న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విమానాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న తమ శిక్షణ శిబిరాలపై దాడులు చేయడం వాస్తవమేనని జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ సోదరుడు మౌలానా అమ్మార్ ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. భారత యుద్ధ విమానాలు ఐఎస్‌ఐ, పాక్ సైన్యంపై కాకుండా బాలాకోట్‌లోని శిక్షణ శిబిరాలపై దాడులు జరిపాయని మౌలానా అమ్మార్ వెల్లడిస్తున్నట్లుగా అందులో ఉంది. అయితే, పాక్ సైన్యానికి పట్టుబడిన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అతడు విమర్శించాడు.
‘భారత విమానాలు బాంబులు వేసింది ఉగ్ర సంస్థల ప్రధాన కేంద్రంపైనో, కీలక నేతల సమావేశ ప్రాంతంపైనో కాదు.. జిహాద్ లక్ష్యాలపై తరగతులు నిర్వహించే కేంద్రంపైన బాంబులు వేశాయి’ అని వివరించాడు. ఐఏఎఫ్ దాడుల్లో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)కు చెందిన కల్నల్ సలీమ్ కరీ, జైషే సంస్థ శిక్షకుడు మౌలానా మోయిన్ చనిపోయినట్లు సమాచారం. పుల్వామా ఘటనకు ప్రతీకారంగా జైషే సంస్థకు చెందిన అతిపెద్ద ఉగ్ర శిక్షణ శిబిరంపై బాంబు దాడులు జరిపినట్లు భారత్ ఇంతకుముందే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment