visa fraud scam
-
అమెరికాలో హెచ్1బీ స్కామ్
వాషింగ్టన్/న్యూయార్క్: హెచ్–1బీ వీసా కుంభకోణంలో భారత సంతతికి చెందిన ముగ్గురు కన్సల్టెంట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే నెలలో వీరి కేసు విచారణకు రానుంది. సాంటాక్లారాకు చెందిన దత్తపురం కిశోర్(49), టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నివాసి కుమార్ అశ్వపతి(49), సాన్‌జోస్‌కు చెందిన సంతోష్ గిరి(42) కలిసి సాంటాక్లారాలో నానోసెమాంటిక్స్ అనే కన్సల్టింగ్ సంస్థను నడిపేవారు. వీరు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉండే సాఫ్ట్వేర్, టెక్నాలజీ సంస్థలకు అవసరమైన విదేశీ వృత్తి నిపుణులను ఎంపిక చేసేవారు. కానీ, వీరు హెచ్–1బీ వీసాకు కీలకమైన ఐ–129 దరఖాస్తు సమర్పించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. పలు ప్రముఖ కంపెనీలతోపాటు తమ నానోసెమాంటిక్స్‌కు ఫలానా ఉద్యోగం కోసం విదేశీ నిపుణుల అవసరం ఉందంటూ నకిలీ పత్రాలతో ‘ఐ–129’దరఖాస్తు చేసేవారు. అలా వచ్చిన వారికి ఆ తర్వాత స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేవారు. ఇందుకుగాను వారి నుంచి కొంతమొత్తంలో వసూలు చేసేవారు. వాస్తవానికి ఆయా సంస్థల్లో ఎలాంటి ఖాళీలు ఉండవు. అభియోగాలు రుజువైతే గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1.50 కోట్ల జరిమానాతోపాటు ఒక్కో నేరానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బీమా మోసం.. భారతసంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలు ఆరోగ్య బీమాకు సంబంధించి భారీ మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తికి అమెరికా కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మిషిగాన్‌కు చెందిన బాబూభాయ్ భూరాభాయ్ రాథోడ్ వైద్యులకు లంచాలిచ్చి తన ఆరోగ్య బీమా కంపెలకు పేషెంట్లను రెఫర్ చేయించుకునేవాడు. ఈ నేరం రుజువు కావడంతో గతంలో ఓ కోర్టు జైలు శిక్ష విధించింది. జైలునుంచి బయటికొచ్చాకా అవే మోసాలుచేశాడు. దీంతో మరో కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరోవైపు, మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ముగ్గురు భారతీయులను అక్కడి అధికారులు నిర్బంధించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన నేరంపై న్యూయార్క్ నార్తర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ వీరిని విచారించనున్నారు. ‘కాల్ సెంటర్’లో భారతీయుడికి జైలు అమెరికాలో వెలుగుచూసిన భారీ కాల్‌సెంటర్ కుంభకోణంలో భారతీయుడికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. అధికారులమంటూ చెప్పుకుని అమెరికా వాసులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన నేరానికి నిషిత్‌కుమార్ పటేల్ అనే వ్యక్తికి కోర్టు 8 ఏళ్ల 9 నెలల జైలు, రూ.1.30 కోట్ల జరిమానా విధించింది. భారత్‌లో నడిచే కాల్ సెంటర్ల నుంచి కొందరు వ్యక్తులు అమెరికా వాసులకు ఫోన్లు చేసేవారు. తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారులమని చెప్పి, రెవెన్యూ శాఖ బకాయిలను చెల్లించకుంటే జైలుఖాయమని బెదిరించేవారు. దీంతో వారు చెప్పినంత సొమ్మును చెల్లించేందుకు సిద్ధపడేవారు. వేర్వేరు మార్గాల్లో ఆ డబ్బును రాబట్టేందుకు అమెరికాలో కూడా ఒక ముఠా ఉండేది. వీరంతా కలిసి 2014–16 సంవత్సరాల్లో ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు ఈ దందా గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 25వ తేదీన అలెజాండ్రో జువారెజ్ అనే వ్యక్తికి 15 నెలల జైలు శిక్ష పడింది. నిషిత్‌కుమార్‌పై చేసిన ఆరోపణలను పోలీసులు జనవరి 9వ తేదీన న్యాయస్థానంలో రుజువు చేయడంతో సోమవారం శిక్ష ఖరారైంది. -
విద్యార్థుల వివరాలకు హాట్‌లైన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో వీసా మోసం కేసులో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలు కృషి చేస్తున్నాయి. అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు అందించేందుకు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో హాట్లైన్లను ఏర్పాటు చేశారు. +12023221190, +12023402590 నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలను వారి బంధువులు, స్నేహితులు తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నంబర్లు 24x7 పనిచేస్తాయనీ, cons3. washington@mea.gov.in కు ఈ–మెయిల్ పంపడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. విద్యార్థి వీసాలను దుర్వినియోగం చేస్తున్న విదేశీయులను పట్టుకునేందుకు అమెరికా అధికారులే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో నకిలీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వల పన్నడం తెలిసిందే. ఈ యూనివర్సిటీలో 600 మంది విద్యార్థులుగా చేరారు. వారిని చేర్పించిన 8 మంది మధ్యవర్తులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ యూనివర్సిటీలో తరగతులుండవు, నిబంధనల ప్రకారం ఈ విశ్వవిద్యాలయం పనిచేయదని తెలిసినా కేవలం అమెరికాలో ఉండి, ఇతర ఉద్యోగాలు చేసుకోవడం కోసమే ఆ 600 మంది ఇక్కడ చేరారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం వారికి తెలియదనీ, చాలా యూనివర్సిటీ కోర్సుల్లో చదువుతున్న సమయంలోనే ఉద్యోగాలు చేసుకునే వీలు కూడా ఉంది కాబట్టి ఇది కూడా అసలైనదేనని విద్యార్థులు భావించారని అరెస్టయిన వారి తరఫు న్యాయవాదులు అంటున్నారు. రాజకీయ చర్య తీసుకున్న భారత్ విద్యార్థులు అరెస్టవ్వడంపై భారత్ శనివారం రాజకీయపరమైన చర్య తీసుకుంది. అరెస్టయిన విద్యార్థులను కలిసేందుకు భారత దౌత్యాధికారులను తక్షణం అనుమతించాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కోరింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామనీ, చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే కొందరు దౌత్యాధికారులు అరెస్టయిన విద్యార్థులను కలుసుకున్నారని చెప్పింది. అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలనీ, వారికి ఇష్టం లేకుండానే అమెరికా నుంచి పంపించి వేయద్దని భారత్ కోరింది. ఎక్కడికీ వెళ్లకుండా ప్రత్యేక పరికరాలు ఈ యూనివర్సిటీలో చేరిన 130 మందిని (వారిలో 129 మంది భారతీయులు) ఇప్పటికే అరెస్టు చేసిన అధికారులు, మరింత మందిని త్వరలో పట్టుకునే చాన్సుంది. కాగా, కొంతమంది విద్యార్థులు వారు నివసిస్తున్న ప్రదేశం నుంచి ఎక్కువ దూరం బయటకు వెళ్లడానికి వీలు లేకుండా వారి కాలి చీలమండ దగ్గర ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. -
వీసా స్కాంలో 10 మంది ఎన్నారైల అరెస్టు!
అమెరికన్ అధికారులు ఒక భారీ స్టింగ్ ఆపరేషన్ చేశారు. అధికారులే ఒక నకిలీ యూనివర్సిటీని సృష్టించి, దాని ద్వారా... ఒకే సమయంలో స్టూడెంట్, వర్క్ పర్మిట్ వీసాలు రెండింటినీ పొందిన 21 మందిని అరెస్టు చేశారు. వారిలో పది మంది ఎన్నారైలు కూడా ఉన్నారు. ఈ స్కాంలో దాదాపు వెయ్యి మంది వరకు విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల్లో ఇప్పటికి 21 మందిని అమెరికన్ అధికారులు అరెస్టు చేశారు. నకిలీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం ద్వారా వీసాలు పొందేందుకు వీళ్లంతా ప్రయత్నించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ నకిలీ యూనివర్సిటీ సృష్టికర్తలు సాక్షాత్తు అమెరికాలోని హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏజెంట్లే! 26 దేశాలకు చెందిన దాదాపు వెయ్యిమందికి స్టూడెంట్ వీసాతో పాటు ఫారిన్ వర్కర్ వీసాలు కూడా ఇప్పించేందుకు ప్రయత్నించిన బ్రోకర్లు, రిక్రూటర్లు, యజమానులు అరెస్టయిన వారిలో ఉన్నారు. అమెరికాలో పనిచేసేందుకు వీసాలు, వర్క్ పర్మిట్లు పొందేందుకు భారతీయులు భారీ మొత్తంలో ఈ బ్రోకర్లకు సొమ్ము చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదిపాటు కొనసాగిన ఈ భారీ స్టింగ్ ఆపరేషన్‌లో ఎంతమంది భారతీయ విద్యార్థులు ట్రాప్‌లో పడిందీ అధికారులు ఇంకా వెల్లడించలేదు. అరెస్టయిన వాళ్లు ఏ దేశాలకు చెందినవారో అమెరికా అధికారులు వెల్లడించలేదు. వారిలో తాజేష్ కొడాలి, జ్యోతి పటేల్, షహజాదీ ఎం పర్వీన్, నేంద్ర సింగ్ ప్లాహా, సంజీవ్ సుఖిజా, హర్‌ప్రీత్ సచ్దేవ, అవినాష్ శంకర్, కార్తీక్ నిమ్మల, గోవర్ధన్ దేవరశెట్టి, సయ్యద్ ఖాసిం అబ్బాస్ తదితరులున్నారు. అధికారులు సృష్టించిన నకిలీ వర్సిటీలో అసలు అధ్యాపకులు గానీ, క్లాసులు గానీ, అసలైన విద్యార్థులు గానీ లేకపోయినా బ్రోకర్లు మాత్రం ఆ పేరు ఉపయోగించుకుని డబ్బు తీసుకుని వీసాలు ఇప్పించేశారు. వాళ్లకు ప్రధానంగా ఐ-20 ఫారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఈ తరహా బెడద ఎక్కువైపోవడంతో అమెరికన్ అధికారులు ఈ ఫేక్ యూనివర్సిటీని సృష్టించి, దాని ద్వారా మొత్తం డొంక కదిలించేందుకు వ్యూహం పన్నారు.