సాక్షి, న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా సరిహద్దులు వేడెక్కాయి. భారత్ వైమానిక దాడులతో ఉగ్రవాదులను చావుదెబ్బ తీయడంతో అసూయతో రగిలిపోతున్న పాకిస్థాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా బరితెగించి.. ఏకంగా భారత గగనతలంలోకి యుద్ధవిమానాలను దాయాది తరలించింది. పూర్తి అప్రమత్తంగా భారత వైమానిక దళం.. పాక్ యుద్ధ విమానాలను వెంటనే వెంబడించి తరిమికొట్టాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం పాక్‌లో కూలిపోయింది. భారత పైలట్ అభినందన్‌ను పాక్ సైన్యం సజీవంగా బంధించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవి..
ఇద్దరు కాదు ఒక్కరే: మాట మార్చిన పాకిస్థాన్
- ఇద్దరు భారత పైలట్లను పట్టుకున్నట్టు ప్రకటించిన పాకిస్థాన్ మాట మార్చింది. తమ అదుపులో ఉన్నది ఇద్దరు కాదు ఒక్కరేనని స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన పైలట్ ఒక్కరే తమ కస్టడీలో ఉన్నారని పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు తమ అధికారి పట్ల పాక్ సైన్యం వ్యవహరించిన తీరుపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
వేర్పాటువాదుల ఇళ్లలో సోదాలు
- సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో దక్షిణ కశ్మీర్‌లోని 11 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ముగ్గురు వేర్పాటువాదుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిపారు.
పాకిస్థాన్ దౌత్యవేత్తకు సమన్లు
- ఢిల్లీలోని పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ సయిద్ హైదర్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని హైదర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన బుధవారం సాయంత్రం భారత విదేశాంగ శాఖ ఎదుట హాజరయ్యారు. భారత పైలట్ అభినందన్‌ను హింసించడంపై వివరణ కోరినట్టు సమాచారం. ఎల్‌ఓసీలో తాజా పరిణామాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత పైలట్‌కు పాక్ చిత్రహింసలు
- తమకు పట్టుబడిన భారత్ పైలట్ కెప్టెన్ అభినందన్‌ను పాకిస్థాన్ చిత్రహింసలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పాకిస్థాన్ భూభాగంలో మిగ్-21 విమానం కూలిపోయినప్పుడు పారాచ్యూట్ ద్వారా కిందకు దిగిన అభినందన్‌పై పాక్ సైనికులు విచక్షణారహితంగా దాడి చేశారు. యుద్ధ ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందాన్ని పాక్ సైనికులు ఉల్లంఘించారు.
కూర్చుని మాట్లాడుకుందాం: ఇమ్రాన్‌ఖాన్
- సర్జికల్ దాడులతో పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్‌తో చర్చలకు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రతిపాదించారు. కలిసి కూర్చుని మాట్లాడుకుందామని సూచించారు. యుద్ధం మొదలైతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో తెలియదన్నారు. యుద్ధం వస్తే పరిస్థితులు తన చేతుల్లోగానీ, నరేంద్ర మోదీ చేతుల్లోగానీ ఉండవని అన్నారు. చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాలు లెక్క తప్పాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ఆయుధాలున్నాయని లెక్క తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
ఐఏఎఫ్ పైలట్ మిస్సింగ్: భారత్
- ఐఏఎఫ్ పైలట్ తప్పిపోయినట్టు భారత్ ధ్రువీకరించింది. అభినందన్ తమ అదుపులో ఉన్నట్టు పాకిస్థాన్ చెప్పుకుంటోందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ తెలిపారు. మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని తమ భూ భాగంలోని ప్రవేశించిన పాక్ వైమానిక యుద్ధ విమానాన్ని కూల్చివేశామని, ఈ క్రమంలో మిగ్-21 విమానాన్ని కోల్పోయినట్టు వివరించారు. అయితే తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లు ఉన్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది.
మా అదుపులో ఇద్దరు భారత్ పైలట్లు: పాకిస్థాన్
- తమ అదుపులో ఇద్దరు భారత పైలట్లు అభినందన్, వర్ధమాన్ ఉన్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ఒక పైలట్‌కు తీవ్ర గాయాలైనట్లు వెల్లడించింది. ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్న వీడియోను పాక్ పోస్ట్ చేసింది.
పాక్‌కు షాక్ ఇచ్చిన చైనా, రష్యా
- చైనాలో పర్యటిస్తున్న భారవ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దౌత్యం ఫలించింది. పూల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో చైనాతోపాటు రష్యా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గట్టి వార్నింగ్ ఇచ్చాయి. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ విడనాల్సిందేనని స్పష్టం చేస్తూ భారత్, రష్యా, చైనా సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఏ చర్యనైనా ఖండిస్తున్నామని మూడు దేశాలు తేల్చిచెప్పాయి.
రెండు కూల్చాం.. ఇద్దరి అరెస్టు.. పాక్ కట్టుకథలు!
- భారత వైమానిక దాడుల నేపథ్యంలో కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్థాన్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. తమ వైమానిక దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ భూభాగంలోకి వచ్చిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని, ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లను అరెస్టు చేశామని పాక్ ఆర్మీ ప్రకటించింది. అరెస్టైన ఇద్దరిలో ఒకరు గాయపడితే.. ఆస్పత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. అంతేకాదు తమ అధీనంలో ఉన్న భారత పైలట్ అంటూ ఒక వీడియో విడుదల చేసింది. ‘నేను వింగ్ కమాండర్ అభినందన్‌ను. ఐఏఎఫ్ అధికారిని. నా సర్వీసు నెంబర్ 27981’ అని పైలట్ చెప్తున్న అంశాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, పాక్ వాదన కట్టుకథ మాత్రమేనని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు పాక్ దినపత్రిక ‘డాన్’ వెబ్‌సైట్‌లో భారత విమానాన్ని కూల్చినట్టు ఓ ఫొటోను పెట్టి కథనాన్ని వండివార్చారు. అయితే, నాలుగేళ్ల కిందట కూలిపోయిన ఐఏఎఫ్ శిక్షణ విమానం ఫొటోను వాడుకొని.. ఈ విమానాన్నే పాక్ కూల్చేసిందని ఈ కథనంలో ఉటంకించారు. దీంతో ఆ పత్రిక కథనం ఫేక్ అని అర్థమవుతోంది.
- ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ విమానాశ్రయంలోనూ తాత్కాలికంగా వైమానిక కార్యకలాపాలు రద్దు..
మన విమానాలను పాక్ కూల్చలేదు..
- పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత వైమానిక దళం హై అలర్ట్‌గా ఉంది. మరోవైపు భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూల్చివేసినట్టు పాకిస్తాన్ చెబుతున్న మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పాక్ చేస్తున్న ప్రకటనలను ఖండించింది. దాడులు జరిగినట్టు పాక్ మీడియా చూపిస్తున్న దృశ్యాలు గతంలో జోధ్‌పూర్ ప్రమాదానికి సంబంధించినవని తెలిపింది. పాత దృశ్యాలు చూపించి పాక్ తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తుందని విమర్శించింది.
పాక్ బరితెగింపు.. పరిస్థితిని సమీక్షిస్తున్న మోదీ
- ఢిల్లీ: ప్రధాని నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం.. కశ్మీర్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పాకిస్థాన్ కవ్వింపు చర్యలు.. అనంతరం తలెత్తిన పరిణామాలను మోదీకి వివరిస్తున్న జాతీయ భద్రతా ఏజెన్సీ అధికారులు వివరిస్తున్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వారితో కలిసి సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై మోదీ సమీక్షిస్తున్నారు.
సరిహద్దు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల మూసివేత..
- భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భద్రత కారణాల దృష్ట్యా చండీగఢ్, అమృతసర్, శ్రీనగర్, జమ్ము, లేహ్ విమానాశ్రయాలను మూసివేశారు.
- మరోవైపు రాజస్తాన్ నుంచి బయలుదేరిన విమానాలతోపాటు, పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే అంతర్జాతీయ విమానాలను అధికారులు దారి మళ్లించారు. పాక్ కూడా భారత్ వైపు ప్రయాణించే అన్ని పౌర విమానాలను రద్దు చేసింది. అలాగే సరిహద్దుల్లోని విమానాశ్రయాలను మూసివేసింది.
పాకిస్థాన్ విమానాలన్నీ బంద్!
- సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం.. యుద్ధవిమానాల కూల్చివేత నేపథ్యంలో పాకిస్థాన్ తమ దేశానికి చెందిన విమానాశ్రయాల కార్యకలాపాలను నిలిపివేసింది. లాహోర్, ముల్తాన్, ఫైజలాబాద్, సియాకోట్, ఇస్లామాబాద్ విమానాశ్రయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకల నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
- భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలు రాజౌరి సెక్టార్‌లోని ఆర్మీ పోస్టులకు సమీపంలో బాంబులు జారవిడిచాయి. ఈ బాంబు శకలాలకు సంబంధించిన దృశ్యాలివి...
- సరిహద్దుల్లోని నౌషెరా సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఎయిర్‌స్పెస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానాన్ని భారత వాయుసేన వెంటనే కూల్చివేసింది. నౌషెరా సెక్టార్‌లోని పాకిస్థాన్ భూభాగం పరిధిలోకి వచ్చే లామ్ వ్యాలీలో ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిపోవడానికి ముందే పారాచ్యుట్ సాయంతో పాక్ పైలట్ కిందికి దూకిన దృశ్యాలు కనిపించాయి. దూకిన పాక్ పైలట్ ఏమయ్యాడన్నదికి ఇంకా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment