వీసా స్కాంలో 10 మంది ఎన్నారైల అరెస్టు!
అమెరికన్ అధికారులు ఒక భారీ స్టింగ్ ఆపరేషన్ చేశారు. అధికారులే ఒక నకిలీ యూనివర్సిటీని సృష్టించి, దాని ద్వారా... ఒకే సమయంలో స్టూడెంట్, వర్క్ పర్మిట్ వీసాలు రెండింటినీ పొందిన 21 మందిని అరెస్టు చేశారు. వారిలో పది మంది ఎన్నారైలు కూడా ఉన్నారు. ఈ స్కాంలో దాదాపు వెయ్యి మంది వరకు విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల్లో ఇప్పటికి 21 మందిని అమెరికన్ అధికారులు అరెస్టు చేశారు. నకిలీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం ద్వారా వీసాలు పొందేందుకు వీళ్లంతా ప్రయత్నించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ నకిలీ యూనివర్సిటీ సృష్టికర్తలు సాక్షాత్తు అమెరికాలోని హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఏజెంట్లే! 26 దేశాలకు చెందిన దాదాపు వెయ్యిమందికి స్టూడెంట్ వీసాతో పాటు ఫారిన్ వర్కర్ వీసాలు కూడా ఇప్పించేందుకు ప్రయత్నించిన బ్రోకర్లు, రిక్రూటర్లు, యజమానులు అరెస్టయిన వారిలో ఉన్నారు. అమెరికాలో పనిచేసేందుకు వీసాలు, వర్క్ పర్మిట్లు పొందేందుకు భారతీయులు భారీ మొత్తంలో ఈ బ్రోకర్లకు సొమ్ము చెల్లించుకున్నట్లు తెలుస్తోంది.
దాదాపు ఏడాదిపాటు కొనసాగిన ఈ భారీ స్టింగ్ ఆపరేషన్‌లో ఎంతమంది భారతీయ విద్యార్థులు ట్రాప్‌లో పడిందీ అధికారులు ఇంకా వెల్లడించలేదు. అరెస్టయిన వాళ్లు ఏ దేశాలకు చెందినవారో అమెరికా అధికారులు వెల్లడించలేదు. వారిలో తాజేష్ కొడాలి, జ్యోతి పటేల్, షహజాదీ ఎం పర్వీన్, నేంద్ర సింగ్ ప్లాహా, సంజీవ్ సుఖిజా, హర్‌ప్రీత్ సచ్‌దేవ, అవినాష్ శంకర్, కార్తీక్ నిమ్మల, గోవర్ధన్ దేవరశెట్టి, సయ్యద్ ఖాసిం అబ్బాస్ తదితరులున్నారు. అధికారులు సృష్టించిన నకిలీ వర్సిటీలో అసలు అధ్యాపకులు గానీ, క్లాసులు గానీ, అసలైన విద్యార్థులు గానీ లేకపోయినా బ్రోకర్లు మాత్రం ఆ పేరు ఉపయోగించుకుని డబ్బు తీసుకుని వీసాలు ఇప్పించేశారు. వాళ్లకు ప్రధానంగా ఐ-20 ఫారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఈ తరహా బెడద ఎక్కువైపోవడంతో అమెరికన్ అధికారులు ఈ ఫేక్ యూనివర్సిటీని సృష్టించి, దాని ద్వారా మొత్తం డొంక కదిలించేందుకు వ్యూహం పన్నారు.