Illegal migration
-
కెనడాలో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష..
న్యూయార్క్: కెనడాలోని ఒంటారియో నివాసముంటున్న భారతీయుడు సిమ్రాన్ జిత్ షల్లీ సింగ్(40) మానవ అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష. 250,000 జరిమానా విధించింది అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు. సింగ్ మొదటగా ఆరుగురిని అక్రమ రవాణా చేయగా న్యూయార్క్ లో ఉండగా మరో ముగ్గురిని అక్రమ రవాణా చేసినట్లు అంగీకరించాడు. యూఎస్ అభ్యర్ధన మేరకు సింగ్ ను 2022 జూన్ 28న కెనడాలో అరెస్టు చేశారు. తర్వాత అమెరికా తరలించారు. ఈ ఏడాది మార్చిలో అతడిని విచారణ నిమిత్తం కెనడా నుండి అమెరికా రప్పించారు. విచారణలో మార్చి 2020 నుండి మార్చి 2021 మధ్యలో అతను అనేక మంది భారతీయులను కెనడా నుండి కార్న్ వాల్ ద్వీపం, సెయింట్ లారెన్స్ నదీ ప్రాంతంలోని అక్వెసన్సే భారత రిజర్వ్ మీదుగా అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు తేలింది. అతడు మానవ రవాణాకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకునేవాడని తేలింది. నిందితుడు సెయింట్ లారెన్స్ నదిలో పడవల ద్వారా అమెరికాకు తరలించే వాడని తెలిపారు అల్బనీ పోలీసులు. గతంలో ఇదే నదిలో నలుగురు భారతీయులు, నలుగురు రోమానియన్ల మృతదేహాలను గుర్తించామని, అప్పుడే ఈ ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చినట్లు అల్బనీ పోలీసులు తెలిపారు. కొంతమంది అక్రమ వలసదారులు అమెరికన్ లా ఎన్ఫోర్స్ మెంట్ వారికి సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా చూస్తే సింగ్ బాధితుల వద్ద నుండి 5000 నుండి 35000 డాలర్ల వరకు వసూలు చేసేవాడని తేలింది. ఈ నేరారోపణలన్నిటిలోనూ సింగ్ దోషిగా తేలడంతో న్యూయార్క్ అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి మెయ్ ఏ.డి. ఆగోష్ఠినో నిందితుడికి మొదట ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ దీన్ని 15 ఏళ్ల వరకూ పొడిగించే ఆవకాశముందని అన్నారు. జైలు శిక్ష తోపాటు సింగ్ కు 250,000 యూఎస్ డాలర్ల జరిమానా కూడా విధించారు. జైలు శిక్ష డిసెంబర్ 28, 2023 నుండి అమల్లోకి వస్తుందని తీర్పునిచ్చారు. ఇది కూడా చదవండి: గగుర్పాటు కలిగించే ఘటన.. ఎత్తైన భవనంపై సాహసం.. అంతలోనే పట్టుతప్పి.. -
అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం
మిలన్: ఆఫ్రికా దేశాల నుడి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర ఐరోపా దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలోనే ఇటీవల కొన్ని పడవలు సముద్ర మధ్యలో బోల్తాపడి ఎందరో వలసదారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరోపా - ట్యునీషియా ఈ ఒప్పందానికి తెరతీశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆదివారం రోమ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ఐరోపా దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వలసదారులు అక్రమంగా చొరబడకుండా వారికి చట్టబద్ధమైన ప్రవేశం కల్పించడంపైనా, ఆయా దేశాల్లో ఉపాధి కల్పించే విషయంపైనా చర్చలు సాగాయి. ఐరోపా దేశాలు-ట్యునీషియా ఒప్పంద సమావేశంలో మొత్తం 27 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత పటిష్టం చేసి వలసలను తగ్గించడమే అజెండాగా సమావేశంలో లిబియా, సిప్రస్, యూఏఈ, ట్యునీషియా దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యధిక వలసదారులు ఈ దేశాల నుండే వస్తున్నారని, ఇకపై ఈ దేశాల నుండి అక్రమ వలసలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యూఏఈ అక్రమ వలసల నియంత్రణ కోసం పాటుపడే సంస్థలకు 100 మిలియన్ డాలర్లు సాయమందించనున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికగా ఆఫ్రికా ఉత్తర దేశాలకు ఆర్ధిక ఊతాన్నిచ్చేనందుకు 27 దేశాల వారు కలిపి 1.1 బిలియన్ డాలర్లు కూడగట్టడానికి సంకల్పించారు. ఈ సందర్బంగా ఇటలీ ప్రధాని మెలోని మాట్లాడుతూ.. ఐరోపా దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరించడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. వారు వలసదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. మనం కఠినంగా ఉంటే క్రిమినల్స్ కు చెక్ పెట్టి వలసారులను ఆర్ధిక ప్రగతికి దోహద పడవచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్ -
ఇక ఊరుకునేదిలే: రిషి సునాక్
లండన్: అక్రమ వలసదారులను అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా తెచ్చిన కొత్త పథకం(అక్రమ వలసల కట్టడి బిల్లు).. విమర్శలకు తావు ఇస్తోంది. బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆశ్రయం పొందేందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని సునాక్ తాజాగా హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు కొత్త చట్టం తీసుకురాగా.. తద్వారా అక్రమ చొరబాట్లను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వానికి హక్కు లభించినట్లయ్యింది. అయితే ఈ చట్టంపై ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. మీరు చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే.. ఆశ్రయం పొందలేరు. ఆధునిక బానిసత్వ రక్షణల నుంచి ప్రయోజనం పొందలేరు. మీరు నకిలీ మానవ హక్కుల దావాలు చేయలేరు. ఇక్కడ ఉండలేరు అంటూ ట్వీట్ చేశారాయన. చట్టవిరుద్ధంగా ఇక్కడికి ప్రవేశించేవాళ్లను అదుపులోకి తీసుకుని.. కొన్ని వారాలలోపు వాళ్లను పంపించేస్తాం. సురక్షితమని భావిస్తే.. వాళ్ల సొంత దేశానికే పంపిస్తాం. కుదరకుంటే రువాండా లాంటి మరో దేశానికి తరలిస్తాం. అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నాసరే మా దేశంలోకి మళ్లీ ప్రవేశించకుండా నిషేధించబడతారు అంటూ హెచ్చరించారాయన. If you come to the UK illegally you will be stopped from making late claims and attempts to frustrate your removal. You will be removed in weeks, either to your own country if it is safe to do so, or to a safe third country like Rwanda. pic.twitter.com/8NFaa4DbwT — Rishi Sunak (@RishiSunak) March 7, 2023 ఇల్లీగల్ మైగ్రేషన్ బిల్లుగా పిలవడబడుతున్న ముసాయిదా చట్టం.. ఇంగ్లీష్ చానెల్ గుండా చిన్నచిన్న బోట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించే వాళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది సౌత్ఈస్ట్ ఇంగ్లండ్ గుండా 45 వేలమంది వలసదారులు బ్రిటన్‌కు చేరుకున్నారు. ఇది గత ఐదేళ్లలుగా పోలిస్తే.. వార్షికంగా 60 శాతం పెరిగిందని నివేదికలు చెప్తున్నాయి. రిషి సునాక్ తీసుకొచ్చిన కొత్త పథకంపై మానవ హక్కుల సంఘాలు, బ్రిటన్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కొత్త చట్టం వర్కవుట్ అయ్యే అవకాశమే లేదని, అంతర్జాతీయ చట్టాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావొచ్చని ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈచట్టంతో దుర్బల పరిస్థితుల్లో ఉన్న శరణార్థులు బలి పశువులు అవుతారంటూ వాదిస్తున్నాయి మానవ హక్కుల సంఘాలు. మూలాలను ప్రస్తావించిన హోం సెక్రెటరీ ఇదిలా ఉంటే.. బ్రిటన్ హోం కార్యదర్శి Suella Braverman సుయెల్లా బ్రేవర్మాన్(భారత సంతతి).. మంగళవారం కొత్త చట్టాన్ని ప్రకటించారు. అక్రమ వలసల కట్టడి బిల్లు ప్రకారం.. చిన్న చిన్న పడవలపై అక్రమంగా యూకేలోకి వచ్చే వలసదారులను అదుపులోకి తీసుకుని.. వాళ్లను వీలైనంత త్వరగా బయటకు పంపించేస్తారు. ఈ చట్టం చట్టవిరుద్ధమైన వలసలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బలమైన విధానమని బ్రేవర్మాన్ ప్రకటించారు. అంతేకాదు.. బిల్లు గురించి ప్రకటించే సమయంలో ఆమె తన స్వంత వలస మూలాలను కూడా ప్రస్తావించారు. బ్రేవర్మాన్ తండ్రి గోవాకు చెందిన వ్యక్తి, అలాగే తల్లి తమిళ మూలాలున్న వ్యక్తి. ఇప్పుడు.. యూకే ప్రపంచంలోని అత్యంత దుర్బలమైన శరణార్థులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2015 యూకే దాదాపు ఐదులక్షల మందికి పైగా ఆశ్రయం అందించింది. హాంకాంగ్ నుండి 150,000 మంది, ఉక్రెయిన్ నుంచి 1,60,000 మంది ప్రజలు.. అలాగే తాలిబాన్ చెర నుంచి పారిపోయి చేరుకున్న అఫ్ఘన్లు పాతిక వేల మంది దాకా ఉన్నారు. వాస్తవానికి.. నా తల్లిదండ్రులు దశాబ్దాల కిందట ఈ దేశంలో భద్రత, అవకాశాలను కనుగొన్నారు. ఇందుకు నా కుటుంబం ఎప్పటికీ బ్రిటన్‌కు కృతజ్ఞతలు తెలుపుతుంది అని తెలిపారామె. అయినప్పటికీ.. మన సరిహద్దులను ఉల్లంఘించే అక్రమ వలసదారుల అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం అంటే.. మనల్ని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి ద్రోహం చేసినట్టే అని పేర్కొన్నారామె. కొత్త చట్టం నుంచి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల లోపు వాళ్లకు అదీ తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉన్నవారికి, ప్రాణ హాని ఉన్నవారిని యూకేలోకి అనుమతిస్తారు. -
అమెరికా పోలీసుల వలలో భారత విద్యార్థులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వీసా గడువు ముగిసినా అక్రమంగా నివాసం ఉంటున్న వారికోసం అమెరికా అధికారులు పన్నిన వలలో దాదాపు 600 మంది విదేశీ విద్యార్థులు చిక్కుకున్నారు. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సృష్టించిన ఫేక్ వర్సిటీ వలలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది భారతీయులే కాగా.. అందులో సగం తెలుగువారేనని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. న్యూజెర్సీలో 2015లో మూతపడ్డ ఫార్మింగ్టన్ వర్సిటీ పేరిట డీహెచ్ఎస్ కోర్సులు ఆఫర్ చేసింది. విద్యార్థులను చేర్పించిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థి వీసా గడువు ముగిసిన, ముగిసే దశలో ఉన్న దాదాపు 600 మంది విద్యార్థులు డీహెచ్ఎస్ వలలో పడ్డారు. ప్రోత్సాహకాలు ఆశించి పట్టుబడ్డ జాబితాలో ఎనిమిది మంది తెలుగు యువకులు ఉండటంతో వీరిని ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు. గుట్టు రట్టయిందిలా!: నకిలీ యూనివర్సిటీల్లో చేరి అమెరికాలో నివాసం ఉండటం కొత్త కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి ఘటనలు బయటపడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశీ విద్యార్థుల గుట్టు రట్టు చేయడానికి డీహెచ్ఎస్ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. అక్రమంగా నివా సం ఉంటున్న వారిని తేలిగ్గా పట్టుకునేందుకు వర్సిటీ వ్యూహాన్ని అమలుచేసింది. ఇందులో భాగంగా 2017 ఫిబ్రవరిలో మిషిగన్ రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చింది. వాషింగ్టన్ పోస్టు కథ నం ప్రకారం.. ఈ యూనివర్సిటీలో 800 మంది విద్యార్థులు చేరారు. అయితే వీరిలో 200 మంది విద్యార్థి వీసా గడువు ముగిసేందుకు.. రెండేళ్లు మిగిలుండగానే చేరారు. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలివేశారు. మిగిలిన వారిలో అత్యధికులు వీసా గడువు ముగిసినవారో.. లేక 6నెలల్లో వీసా ముగిసేవారో ఉన్నారు. వీరిలోనూ ఎక్కువమంది భారతీయులే. విద్యార్థి వీసా స్టేటస్ తెలుసుకోకుండా ఎక్కువమంది విద్యార్థులను చేర్పించిన భారత సంతతికి చెందిన ఎనిమిది మంది దళారులను అరెస్టు చేశారు. వారిలో అశ్వంత్ నూనె అనే వ్యక్తి ఫీజుల్లో ఏకంగా 25వేల డాలర్లు అధికంగా వసూలు చేసినట్టు డీహెచ్ఎస్ పేర్కొంది. ఈ ఉత్తుత్తి యూనివర్సిటీలో తరగతులు జరగవు. ఆన్లైన్ తరగతులు అసలే లేవు. కానీ డబ్బులు చెల్లించినందుకు స్టూడెంట్ వీసా గడువు పెంచుతారు. దీనికారణంగా వారు అమెరికాలో నివాసం ఉండడానికి, ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలు కలుగుతుంది. అరెస్టు అయిన వాళ్లు వీరే.. భరత్ కాకిరెడ్డి (ఫ్లోరిడా), సురేష్ కందాళ (వర్జీనియా), ఫణిదీప్ కర్నాటి (కెంటకీ), ప్రేమ్ రామ్పీసా (ఉత్తర కరోలినా), సంతోష్‌రెడ్డి సామ (కాలిఫోర్నియా), అవినాశ్ తక్కెళ్లపల్లి (పెన్సిల్వేనియా), అశ్వంత్ నూనె (జార్జియా), నవీన్ ప్రత్తిపాటి (టెక్సాస్), (న్యూయార్క్ టైమ్స్ కథనం మేరకు) గడువు ఐదేళ్లు దాటితే.. మామూలుగా అమెరికాలో మాస్టర్స్ కోసం వెళ్లే విద్యార్థులకు ఐదేళ్ల వీసా ఇస్తారు. రెండు మూడేళ్లపాటు చదువుకుని, ఆ తర్వాత రెండు మూడేళ్లపాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) పేరుతో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) ఇస్తారు. ఈఏడీ అమల్లో ఉన్న రెండు, మూడేళ్లలో హెచ్1బీ వీసాకు మారాలి. లేనిపక్షంలో వీసా గడువు పెంచుకునేందుకు వెంటనే ఏదో ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మరో కోర్సులో చేరాలి. అలా చేరకుండా అక్కడే ఉంటే వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. ఇలాంటి వారు అమెరికాలో వేలల్లో ఉన్నట్లు వెల్లడైంది. వీసా క్రిమినల్ అభియోగాల కింద అరెస్టయిన వారిని అయితే భారత్‌కు తిరిగి పంపించేస్తారు. అభియోగాలు రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష తప్పకపోవచ్చు. చిరునామాలు ఇచ్చి దొరికిపోయిన విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చేరడానికి విద్యార్థులు తమ చిరునామాలు సమర్పించారు. దీంతో వీరెక్కడున్నారో పట్టుకుని అరెస్టు చేయడం పోలీసులకు సులువైంది. రెండ్రోజుల క్రితం హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (డీహెచ్ఎస్), ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు సంయుక్తంగా ఫ్లోరిడా, డెట్రాయిట్, వర్జీనియాలో నివాసం ఉంటున్న విద్యార్థుల ఇళ్లపై దాడులు చేశారు. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల పేరేమిటి? తరగతులు జరుగుతున్నాయా? లేదా ఆన్లైన్ క్లాస్‌లకు హాజరవుతున్నారా? ఉంటే వాటి వివరాలు ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు విద్యార్థులు బిక్కమొహం వెయ్యాల్సి వచ్చింది. తాము ఇప్పటివరకు వర్సిటీకి వెళ్లలేదని.. మధ్యవర్తులు ఇచ్చిన సమాచారంతో అందులో చేరామని విద్యార్థులు చెప్పారు. దీంతో డీహెచ్ఎస్ దళారులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంది. కేవలం స్టూడెంట్ వీసా గడువు పొడిగించుకుని అమెరికాలో ఉండేలా చేస్తున్నందుకు.. ఒక్కో విద్యార్థి నుంచి 10–15 వేల డాలర్ల మేర దళారులకు చెల్లించినట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. మామూలుగా అయితే నిర్ణీత గడువులో హెచ్1బీ రాని విద్యార్థులు మళ్లీ కొత్త కోర్సుల్లో చేరడం, వీసా గడువు పెంచుకోవడం సాధారణమైన విషయం. అయితే, ఉద్యోగాలు లేక, ఫీజులు చెల్లించే స్థోమత లేక అనేక మంది ఏదో ఒక పని చేస్తూ అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు. అలాంటి విద్యార్థుల్లో భారతీయులు అందులోనూ తెలుగువారే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఫిబ్రవరి 5లోపే వచ్చేస్తే..! విద్యార్థి వీసా గడువు దాటినా అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారు.. వీలైనంత త్వరగా స్వదేశానికి వెడితే మంచిదని అమెరికా తెలుగు సంఘాలు సూచిస్తున్నాయి. అక్రమంగా ఉంటున్నవారు అటార్నీ (న్యాయవాది) సాయంతో తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించాలని.. ఆర్నెల్లకంటే తక్కువ గడువు ఉన్నవారు వెంటనే వెళ్లడం మంచిదంటున్నాయి. ‘అరెస్టు అయిన వారికి మేము న్యాయపరమైన సాయం అందిస్తాం. అరెస్టు కాని వారు, వీసా గడువు ముగిసిన వారు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలి’అని తెలంగాణ తెలుగు సంఘాల ప్రతినిధి జలగం నవీన్ అన్నారు. ‘నకిలీ పత్రాలతో అమెరికాలో నివాసం ఉంటున్న విదేశీ విద్యార్థుల్ని తిరిగి వారి దేశాలకు పంపించేందుకు గత కొన్నేళ్లుగా ఇమిగ్రేషన్ అధికారులు రహస్య ఆపరేషన్లు చేపడుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. యూనివర్సిటీ వివరాలు సరిగా తెలుసుకోకుండా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉండే ప్రయత్నం చేయవద్దంటూ అమెరికాకు వచ్చే విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నాం’అని ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి వెల్లడించారు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ సింగ్లాను కూడా ఆటా ప్రతినిధులు కలుసుకున్నారు. అరెస్ట్ వారెంట్లు జారీ అయిన విద్యార్థులకు అందించాల్సిన సాయంపై చర్చలు జరుపుతున్నారు. 2016లోనూ ఇదే తరహా స్కామ్ మూడేళ్ల క్రితం కూడా అమెరికాలో ఇలాంటి వీసా కుంభకోణం బట్టబయలైంది. న్యూజెర్సీ యూనివర్సీటీలో స్టింగ్ ఆపరేషన్ చేసిన అధికారులు 11 మంది భారతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. 11 మంది చైనా విద్యార్థులు కూడా ఈ స్కామ్‌లో పట్టుబట్టారు. అంతకు ముందు 2011, 2012 సంవత్సరాల్లో కూడా కాలిఫోర్నియాలో ట్రైవ్యాలీ యూనివర్సిటీ, హెర్గాన్ యూనివర్సిటీలో కూడా ఇలాగే నకిలీ పత్రాలతో నివసిస్తున్న విద్యార్థుల్ని గుర్తించి.. స్వదేశాలకు పంపించారు. అయితే అప్పట్లో విద్యార్థులు నకిలీ యూనివర్సిటీ అని తెలియక మోసపోతే, ఇప్పుడు మాత్రం తెలిసి తెలిసి ఈ స్కామ్‌లో భాగస్వామ్యులయ్యారని ఆటా అధ్యక్షుడు భీమ్‌రెడ్డి పేర్కొన్నారు. -
ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు
శాన్ఫ్రాన్సిస్కో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి షాక్ తగిలింది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారుల్ని నిషేధిస్తూ ఆయనిచ్చిన ఉత్తర్వులపై దిగువకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు 9వ యూఎస్ సర్కిల్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ నిరాకరించింది. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు ప్రసుత్తమున్న అమెరికా చట్టాలకు అనుగుణంగా లేవనీ, సాక్షాత్తూ కాంగ్రెస్‌ను విస్మరించేలా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. చట్టాలను కోర్టు గదుల నుంచి, ఓవల్ (అధ్యక్ష) కార్యాలయం నుంచి చేయలేమని చురకలు అంటించింది. ఓ వ్యక్తి అమెరికాలోకి ఎలా ప్రవేశించాడన్న ఆధారంగా అతనిపై నిషేధం విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను 2-1 మెజారిటీతో తోసిప్చుంది. అమెరికా–మెక్సికో సరిహద్దు ద్వారా ఆశ్రయం కోరుతూ వలస దారులు దేశంలోకి రావడాన్ని ట్రంప్ గత నెల 9న నిషేధించారు. -
సిలికాన్ తరలిస్తున్న నాలుగు లారీల పట్టివేత
అధికారయంత్రాంగం పట్టించుకోకున్నా గ్రామస్తులే అప్రమత్తమయ్యారు. తీరప్రాంతం నుంచి అక్రమంగా సిలికాన్‌ను తరలించుకుపోతున్న లారీలను అడ్డుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిల్లకూరు మండలంలో సముద్ర తీరం ప్రాంతంలోని ఇసుక నుంచి సిలికాన్‌ను వేరు చేసి కొందరు అక్రమంగా తరలించుకుపోతున్నారు. దీనిపై సమీప చింతవరం గ్రామస్తులు సోమవారం ఉదయం ఖనిజంతో వెళ్తున్న నాలుగు లారీలను అడ్డుకున్నారు. పోలీసులు, గనుల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు లారీలను సీజ్ చేశారు. -
ఆమదాలవలస కమిషనర్‌కు కూర‘గాయం’
ఆమదాలవలస: పెను వివాదం రేపి.. సంచలనం సృష్టించిన ఆమదాలవలస కూరగాయల మార్కెట్ అక్రమ తరలింపు, కూల్చివేతపై అక్కడి వర్తకులు, వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన పోరాటం ఫలించింది. మార్కెట్ తరలింపు విషయంలో తప్పు జరిగిందని మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు స్వయంగా హైకోర్టులో అంగీకరించడంతో కోర్టు ఆయనకు రూ. 10వేల జరిమానా విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టు న్యాయవాది వి.సుధాకర్‌రెడ్డి చెప్పినట్లు వర్తకుల తరఫున పోరాడిన స్థానిక న్యాయవాది చింతాడ సత్యనారాయణ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పొట్ట కూటికోసం దశాబ్దాలుగా ఆమదాలవలస రైల్వేస్టేషన్ ఎదుట ఉన్న కారగాయల మార్కెట్లో పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సిద్ధమైన స్థానిక టీడీపీ పెద్దలు కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చి కూరగాయల మార్కెట్‌ను అక్కడి నుంచి తరలించేందుకు కుట్ర పన్నారు. దీన్ని వ్యాపారులు వ్యతిరేకించగా, వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలిచింది. దీనిపై వర్తకులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కాగా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయకుండా, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ పోలీసులను మోహరించి పొక్లెయిన్‌తో మార్కెట్లోని షాపులను కూలగొట్టారు. ఆ మరునాడే హైకోర్టు మార్కెట్ తరలింపుపై స్టే ఇస్తూ, యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగానే ‘వారం రోజులు గడువిచ్చాం.. షాపులు ఖాళీ చేయండి’ అంటూ అక్టోబర్ 10న మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు వర్తకులకు నోటీసులు జారీ చేశారు. ఈ చర్య కోర్టు ధిక్కారం కిందికి వస్తుందంటూ మళ్లీ వర్తకులు హైకోర్టు తలుపుతట్టారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఎం.రామచంద్రరావు అక్టోబర్ 27న విచారణకు హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్‌కు సమన్లు జారీ చేశారు. ఆ మేరకు హాజరైన కమిషనర్ తప్పు జరిగిందని అంగీకరిస్తూ, దీనిపై వివరణ ఇచ్చుకునేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. దాంతో కేసును ఈ నెల 11వ తేదీ(మంగళవారం)కి వాయిదా వేశారు. మంగళవారం విచారణ సందర్భంగా కమిషనర్ లిఖితపూర్వకంగా తప్పును అంగీకరించారు. వర్తకులకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు కూడా కోర్టుకు వివరించారు. ఈ తప్పునకు జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా, క్షమించాలని వేడుకున్నారు. దాంతో కమిషనర్‌కు రూ. 10 వేల జరిమానా విధిస్తూ.. దాన్ని నష్టపోయిన కూరగాయల వర్తకులకు అందించాలని తుది ఆదేశాలు జారీ చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ పోరాట ఫలితం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీడీపీ నేతలు, అధికారులకు బుధ్ధి చెప్పే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మంగళవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. కూరగాయల మార్కెట్లో పొట్టకూటి కోసం కష్టపడుతున్న వారి కడుపులు కొట్టేందుకు టీడీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ ఎన్ నూకేశ్వరరావుకు రూ.10 వేల జరిమానా విధించడం హర్షనీయమన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ చేసిన పోరాట ఫలితమని వ్యాఖ్యానించారు.