అమెరికా పోలీసుల వలలో భారత విద్యార్థులు | Indian Students Arrested In America Over Immigration Fraud | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 1 2019 1:39 AM | Last Updated on Fri, Feb 1 2019 5:02 AM

Indian Students Arrested In America Over Immigration Fraud - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వీసా గడువు ముగిసినా అక్రమంగా నివాసం ఉంటున్న వారికోసం అమెరికా అధికారులు పన్నిన వలలో దాదాపు 600 మంది విదేశీ విద్యార్థులు చిక్కుకున్నారు. అమెరికా డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ సృష్టించిన ఫేక్‌ వర్సిటీ వలలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది భారతీయులే కాగా.. అందులో సగం తెలుగువారేనని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. న్యూజెర్సీలో 2015లో మూతపడ్డ ఫార్మింగ్‌టన్‌ వర్సిటీ పేరిట డీహెచ్‌ఎస్‌ కోర్సులు ఆఫర్‌ చేసింది. విద్యార్థులను చేర్పించిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థి వీసా గడువు ముగిసిన, ముగిసే దశలో ఉన్న దాదాపు 600 మంది విద్యార్థులు డీహెచ్‌ఎస్‌ వలలో పడ్డారు. ప్రోత్సాహకాలు ఆశించి పట్టుబడ్డ జాబితాలో ఎనిమిది మంది తెలుగు యువకులు ఉండటంతో వీరిని ఫెడరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.  

గుట్టు రట్టయిందిలా!: నకిలీ యూనివర్సిటీల్లో చేరి అమెరికాలో నివాసం ఉండటం కొత్త కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి ఘటనలు బయటపడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశీ విద్యార్థుల గుట్టు రట్టు చేయడానికి డీహెచ్‌ఎస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. అక్రమంగా నివా సం ఉంటున్న వారిని తేలిగ్గా పట్టుకునేందుకు వర్సిటీ వ్యూహాన్ని అమలుచేసింది. ఇందులో భాగంగా 2017 ఫిబ్రవరిలో మిషిగన్‌ రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్‌ ఫార్మింగ్టన్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చింది. వాషింగ్టన్‌ పోస్టు కథ నం ప్రకారం.. ఈ యూనివర్సిటీలో 800 మంది విద్యార్థులు చేరారు. అయితే వీరిలో 200 మంది విద్యార్థి వీసా గడువు ముగిసేందుకు.. రెండేళ్లు మిగిలుండగానే చేరారు. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలివేశారు. మిగిలిన వారిలో అత్యధికులు వీసా గడువు ముగిసినవారో.. లేక 6నెలల్లో వీసా ముగిసేవారో ఉన్నారు. వీరిలోనూ ఎక్కువమంది భారతీయులే. విద్యార్థి వీసా స్టేటస్‌ తెలుసుకోకుండా ఎక్కువమంది విద్యార్థులను చేర్పించిన భారత సంతతికి చెందిన ఎనిమిది మంది దళారులను అరెస్టు చేశారు. వారిలో అశ్వంత్‌ నూనె అనే వ్యక్తి ఫీజుల్లో ఏకంగా 25వేల డాలర్లు అధికంగా వసూలు చేసినట్టు డీహెచ్‌ఎస్‌ పేర్కొంది. ఈ ఉత్తుత్తి యూనివర్సిటీలో తరగతులు జరగవు. ఆన్‌లైన్‌ తరగతులు అసలే లేవు. కానీ డబ్బులు చెల్లించినందుకు స్టూడెంట్‌ వీసా గడువు పెంచుతారు. దీనికారణంగా వారు అమెరికాలో నివాసం ఉండడానికి, ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలు కలుగుతుంది. 

అరెస్టు అయిన వాళ్లు వీరే..
భరత్‌ కాకిరెడ్డి (ఫ్లోరిడా), సురేష్‌ కందాళ (వర్జీనియా), ఫణిదీప్‌ కర్నాటి (కెంటకీ), ప్రేమ్‌ రామ్‌పీసా (ఉత్తర కరోలినా), సంతోష్‌రెడ్డి సామ (కాలిఫోర్నియా), అవినాశ్‌ తక్కెళ్లపల్లి (పెన్సిల్వేనియా), అశ్వంత్‌ నూనె (జార్జియా), నవీన్‌ ప్రత్తిపాటి (టెక్సాస్‌), (న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం మేరకు)  

గడువు ఐదేళ్లు దాటితే.. 
మామూలుగా అమెరికాలో మాస్టర్స్‌ కోసం వెళ్లే విద్యార్థులకు ఐదేళ్ల వీసా ఇస్తారు. రెండు మూడేళ్లపాటు చదువుకుని, ఆ తర్వాత రెండు మూడేళ్లపాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) పేరుతో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ) ఇస్తారు. ఈఏడీ అమల్లో ఉన్న రెండు, మూడేళ్లలో హెచ్‌1బీ వీసాకు మారాలి. లేనిపక్షంలో వీసా గడువు పెంచుకునేందుకు వెంటనే ఏదో ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మరో కోర్సులో చేరాలి. అలా చేరకుండా అక్కడే ఉంటే వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. ఇలాంటి వారు అమెరికాలో వేలల్లో ఉన్నట్లు వెల్లడైంది. వీసా క్రిమినల్‌ అభియోగాల కింద అరెస్టయిన వారిని అయితే భారత్‌కు తిరిగి పంపించేస్తారు. అభియోగాలు రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష తప్పకపోవచ్చు.

చిరునామాలు ఇచ్చి దొరికిపోయిన విద్యార్థులు 
విశ్వవిద్యాలయంలో చేరడానికి విద్యార్థులు తమ చిరునామాలు సమర్పించారు. దీంతో వీరెక్కడున్నారో పట్టుకుని అరెస్టు చేయడం పోలీసులకు సులువైంది. రెండ్రోజుల క్రితం హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ (డీహెచ్‌ఎస్‌), ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు సంయుక్తంగా ఫ్లోరిడా, డెట్రాయిట్, వర్జీనియాలో నివాసం ఉంటున్న విద్యార్థుల ఇళ్లపై దాడులు చేశారు. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల పేరేమిటి? తరగతులు జరుగుతున్నాయా? లేదా ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతున్నారా? ఉంటే వాటి వివరాలు ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు విద్యార్థులు బిక్కమొహం వెయ్యాల్సి వచ్చింది. తాము ఇప్పటివరకు వర్సిటీకి వెళ్లలేదని.. మధ్యవర్తులు ఇచ్చిన సమాచారంతో అందులో చేరామని విద్యార్థులు చెప్పారు. దీంతో డీహెచ్‌ఎస్‌ దళారులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంది. కేవలం స్టూడెంట్‌ వీసా గడువు పొడిగించుకుని అమెరికాలో ఉండేలా చేస్తున్నందుకు.. ఒక్కో విద్యార్థి నుంచి 10–15 వేల డాలర్ల మేర దళారులకు చెల్లించినట్లు డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది. మామూలుగా అయితే నిర్ణీత గడువులో హెచ్‌1బీ రాని విద్యార్థులు మళ్లీ కొత్త కోర్సుల్లో చేరడం, వీసా గడువు పెంచుకోవడం సాధారణమైన విషయం. అయితే, ఉద్యోగాలు లేక, ఫీజులు చెల్లించే స్థోమత లేక అనేక మంది ఏదో ఒక పని చేస్తూ అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు. అలాంటి విద్యార్థుల్లో భారతీయులు అందులోనూ తెలుగువారే ఎక్కువగా ఉండడం గమనార్హం. 

ఫిబ్రవరి 5లోపే వచ్చేస్తే..! 
విద్యార్థి వీసా గడువు దాటినా అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారు.. వీలైనంత త్వరగా స్వదేశానికి వెడితే మంచిదని అమెరికా తెలుగు సంఘాలు సూచిస్తున్నాయి. అక్రమంగా ఉంటున్నవారు అటార్నీ (న్యాయవాది) సాయంతో తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించాలని.. ఆర్నెల్లకంటే తక్కువ గడువు ఉన్నవారు వెంటనే వెళ్లడం మంచిదంటున్నాయి. ‘అరెస్టు అయిన వారికి మేము న్యాయపరమైన సాయం అందిస్తాం. అరెస్టు కాని వారు, వీసా గడువు ముగిసిన వారు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలి’అని తెలంగాణ తెలుగు సంఘాల ప్రతినిధి జలగం నవీన్‌ అన్నారు. ‘నకిలీ పత్రాలతో అమెరికాలో నివాసం ఉంటున్న విదేశీ విద్యార్థుల్ని తిరిగి వారి దేశాలకు పంపించేందుకు గత కొన్నేళ్లుగా ఇమిగ్రేషన్‌ అధికారులు రహస్య ఆపరేషన్లు చేపడుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. యూనివర్సిటీ వివరాలు సరిగా తెలుసుకోకుండా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉండే ప్రయత్నం చేయవద్దంటూ అమెరికాకు వచ్చే విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నాం’అని ఆటా అధ్యక్షుడు పరమేశ్‌ భీమ్‌రెడ్డి వెల్లడించారు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్‌ సింగ్లాను కూడా ఆటా ప్రతినిధులు కలుసుకున్నారు. అరెస్ట్‌ వారెంట్లు జారీ అయిన విద్యార్థులకు అందించాల్సిన సాయంపై చర్చలు జరుపుతున్నారు. 
 
2016లోనూ ఇదే తరహా స్కామ్‌ 
మూడేళ్ల క్రితం కూడా అమెరికాలో ఇలాంటి వీసా కుంభకోణం బట్టబయలైంది. న్యూజెర్సీ యూనివర్సీటీలో స్టింగ్‌ ఆపరేషన్‌ చేసిన అధికారులు 11 మంది భారతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. 11 మంది చైనా విద్యార్థులు కూడా ఈ స్కామ్‌లో పట్టుబట్టారు. అంతకు ముందు 2011, 2012 సంవత్సరాల్లో కూడా కాలిఫోర్నియాలో ట్రైవ్యాలీ యూనివర్సిటీ, హెర్గాన్‌ యూనివర్సిటీలో కూడా ఇలాగే నకిలీ పత్రాలతో నివసిస్తున్న విద్యార్థుల్ని గుర్తించి.. స్వదేశాలకు పంపించారు. అయితే అప్పట్లో విద్యార్థులు నకిలీ యూనివర్సిటీ అని తెలియక మోసపోతే, ఇప్పుడు మాత్రం తెలిసి తెలిసి ఈ స్కామ్‌లో భాగస్వామ్యులయ్యారని ఆటా అధ్యక్షుడు భీమ్‌రెడ్డి పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement