పాక్ అభినందన్‌ను విడిచిపెట్టింది. దాయది చెరలో ఉన్నప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ వర్ధమాన్‌కు కేంద్రం ‘వీర్ చక్ర’ ప్రకటించారు. -
భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు
వాషింగ్టన్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాను సందర్శించిన కొద్దిరోజులకే అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు రూ.860.75 కోట్ల ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ కాంగ్రెస్(పార్లమెంటు)కు తెలిపింది. ఈ ఒప్పందం కింద పాకిస్తాన్‌కు గతంలో అమ్మిన ఎఫ్–16 ఫైటర్జెట్లను 24 గంటల పాటు పర్యవేక్షిస్తామనీ, ఇందుకు 60 మంది కాంట్రాక్టర్లను నియమిస్తామని వెల్లడించింది. పాకిస్తాన్‌కు తాము ఎలాంటి ఆర్థికసాయం అందించడం లేదనీ, మొత్తం రూ.860.75 కోట్లను పాక్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పాక్‌కు గతంలో ఆర్థికసాయాన్ని నిలిపివేయడంపై అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని తేల్చిచెప్పింది. మరోవైపు భారత్‌కు రూ.4,613 కోట్ల విలువైన ఆయుధాలను అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. ఈ ఒప్పంద కింద బోయింగ్ సీ–17 గ్లోబ్‌మాస్టర్ సైనిక రవాణా విమానానికి కావాల్సిన పరికరాలు, సిబ్బందికి శిక్షణ, శిక్షణా పరికరాలను అందిస్తామని చెప్పింది. యుద్ధసమయాల్లో సైన్యాన్ని తరలించేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ సీ–17 విమానాన్ని వినియోగిస్తున్నారు. -
విమానాల కూల్చివేతపై తొలిసారి ఒప్పుకున్న పాక్
ఇస్లామాబాద్: బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడి అనంతరం ఎఫ్–16 విమానాలను వినియోగించలేదని ఇప్పటిదాకా బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా మాట మార్చింది. తమ ఎఫ్–16 యుద్ధ విమానాలే భారత్ విమానాలను కూల్చేశాయని మొదటిసారిగా అంగీకరించింది. పాక్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్) పాక్ గగనతలం నుంచే దాడులకు దిగింది. ఆ సమయంలో మా భూభాగంలోకి ప్రవేశించిన రెండు ఐఏఎఫ్ విమానాలను పీఏఎఫ్ కూల్చివేసింది. మేం మోహరించిన విమానాల్లో ఎఫ్–16లు కూడా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుంది’ అని ఆయన ప్రకటించారు. ‘ఆ ఘటన గత చరిత్ర. మా వద్ద ఉన్న ఎఫ్–16 విమానాలను మాత్రం ఐఏఎఫ్ కూల్చలేదు’ అని కూడా ఆయన తెలిపారు. కానీ, గత నెలలో జేఎఫ్–17 రకం విమానాన్ని మాత్రమే వాడినట్లు గఫూరే ప్రకటించారు. బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ దాడికి ప్రతీకారంగా పాక్ వైమానిక దళం కూడా దాడికి యత్నించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సందర్భంగా అమెరికా తయారీ ఎఫ్–16ను ఐఏఎఫ్ కూల్చివేయడం కలకలం రేపింది. ఈ విమానాలను మూడో దేశంపై ఉపయోగించరాదని విక్రయ ఒప్పందంలో అమెరికా పేర్కొంది. కానీ, ఈ షరతులను పాక్ ఉల్లంఘించిందంటూ భారత్ అమెరికాకు సాక్ష్యాధారాలు అందజేయడం తెల్సిందే. -
ఎఫ్16ను కూల్చింది అభినందనే
న్యూఢిల్లీ / వాషింగ్టన్: పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమానే కూల్చివేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అభినందన్ పాక్ విమానాన్ని కూల్చడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ చెప్పారు. కూల్చడంపై ఎలక్ట్రానిక్ ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. ఎఫ్–16 ఫైటర్ జెట్లలో వాడే అమ్రామ్ క్షిపణి శకలాలను ఇప్పటికే మీడియా ముందు ప్రదర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. వీడియో సాక్ష్యాలను ఎందుకు చూపలేదు? భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చివేశామని పాక్ చెప్పడాన్ని రవీశ్ తప్పుపట్టారు. పాక్‌తో ఘర్షణ సమయంలో మనం ఒక మిగ్–21 బైసన్ యుద్ధవిమానాన్ని మాత్రమే కోల్పోయిందని, దాన్ని నడుపుతున్న అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారని చెప్పారు. నిజంగానే పాక్ మరో విమానాన్ని కూల్చివేస్తే, వారం రోజులైనా ఆ సాక్ష్యాలను అంతర్జాతీయ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అదే నిజమైతే ఆ రెండో విమానం శకలాలు ఎక్కడున్నాయి? దాన్ని నడుపుతున్న పైలెట్లకు ఏమైంది? అనే విషయాలను పాక్ వెల్లడించాలన్నారు. పాక్‌లోనే ఉన్నాడని అందరికీ తెలుసు.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాక్‌లో ఉన్నాడని ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి సభ్యులకు తెలుసని రవీశ్ చెప్పారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారకులైన జైషే ఉగ్రశిబిరాలు పాక్‌లో స్వేచ్ఛగా నడుస్తున్నాయన్న విషయం భద్రతామండలికి తెలుసని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, తదనంత పరిణామాలతో భారత్–పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు మార్క్‌తో చర్చించారు. -
పాక్ యుద్ధ విమానం ఎఫ్-16 కూల్చివేత
-
అప్డేట్స్: మాట మార్చిన పాకిస్థాన్
సాక్షి, న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా సరిహద్దులు వేడెక్కాయి. భారత్ వైమానిక దాడులతో ఉగ్రవాదులను చావుదెబ్బ తీయడంతో అసూయతో రగిలిపోతున్న పాకిస్థాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా బరితెగించి.. ఏకంగా భారత గగనతలంలోకి యుద్ధవిమానాలను దాయాది తరలించింది. పూర్తి అప్రమత్తంగా భారత వైమానిక దళం.. పాక్ యుద్ధ విమానాలను వెంటనే వెంబడించి తరిమికొట్టాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం పాక్‌లో కూలిపోయింది. భారత పైలట్ అభినందన్‌ను పాక్ సైన్యం సజీవంగా బంధించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవి.. ఇద్దరు కాదు ఒక్కరే: మాట మార్చిన పాకిస్థాన్ ఇద్దరు భారత పైలట్లను పట్టుకున్నట్టు ప్రకటించిన పాకిస్థాన్ మాట మార్చింది. తమ అదుపులో ఉన్నది ఇద్దరు కాదు ఒక్కరేనని స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన పైలట్ ఒక్కరే తమ కస్టడీలో ఉన్నారని పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు తమ అధికారి పట్ల పాక్ సైన్యం వ్యవహరించిన తీరుపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వేర్పాటువాదుల ఇళ్లలో సోదాలు సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో దక్షిణ కశ్మీర్‌లోని 11 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ముగ్గురు వేర్పాటువాదుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిపారు. పాకిస్థాన్ దౌత్యవేత్తకు సమన్లు ఢిల్లీలోని పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ సయిద్ హైదర్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని హైదర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన బుధవారం సాయంత్రం భారత విదేశాంగ శాఖ ఎదుట హాజరయ్యారు. భారత పైలట్ అభినందన్‌ను హింసించడంపై వివరణ కోరినట్టు సమాచారం. ఎల్ఓసీలో తాజా పరిణామాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత పైలట్‌కు పాక్ చిత్రహింసలు తమకు పట్టుబడిన భారత్ పైలట్ కెప్టెన్ అభినందన్‌ను పాకిస్థాన్ చిత్రహింసలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పాకిస్థాన్ భూభాగంలో మిగ్-21 విమానం కూలిపోయినప్పుడు పారాచ్యూట్ ద్వారా కిందకు దిగిన అభినందన్‌పై పాక్ సైనికులు విచక్షణారహితంగా దాడి చేశారు. యుద్ధ ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందాన్ని పాక్ సైనికులు ఉల్లంఘించారు. కూర్చుని మాట్లాడుకుందాం: ఇమ్రాన్‌ఖాన్ సర్జికల్ దాడులతో పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్‌తో చర్చలకు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రతిపాదించారు. కలిసి కూర్చుని మాట్లాడుకుందామని సూచించారు. యుద్ధం మొదలైతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో తెలియదన్నారు. యుద్ధం వస్తే పరిస్థితులు తన చేతుల్లోగానీ, నరేంద్ర మోదీ చేతుల్లోగానీ ఉండవని అన్నారు. చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాలు లెక్క తప్పాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ఆయుధాలున్నాయని లెక్క తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఐఏఎఫ్ పైలట్ మిస్సింగ్: భారత్ ఐఏఎఫ్ పైలట్ తప్పిపోయినట్టు భారత్ ధ్రువీకరించింది. అభినందన్ తమ అదుపులో ఉన్నట్టు పాకిస్థాన్ చెప్పుకుంటోందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ తెలిపారు. మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని తమ భూ భాగంలోని ప్రవేశించిన పాక్ వైమానిక యుద్ధ విమానాన్ని కూల్చివేశామని, ఈ క్రమంలో మిగ్-21 విమానాన్ని కోల్పోయినట్టు వివరించారు. అయితే తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లు ఉన్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. మా అదుపులో ఇద్దరు భారత్ పైలట్లు: పాకిస్థాన్ తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లు అభినందన్, వర్ధమాన్ ఉన్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ఒక పైలట్‌కు తీవ్ర గాయాలైనట్లు వెల్లడించింది. ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్న వీడియోను పాక్ పోస్ట్ చేసింది. పాక్‌కు షాక్ ఇచ్చిన చైనా, రష్యా చైనాలో పర్యటిస్తున్న భారవ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దౌత్యం ఫలించింది. పూల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో చైనాతోపాటు రష్యా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గట్టి వార్నింగ్ ఇచ్చాయి. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ విడనాల్సిందేనని స్పష్టం చేస్తూ భారత్, రష్యా, చైనా సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఏ చర్యనైనా ఖండిస్తున్నామని మూడు దేశాలు తేల్చిచెప్పాయి. రెండు కూల్చాం.. ఇద్దరి అరెస్టు.. పాక్ కట్టుకథలు! భారత వైమానిక దాడుల నేపథ్యంలో కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్థాన్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. తమ వైమానిక దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ భూభాగంలోకి వచ్చిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని, ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లను అరెస్టు చేశామని పాక్ ఆర్మీ ప్రకటించింది. అరెస్టైన ఇద్దరిలో ఒకరు గాయపడితే.. ఆస్పత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. అంతేకాదు తమ అధీనంలో ఉన్న భారత పైలట్ అంటూ ఒక వీడియో విడుదల చేసింది. ‘నేను వింగ్ కమాండర్ అభినందన్‌ను. ఐఏఎఫ్ అధికారిని. నా సర్వీసు నెంబర్ 27981’ అని పైలట్ చెప్తున్న అంశాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, పాక్ వాదన కట్టుకథ మాత్రమేనని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు పాక్ దినపత్రిక ‘డాన్’ వెబ్సైట్లో భారత విమానాన్ని కూల్చినట్టు ఓ ఫొటోను పెట్టి కథనాన్ని వండివార్చారు. అయితే, నాలుగేళ్ల కిందట కూలిపోయిన ఐఏఎఫ్ శిక్షణ విమానం ఫొటోను వాడుకొని.. ఈ విమానాన్నే పాక్ కూల్చేసిందని ఈ కథనంలో ఉటంకించారు. దీంతో ఆ పత్రిక కథనం ఫేక్ అని అర్థమవుతోంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ విమానాశ్రయంలోనూ తాత్కాలికంగా వైమానిక కార్యకలాపాలు రద్దు.. మన విమానాలను పాక్ కూల్చలేదు.. పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత వైమానిక దళం హై అలర్ట్‌గా ఉంది. మరోవైపు భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూల్చివేసినట్టు పాకిస్తాన్ చెబుతున్న మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పాక్ చేస్తున్న ప్రకటనలను ఖండించింది. దాడులు జరిగినట్టు పాక్ మీడియా చూపిస్తున్న దృశ్యాలు గతంలో జోధ్‌పూర్ ప్రమాదానికి సంబంధించినవని తెలిపింది. పాత దృశ్యాలు చూపించి పాక్ తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తుందని విమర్శించింది. పాక్ బరితెగింపు.. పరిస్థితిని సమీక్షిస్తున్న మోదీ ఢిల్లీ: ప్రధాని నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం.. కశ్మీర్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పాకిస్థాన్ కవ్వింపు చర్యలు.. అనంతరం తలెత్తిన పరిణామాలను మోదీకి వివరిస్తున్న జాతీయ భద్రతా ఏజెన్సీ అధికారులు వివరిస్తున్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వారితో కలిసి సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై మోదీ సమీక్షిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల మూసివేత.. భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భద్రత కారణాల దృష్ట్యా చండీగఢ్, అమృతసర్, శ్రీనగర్, జమ్ము, లేహ్ విమానాశ్రయాలను మూసివేశారు. మరోవైపు రాజస్తాన్ నుంచి బయలుదేరిన విమానాలతోపాటు, పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే అంతర్జాతీయ విమానాలను అధికారులు దారి మళ్లించారు. పాక్ కూడా భారత్ వైపు ప్రయాణించే అన్ని పౌర విమానాలను రద్దు చేసింది. అలాగే సరిహద్దుల్లోని విమానాశ్రయాలను మూసివేసింది. పాకిస్థాన్ విమానాలన్నీ బంద్! సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం.. యుద్ధవిమానాల కూల్చివేత నేపథ్యంలో పాకిస్థాన్ తమ దేశానికి చెందిన విమానాశ్రయాల కార్యకలాపాలను నిలిపివేసింది. లాహోర్, ముల్తాన్, ఫైజలాబాద్, సియాకోట్, ఇస్లామాబాద్ విమానాశ్రయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకల నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలు రాజౌరి సెక్టార్‌లోని ఆర్మీ పోస్టులకు సమీపంలో బాంబులు జారవిడిచాయి. ఈ బాంబు శకలాలకు సంబంధించిన దృశ్యాలివి... సరిహద్దుల్లోని నౌషెరా సెక్టార్లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఎయిర్‌స్పెస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానాన్ని భారత వాయుసేన వెంటనే కూల్చివేసింది. నౌషెరా సెక్టార్‌లోని పాకిస్థాన్ భూభాగం పరిధిలోకి వచ్చే లామ్ వ్యాలీలో ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిపోవడానికి ముందే పారాచ్యుట్ సాయంతో పాక్ పైలట్ కిందికి దూకిన దృశ్యాలు కనిపించాయి. దూకిన పాక్ పైలట్ ఏమయ్యాడన్నదికి ఇంకా తెలియరాలేదు. -
పాక్‌కు ఎఫ్-16 విమానాలు ఇవ్వొద్దు
అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం వాషింగ్టన్: పాక్‌కు ఎఫ్-16 యుద్ధవిమానాలు సహా ఆయుధాలేవీ విక్రయించవద్దంటూ అమెరికా ప్రతినిధుల సభలో పలువురు సభ్యులు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను పాక్ తమ పౌరులపైనే, ముఖ్యంగా బెలూచిస్తాన్ ప్రాంతవాసులపై వినియోగిస్తోందని ఆరోపించారు. విక్రయాన్ని అడ్డుకోవాలంటూ రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి రాండ్ పాల్ ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికాలో ఉగ్రదాడులకు పాల్పడిన లాడెన్‌ను పట్టుకోవడానికి సహకరించిన పాకిస్తానీ షకీల్ అఫ్రీదిని పాక్ వేధిస్తోందని ప్రతినిధుల సభ సభ్యుడు రోహ్రబాచర్ పేర్కొన్నారు. -
'మా యుద్ధ విమానాలు పాక్‌కు అవసరం'
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు అమ్మడాన్ని అగ్రరాజ్యం అమెరికా సమర్థించుకుంది. భారత్‌కు విషయం ఆందోళన కలిగిస్తుందని తాము భావించడంలేదని చెప్పింది. పైగా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఈ విధంగా తమ సహాయం పాకిస్థాన్‌కు అవసరం అని చెప్పింది. నాలుగు రోజుల కిందట ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు అమ్ముతున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పెంటగాన్ ప్రెస్ కార్యదర్శి పీటర్ కుక్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'మేం పాకిస్థాన్‌కు యుద్ధవిమానాలు అమ్మడం ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కునేందుకు అదనపు బలంగా పనిచేస్తుంది. అది వారి జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. ఇది భారత్‌కు ఆందోళన కలిగిస్తుందని మేం భావించడం లేదు. మేం పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలను, భారత్‌తో ఉన్న సంబంధాలను వేర్వేరుగా చూస్తున్నాం. ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. తన సామర్థ్యాలను పెంచుకోవడం ముఖ్యమైన అంశంగా మేం భావిస్తున్నాం' అని ఆయన అన్నారు. -
ఆయుధ వ్యాపారం
అమెరికా ఎప్పటిలా చేసిన తప్పునే చేయదల్చుకున్నట్టుంది. పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 రకం యుద్ధ విమానాలను విక్రయించాలని తీసుకున్న నిర్ణయం ఆ సంగతినే వెల్లడిస్తున్నది. ఈ విమానాలకు దాదాపు 70 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని, అవి అణ్వస్త్రాలను మోసుకెళ్లడానికి అనువైనవని తెలుస్తోంది. ఒకపక్క భారత్, పాకిస్తాన్ల మధ్య జరగవలసి ఉన్న చర్చలు పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాద దాడి పర్యవసానంగా నిలిచిపోయాయి. అందుకు సంబంధించిన ఆధారాలను భారత్ అందజేస్తే బాధ్యులుగా భావిస్తున్నవారిని అరెస్టు చేస్తామని పాకిస్తానే చెప్పింది. ఆధారాలిచ్చి రోజులు గడుస్తున్నా ఇంతవరకూ ఆ సంగతిని తేల్చలేదు. పాకిస్తాన్‌కు నచ్చజెప్పడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ దశలో ప్రయత్నించాల్సిన అమెరికా...దాన్ని మరింత దిగజార్చే ధోరణిలో ప్రవర్తిస్తోంది. ఒకపక్క తన నిర్బంధంలో ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబై మారణకాండ కేసులో ముంబైలోని సెషన్స్ కోర్టుకు వీడియో లింక్ ద్వారా ఇస్తున్న సాక్ష్యాలు ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఎంతగా పెనవేసుకుపోయిందో చెబుతున్నాయి. తామూ ఉగ్రవాద బాధితులమేనని తరచు చెప్పే పాకిస్తాన్ ఈ విషయంలో తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలేమిటో ఎవరికీ తెలియదు. ఈ దశలో ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని నిర్ణయించడం ఎంత వరకూ సహేతుకమో అమెరికాకు తెలియాలి. రెండు దేశాలూ నిరంతరం ఉద్రిక్త వాతావరణంలో బతుకీడ్వాలని, అప్పుడు మాత్రమే తమ ఆయుధ వ్యాపారం సజావుగా సాగుతుందని అది భావిస్తున్నట్టు కనబడుతోంది. ఫక్తు వ్యాపారం చేసుకుంటూ అది కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసమేనంటూ లోకాన్ని నమ్మించాలని చూస్తోంది. అణ్వాయుధాలను తీసుకెళ్లగల ఈ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడం ఎలా సాధ్యం? ఈ వాదన నమ్మశక్యంగా ఉందా? పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని, ఉగ్రవాదులకు అవసరమైన శిక్షణనూ, ఆయుధాలనూ అందజేస్తున్నదని అమెరికాకు దశాబ్దాలుగా స్పష్టంగా తెలుసు. అయినా ఆ దేశానికి సైనిక సాయం అందించడంలో ఏనాడూ అమెరికా వెనకా ముందూ ఆలోచించలేదు. తమ దేశంలో ఉగ్రవాదులు విలయం సృష్టించాక అమెరికా మారినట్టే కనబడినా అది కొద్దికాలమే. సాయం అందజేయాల్సి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పడం లేదా చడీచప్పుడూ లేకుండా చేయదల్చుకున్నది చేయడం అమెరికాకు అలవాటుగా మారింది. 2012లో ఒకసారి షరతులు ఎత్తేసి సాయం చేసినప్పుడు అమెరికన్ కాంగ్రెస్‌కు ఒబామా సర్కారు వింత వాదనను వినిపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి పాక్ తీసుకుంటున్న చర్యలు సక్రమంగా ఉన్నాయని భావించకపోయినా, అక్కడి ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియను ‘ప్రభావితం’ చేసేందుకు సాయం కొనసాగించక తప్పడం లేదని వింత తర్కం వినిపించింది. ఇప్పుడు ఎఫ్-16 యుద్ధ విమానాలను అమ్మడం కోసం ఆ మాదిరి కథనే చెబుతోంది. ఆయుధ వ్యాపారం సజావుగా చేసుకోవాలను కున్నప్పుడల్లా పాకిస్తాన్‌కు భుజకీర్తులను తగిలించడం అమెరికాకు అలవాటైంది. యుద్ధ విమానాల అమ్మకంపై మొన్న డిసెంబర్లోనే ఒబామా ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. విదేశీ సైనిక సాయంపై లాంఛనంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది సరికాదని డెమొక్రటిక్ పార్టీలోని ముఖ్యులు ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు. అయినా ఒబామా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోదల్చుకోలేదు. పాక్ వద్ద ప్రస్తుతం ఉన్న ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉగ్రవాద నిర్మూలనలో అమోఘంగా ఉపయోగపడుతున్నాయని, అందుకే మరిన్ని అందజేయడం అవసరమని భావించామని చెబుతోంది. ఈ ప్రతిపాదనపై అమెరికన్ కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, వ్యాపార లాబీల ప్రయోజనాలకు భిన్నమైన నిర్ణయం వస్తుందా అన్నది అనుమానమే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరి కొన్నాళ్లలో జరగనున్న నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందని అనుకోనవసరం లేదు. పాకిస్తాన్ వైమానిక దళం వద్ద ఇప్పటికే ఎఫ్-16లు 70 వరకూ ఉన్నాయి. 1980 ప్రాంతంలోనే పాక్ వైమానిక దళానికి ఈ విమానాల అమ్మకం మొదలైంది. అయితే అణ్వస్త్ర కార్యక్రమంలో పాక్ చురుగ్గా పాల్గొంటున్నదని అందిన సమాచారంతో ఆ దేశానికి ఇవ్వాల్సిన 28 యుద్ధ విమానాలను ప్రెస్లర్ సవరణకింద ఆపేస్తున్నట్టు 1990లో అమెరికా ప్రకటించింది. కానీ 2006లో ఈ అమ్మకాలను పునరుద్ధరించింది. ఆ సంవత్సరం అధునాతన బ్లాక్ 52 రకం ఎఫ్-16 యుద్ధ విమానాలు 18 అందజేయాలని ఇరు దేశాలమధ్యా ఒప్పందం కుదిరింది. 2010లో కొన్నిటిని, 2012లో మరికొన్నిటిని అందజేసింది. దానికి కొనసాగింపుగానే ఒబామా ప్రభుత్వం తాజా ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన 15 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని నిరుడు మార్చిలోనే అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ నిలుపుదల చేసింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ అర్ధవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆ సందర్భంగా కమిటీ పేర్కొంది. నిరుడు మార్చికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో వచ్చిన మార్పేమిటో అమెరికా చెప్పాలి. అమెరికా వ్యవహార శైలి ఆదినుంచీ భారత్-పాకిస్తాన్‌లమధ్య పొరపొచ్చాలను మరింత పెంచేదిగానే ఉంటోంది. ముంబై మారణకాండ జరిగిన ఏడాదికే డేవిడ్ కోల్మన్ హెడ్లీ పట్టుబడినా ఆ కేసు విషయంలో మనకు సరైన సహకారం అందజేయలేదు. అతన్ని భారత్‌కు అప్పగించడానికి బదులు తమ నిర్బంధంలో ఉండగా మాత్రమే ప్రశ్నించడానికి అంగీకరించింది. 2010లో అలాంటి అవకాశం ఇచ్చాక మళ్లీ నేరుగా మన న్యాయస్థానం ముందు అతను సాక్ష్యం ఇవ్వడానికి ఇన్నాళ్లుపట్టింది. ప్రస్తుతం హెడ్లీ సాక్ష్యం చెబుతున్నాడు గనుక పాకిస్తాన్‌కు ఎఫ్-16లు విక్రయించినా ఈ దశలో భారత్ ఎలాంటి అభ్యంతరమూ చెప్పదని అమెరికా భావించినట్టు కనబడుతోంది. బలాబలాల సమతూకం పేరుతో ఆయుధ విక్రయం సాగించే అమెరికా ధోరణివల్ల పోటీ పెరిగి ఉద్రిక్తతలు ఎక్కువవుతున్నాయి. పేదరికం నిర్మూలనకూ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకూ ఉపయోగపడవలసిన సొమ్ము రక్షణ కొనుగోళ్లకు వ్యయమవుతున్నది. భారత్, పాక్‌ల మధ్య శాంతిసామరస్యాలను కోరుకునేవారందరూ అమెరికా ధోరణులను నిరసించాలి. దాని ఆయుధ వ్యాపారాన్ని ప్రశ్నించాలి. -
ఎఫ్16ల కొనుగోలులో భారత్ అభ్యంతరంపై పాక్ విస్మయం
ఇస్లామాబాద్/ముంబై: అమెరికా తమకు ఎఫ్16 యుద్ధ విమానాలను అమ్మాలని తీసుకున్న నిర్ణయంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం విస్మయం కలిగించిందని పాకిస్తాన్ పేర్కొంది. భారత్ ఒకవైపు పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంటూ మరో వైపు తమ విషయంలో ఇలా స్పందించడం సబబు కాదని వ్యాఖ్యానించింది. భారత్ వద్ద పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రి ఉందని తెలిపింది. ఎఫ్16లతో ఉగ్రవాదంపై పోరులో పాక్ సామర్థ్యం పెరుగుతుందని అమెరికా సర్కారు చేసిన వ్యాఖ్యలను సమర్థించింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పాక్‌కు విమానాలను విక్రయించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ సమర్థించుకున్నారు. తమ రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల కొనసాగింపులో భాగంగానే ఈ నిర్ణయం జరిగిందని ముంబైలో తెలిపారు. పాత ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. -
పాక్‌కు అమెరికా ఫైటర్ జెట్లు.. భారత్ తీవ్ర ఆగ్రహం
ఎవరు ఎంత వద్దని చెప్పినా.. పాకిస్థాన్‌కు 8 ఎఫ్-16 బ్లాక్ -52 విమానాలను అమ్మాలని ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 4770 కోట్లు. అమెరికా విదేశాంగ శాఖ ఈ అమ్మకానికి ఆమోదం తెలిపిందని పెంటగాన్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు, చొరబాట్లను ఎదుర్కొనేందుకు ఈ యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు ఇవ్వడం సమంజసమేనని అమెరికా అంటోంది. కానీ అమెరికా చర్యను భారత్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై తన నిరసనను తెలియజేసేందుకు భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మను పిలిపించింది. ఉదయం 9.30 గంటల సమయంలో రిచర్డ్ వర్మ ఢిల్లీ సౌత్ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. 26/11 దాడుల్లో పాకిస్థాన్ హస్తం ఉందన్న విషయం డేవిడ్ హెడ్లీ విచారణలో స్పష్టంగా తేలుతున్నా, అమెరికా నుంచే హెడ్లీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతున్నా కూడా ఇప్పుడు పాకిస్థాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు అమ్మడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తోంది. దీనివల్ల భారత ఉపఖండంలో ఆయుధపోటీకి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తోంది. -
పాకిస్థాన్ కు అమెరికా ఝలక్!
వాషింగ్టన్: భారత్ లో పఠాన్ కోట్ పై దాడి ప్రభావం పాకిస్థాన్ పై పడుతోంది. ఆ దేశానికి అమెరికా ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ కు ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల అమ్మే ఆలోచనకు అమెరికా బ్రేక్ వేసింది. దీనిపై అప్పుడే తుది నిర్ణయానికి రాకుండా నిలుపుదల చేసింది. పాకిస్థాన్ కు ఎనిమిది ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాలు విక్రయించేందుకు అమెరికా అంతకుముందు ప్రాథమిక ఒప్పందాలు చేసుకుంది. దీనిపై కాంగ్రెస్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా దీనికి కాంగ్రెస్ సభ్యులు అంత సముఖంగా లేనట్లు తెలుస్తోందని అక్కడి స్థానిక పత్రిక ఒకటి తెలిపింది. పాకిస్థాన్ ఈ విమానాలను చివరకు ఎలాంటి పనులకు ఉపయోగిస్తుందో అనే అనుమానాలను కూడా ఇంకొందరు వెలిబుచ్చినట్లు సమాచారం. సెనేట్ కూడా పాకిస్థాన్ కు ఇప్పుడే జెట్ విమానాలు విక్రయించవద్దని ఒబామా పాలన విభాగానికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయిలో నిలిచిపోయినట్లు కాదని.. కొంతకాలంపాటు ఇలా నిలిపేసి అనంతరం సరైన సమయం అని భావించినప్పుడు, అందరితో చర్చించి ఏకాభిప్రాయం పొందితే అప్పుడు విక్రయించాలని భావిస్తోందని కూడా ఆ పత్రిక తెలిపింది. భారత్ లోని పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పాకిస్థాన్ సీరియస్ గా స్పందించాలని, నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకొని ఉగ్రవాదానికి ఆ దేశం పూర్తిగా వ్యతిరేకం అని నిరూపించుకోవాలని అమెరికా గట్టిగా చెప్పిన మరుసటి రోజే యుద్ధ విమానాల విక్రయ ఆలోచనను ప్రస్తుతానికి నిలిపిఉంచేందుకు అమెరికా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.