విద్యార్థుల వివరాలకు హాట్‌లైన్‌ | Indian embassy in US opens 24/7 hotline to assist Indian students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల వివరాలకు హాట్‌లైన్‌

Published Sun, Feb 3 2019 4:34 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Indian embassy in US opens 24/7 hotline to assist Indian students - Sakshi

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికాలో వీసా మోసం కేసులో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలు కృషి చేస్తున్నాయి. అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు అందించేందుకు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో హాట్‌లైన్లను ఏర్పాటు చేశారు. +12023221190, +12023402590 నంబర్లకు ఫోన్‌ చేయడం ద్వారా అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలను వారి బంధువులు, స్నేహితులు తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ నంబర్లు 24x7 పనిచేస్తాయనీ, cons3. washington@mea.gov.in కు ఈ–మెయిల్‌ పంపడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. విద్యార్థి వీసాలను దుర్వినియోగం చేస్తున్న విదేశీయులను పట్టుకునేందుకు అమెరికా అధికారులే ఫార్మింగ్‌టన్‌ యూనివర్సిటీ పేరుతో నకిలీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వల పన్నడం తెలిసిందే. ఈ యూనివర్సిటీలో 600 మంది విద్యార్థులుగా చేరారు. వారిని చేర్పించిన 8 మంది మధ్యవర్తులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

ఈ యూనివర్సిటీలో తరగతులుండవు, నిబంధనల ప్రకారం ఈ విశ్వవిద్యాలయం పనిచేయదని తెలిసినా కేవలం అమెరికాలో ఉండి, ఇతర ఉద్యోగాలు చేసుకోవడం కోసమే ఆ 600 మంది ఇక్కడ చేరారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం వారికి తెలియదనీ, చాలా యూనివర్సిటీ కోర్సుల్లో చదువుతున్న సమయంలోనే ఉద్యోగాలు చేసుకునే వీలు కూడా ఉంది కాబట్టి ఇది కూడా అసలైనదేనని విద్యార్థులు భావించారని అరెస్టయిన వారి తరఫు న్యాయవాదులు అంటున్నారు.

రాజకీయ చర్య తీసుకున్న భారత్‌
విద్యార్థులు అరెస్టవ్వడంపై భారత్‌ శనివారం రాజకీయపరమైన చర్య తీసుకుంది. అరెస్టయిన విద్యార్థులను కలిసేందుకు భారత దౌత్యాధికారులను తక్షణం అనుమతించాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కోరింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామనీ, చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే కొందరు దౌత్యాధికారులు అరెస్టయిన విద్యార్థులను కలుసుకున్నారని చెప్పింది. అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలనీ, వారికి ఇష్టం లేకుండానే అమెరికా నుంచి పంపించి వేయద్దని భారత్‌ కోరింది.

ఎక్కడికీ వెళ్లకుండా ప్రత్యేక పరికరాలు
ఈ యూనివర్సిటీలో చేరిన 130 మందిని (వారిలో 129 మంది భారతీయులు) ఇప్పటికే అరెస్టు చేసిన అధికారులు, మరింత మందిని త్వరలో పట్టుకునే చాన్సుంది. కాగా, కొంతమంది విద్యార్థులు వారు నివసిస్తున్న ప్రదేశం నుంచి ఎక్కువ దూరం బయటకు వెళ్లడానికి వీలు లేకుండా వారి కాలి చీలమండ దగ్గర ట్రాకింగ్‌ పరికరాలను అమర్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement