
పాకిస్థాన్ కు అమెరికా ఝలక్!
వాషింగ్టన్: భారత్ లో పఠాన్ కోట్ పై దాడి ప్రభావం పాకిస్థాన్ పై పడుతోంది. ఆ దేశానికి అమెరికా ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ కు ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల అమ్మే ఆలోచనకు అమెరికా బ్రేక్ వేసింది. దీనిపై అప్పుడే తుది నిర్ణయానికి రాకుండా నిలుపుదల చేసింది. పాకిస్థాన్ కు ఎనిమిది ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాలు విక్రయించేందుకు అమెరికా అంతకుముందు ప్రాథమిక ఒప్పందాలు చేసుకుంది. దీనిపై కాంగ్రెస్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా దీనికి కాంగ్రెస్ సభ్యులు అంత సముఖంగా లేనట్లు తెలుస్తోందని అక్కడి స్థానిక పత్రిక ఒకటి తెలిపింది.
పాకిస్థాన్ ఈ విమానాలను చివరకు ఎలాంటి పనులకు ఉపయోగిస్తుందో అనే అనుమానాలను కూడా ఇంకొందరు వెలిబుచ్చినట్లు సమాచారం. సెనేట్ కూడా పాకిస్థాన్ కు ఇప్పుడే జెట్ విమానాలు విక్రయించవద్దని ఒబామా పాలన విభాగానికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయిలో నిలిచిపోయినట్లు కాదని.. కొంతకాలంపాటు ఇలా నిలిపేసి అనంతరం సరైన సమయం అని భావించినప్పుడు, అందరితో చర్చించి ఏకాభిప్రాయం పొందితే అప్పుడు విక్రయించాలని భావిస్తోందని కూడా ఆ పత్రిక తెలిపింది.
భారత్ లోని పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పాకిస్థాన్ సీరియస్ గా స్పందించాలని, నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకొని ఉగ్రవాదానికి ఆ దేశం పూర్తిగా వ్యతిరేకం అని నిరూపించుకోవాలని అమెరికా గట్టిగా చెప్పిన మరుసటి రోజే యుద్ధ విమానాల విక్రయ ఆలోచనను ప్రస్తుతానికి నిలిపిఉంచేందుకు అమెరికా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.