అమెరికాలో హెచ్‌1బీ స్కామ్‌ | 3 Indian-origin consultants charged in US with H-1B visa fraud | Sakshi
Sakshi News home page

అమెరికాలో హెచ్‌1బీ స్కామ్‌

Published Wed, Apr 3 2019 4:28 AM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM

3 Indian-origin consultants charged in US with H-1B visa fraud - Sakshi

వాషింగ్టన్‌/న్యూయార్క్‌: హెచ్‌–1బీ వీసా కుంభకోణంలో భారత సంతతికి చెందిన ముగ్గురు కన్సల్టెంట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే నెలలో వీరి కేసు విచారణకు రానుంది. సాంటాక్లారాకు చెందిన దత్తపురం కిశోర్‌(49), టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌ నివాసి కుమార్‌ అశ్వపతి(49), సాన్‌జోస్‌కు చెందిన సంతోష్‌ గిరి(42) కలిసి సాంటాక్లారాలో నానోసెమాంటిక్స్‌ అనే కన్సల్టింగ్‌ సంస్థను నడిపేవారు. వీరు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉండే సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ సంస్థలకు అవసరమైన విదేశీ వృత్తి నిపుణులను ఎంపిక చేసేవారు.

కానీ, వీరు హెచ్‌–1బీ వీసాకు కీలకమైన ఐ–129 దరఖాస్తు సమర్పించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. పలు ప్రముఖ కంపెనీలతోపాటు తమ నానోసెమాంటిక్స్‌కు ఫలానా ఉద్యోగం కోసం విదేశీ నిపుణుల అవసరం ఉందంటూ నకిలీ పత్రాలతో ‘ఐ–129’దరఖాస్తు చేసేవారు. అలా వచ్చిన వారికి ఆ తర్వాత స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేవారు. ఇందుకుగాను వారి నుంచి కొంతమొత్తంలో వసూలు చేసేవారు. వాస్తవానికి ఆయా సంస్థల్లో ఎలాంటి ఖాళీలు ఉండవు. అభియోగాలు రుజువైతే గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1.50 కోట్ల జరిమానాతోపాటు ఒక్కో నేరానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.  

బీమా మోసం.. భారతసంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలు
ఆరోగ్య బీమాకు సంబంధించి భారీ మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తికి అమెరికా కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మిషిగాన్‌కు చెందిన బాబూభాయ్‌ భూరాభాయ్‌ రాథోడ్‌ వైద్యులకు లంచాలిచ్చి తన ఆరోగ్య బీమా కంపెలకు పేషెంట్లను రెఫర్‌ చేయించుకునేవాడు. ఈ నేరం రుజువు కావడంతో గతంలో ఓ కోర్టు జైలు శిక్ష విధించింది. జైలునుంచి బయటికొచ్చాకా అవే మోసాలుచేశాడు. దీంతో మరో కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరోవైపు, మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ముగ్గురు భారతీయులను అక్కడి అధికారులు నిర్బంధించారు.  దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన నేరంపై న్యూయార్క్‌ నార్తర్న్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ వీరిని విచారించనున్నారు.

‘కాల్‌ సెంటర్‌’లో భారతీయుడికి జైలు
అమెరికాలో వెలుగుచూసిన భారీ కాల్‌సెంటర్‌ కుంభకోణంలో భారతీయుడికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. అధికారులమంటూ చెప్పుకుని అమెరికా వాసులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన నేరానికి నిషిత్‌కుమార్‌ పటేల్‌ అనే వ్యక్తికి కోర్టు 8 ఏళ్ల 9 నెలల జైలు, రూ.1.30 కోట్ల జరిమానా విధించింది. భారత్‌లో నడిచే కాల్‌ సెంటర్ల నుంచి కొందరు వ్యక్తులు అమెరికా వాసులకు ఫోన్లు చేసేవారు. తాము ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారులమని చెప్పి, రెవెన్యూ శాఖ బకాయిలను చెల్లించకుంటే జైలుఖాయమని బెదిరించేవారు.

దీంతో వారు చెప్పినంత సొమ్మును చెల్లించేందుకు సిద్ధపడేవారు. వేర్వేరు మార్గాల్లో ఆ డబ్బును రాబట్టేందుకు అమెరికాలో కూడా ఒక ముఠా ఉండేది. వీరంతా కలిసి 2014–16 సంవత్సరాల్లో ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు ఈ దందా గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 25వ తేదీన అలెజాండ్రో జువారెజ్‌ అనే వ్యక్తికి 15 నెలల జైలు శిక్ష పడింది. నిషిత్‌కుమార్‌పై చేసిన ఆరోపణలను పోలీసులు జనవరి 9వ తేదీన న్యాయస్థానంలో రుజువు చేయడంతో సోమవారం శిక్ష ఖరారైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement