న్యూజెర్సీ : ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఆటా (అమెరికన్ తెలుగు అసోషియేషన్) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు 600 మందికి వారెంట్లు జారీ చేయగా.. 100 మందిని అరెస్టు చేశారు. నకిలీ ఎడ్యుకేషనల్ కన్సల్‌టెన్సీ నిర్వహిస్తున్న మరో 8 మందిని కూడా అరెస్టు చేశారు. కాగా, ఆటా లీగల్ టీమ్ సంబంధిత అటార్నీలను సంప్రదించింది. యూఎస్‌లోని పలు భారతీయ విద్యార్థి సంఘాలతో సమావేశమైంది. ఫర్మింగ్‌టన్ యూనివర్సిటీ ఘటనలో చిక్కుకున్న బాధిత తెలుగు విద్యార్థులను బయటకు తెచ్చేందుకు ఇండియన్ అంబాసిడర్ హర్షవర్ధన్ సింఘాల, ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ స్వాతి విజయ్ కులకర్ణిలను ఆటా లీగల్ టీమ్ సభ్యులు కలిశారు. తదుపరి చేపట్టబోయే చర్యలపై వారితో చర్చించారు. ఇండియన్ ఎంబసీకి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీమ్‌రెడ్డి తెలిపారు. (అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు)
ఇమ్మిగ్రేషన్ అటార్నీలు రవికుమార్ మన్నం, మైఖేల్ సోఫో, హేమంత్ రామచెంద్రన్ ఆధ్వర్యంలో గురువారం (జనవరి 31) ఆటా వెబినార్ (ఇమ్మిగ్రేషన్ సెమినార్) సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. ఫేక్ ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఈ సదస్సులో సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. నకిలీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొంది ఇబ్బందులలకు గురికావద్దని అన్నారు. అమెరికా చట్టాల ఉల్లంఘించి కటకటాలపాలు కాకుండా పాటించాల్సిన మార్గదర్శకాలను అటార్నీలు సదస్సులో చెప్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment