ఆమదాలవలస: పెను వివాదం రేపి.. సంచలనం సృష్టించిన ఆమదాలవలస కూరగాయల మార్కెట్ అక్రమ తరలింపు, కూల్చివేతపై అక్కడి వర్తకులు, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేసిన పోరాటం ఫలించింది. మార్కెట్ తరలింపు విషయంలో తప్పు జరిగిందని మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు స్వయంగా హైకోర్టులో అంగీకరించడంతో కోర్టు ఆయనకు రూ. 10వేల జరిమానా విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టు న్యాయవాది వి.సుధాకర్‌రెడ్డి చెప్పినట్లు వర్తకుల తరఫున పోరాడిన స్థానిక న్యాయవాది చింతాడ సత్యనారాయణ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పొట్ట కూటికోసం దశాబ్దాలుగా ఆమదాలవలస రైల్వేస్టేషన్ ఎదుట ఉన్న కారగాయల మార్కెట్‌లో పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు.
ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సిద్ధమైన స్థానిక టీడీపీ పెద్దలు కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చి కూరగాయల మార్కెట్‌ను అక్కడి నుంచి తరలించేందుకు కుట్ర పన్నారు. దీన్ని వ్యాపారులు వ్యతిరేకించగా, వైఎస్‌ఆర్‌సీపీ వారికి అండగా నిలిచింది. దీనిపై వర్తకులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కాగా మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేయకుండా, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ పోలీసులను మోహరించి పొక్లెయిన్‌తో మార్కెట్లోని షాపులను కూలగొట్టారు. ఆ మరునాడే హైకోర్టు మార్కెట్ తరలింపుపై స్టే ఇస్తూ, యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగానే ‘వారం రోజులు గడువిచ్చాం.. షాపులు ఖాళీ చేయండి’ అంటూ అక్టోబర్ 10న మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు వర్తకులకు నోటీసులు జారీ చేశారు. ఈ చర్య కోర్టు ధిక్కారం కిందికి వస్తుందంటూ మళ్లీ వర్తకులు హైకోర్టు తలుపుతట్టారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఎం.రామచంద్రరావు అక్టోబర్ 27న విచారణకు హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్‌కు సమన్లు జారీ చేశారు. ఆ మేరకు హాజరైన కమిషనర్ తప్పు జరిగిందని అంగీకరిస్తూ, దీనిపై వివరణ ఇచ్చుకునేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. దాంతో కేసును ఈ నెల 11వ తేదీ(మంగళవారం)కి వాయిదా వేశారు.
మంగళవారం విచారణ సందర్భంగా కమిషనర్ లిఖితపూర్వకంగా తప్పును అంగీకరించారు. వర్తకులకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు కూడా కోర్టుకు వివరించారు. ఈ తప్పునకు జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా, క్షమించాలని వేడుకున్నారు. దాంతో కమిషనర్‌కు రూ. 10 వేల జరిమానా విధిస్తూ.. దాన్ని నష్టపోయిన కూరగాయల వర్తకులకు అందించాలని తుది ఆదేశాలు జారీ చేశారు.
ఇది వైఎస్‌ఆర్‌సీపీ పోరాట ఫలితం
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీడీపీ నేతలు, అధికారులకు బుధ్ధి చెప్పే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని వైఎస్‌ఆర్‌సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మంగళవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. కూరగాయల మార్కెట్‌లో పొట్టకూటి కోసం కష్టపడుతున్న వారి కడుపులు కొట్టేందుకు టీడీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ ఎన్ నూకేశ్వరరావుకు రూ.10 వేల జరిమానా విధించడం హర్షనీయమన్నారు. ఇది వైఎస్‌ఆర్‌సీపీ చేసిన పోరాట ఫలితమని వ్యాఖ్యానించారు.
ఆమదాలవలస కమిషనర్‌కు కూర‘గాయం’
Published Wed, Nov 12 2014 4:12 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement