'మా యుద్ధ విమానాలు పాక్‌కు అవసరం'
వాషింగ్టన్: పాకిస్థాన్కు యుద్ధ విమానాలు అమ్మడాన్ని అగ్రరాజ్యం అమెరికా సమర్థించుకుంది. భారత్కు విషయం ఆందోళన కలిగిస్తుందని తాము భావించడంలేదని చెప్పింది. పైగా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఈ విధంగా తమ సహాయం పాకిస్థాన్కు అవసరం అని చెప్పింది. నాలుగు రోజుల కిందట ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్కు అమ్ముతున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పెంటగాన్ ప్రెస్ కార్యదర్శి పీటర్ కుక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
'మేం పాకిస్థాన్కు యుద్ధవిమానాలు అమ్మడం ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కునేందుకు అదనపు బలంగా పనిచేస్తుంది. అది వారి జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. ఇది భారత్కు ఆందోళన కలిగిస్తుందని మేం భావించడం లేదు. మేం పాకిస్థాన్తో ఉన్న సంబంధాలను, భారత్తో ఉన్న సంబంధాలను వేర్వేరుగా చూస్తున్నాం. ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. తన సామర్థ్యాలను పెంచుకోవడం ముఖ్యమైన అంశంగా మేం భావిస్తున్నాం' అని ఆయన అన్నారు.