సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువు, ఉద్యోగం కోసం ఎందాకైనా వెళ్లేందుకు ఈ తరం వడివడిగా అడుగులేస్తోంది. పుట్టిన ప్రాంతం, పెరిగిన రాష్ట్రమే కాదు ఏకంగా దేశ సరిహద్దులు దాటి విదేశీ గడ్డపై కాలుమోపేందుకు ఏమాత్రం సంశయించటం లేదు. డిగ్రీ పట్టా చేతికొచ్చే కంటే ముందుగానే ఈ తరం యువత పాస్‌పోర్ట్‌ను పొందేస్తుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పాస్‌పోర్ట్‌లు తీసుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉందని తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన లెక్కలు తేల్చేశాయి.
మరాఠా, మలయాళీలే టాప్..
పాస్‌పోర్ట్‌ల స్వీకరణలో దేశంలో జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలను కాదని మహారాష్ట్ర, కేరళ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 2014–19 మధ్యలో మహారాష్ట్రలో 71,22,849 పాస్‌పోర్ట్‌లు జారీ అయితే అందులో 11,89,846 మంది తమ పాస్‌పోర్ట్‌లను కేవలం 2019లోనే అందుకున్నారు. జనాభా పరంగా చాలా చిన్న రాష్ట్రమైన కేరళ విద్య, ఉపాధి విషయంలో వేగిరపడే దిశగా గడిచిన ఐదేళ్లలో 67,44,557 మందికి పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది. అందులోనూ 2019 ఒక్క ఏడాదిలోనే 10,89,859 మంది పాస్‌పోర్ట్‌లు పొందారు.
తమిళ, కన్నడనాడుల్లోనూ జోరు..
ప్రపంచంలో ఎక్కడ ఉపాధి లభించినా వెళ్లేందుకు ఆసక్తి చూపే తమిళవాసులు తమ ఆనవాయితీని కొనసాగిస్తూనే ఉన్నారు. గడిచిన ఏడాదిలో తమిళనాడులో 9,58,073, కర్ణాటకలో 7,01,990 పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. దేశంలోనే జనాభా పరంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 9,00,462 పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. అతిచిన్న ప్రాంతాలైన లక్షదీ్వప్‌లో కేవలం 1,903, అండమాన్‌లో 2,263 పాస్‌పోర్ట్‌లను ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణే ముందు..
విద్య, ఉపాధి వేటలో తెలుగోడి స్పీడ్ కొనసాగుతూనే ఉంది. గడిచిన ఏడాదిలో తెలంగాణలో 4,79,408, ఆంధ్రప్రదేశ్‌లో 3,73,492 మందికి పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. గడిచిన ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 53,85,964 మందికి పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐటీ జాబ్‌లతోపాటు గల్ఫ్ కంట్రీలకు వివిధ రంగాల్లో కారి్మకులుగా(బ్లూకాలర్) వెళ్లేందుకు పాస్‌పోర్ట్‌లు పొందుతున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సమయం పదిన్నర రోజులు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 3 నుంచి 5 పనిదినాలే ఉండటం మరో విశేషం.
పాస్‌పోర్ట్.. మస్ట్ అయింది
ఐటీ జాబ్‌లకు వెళ్లిన సమయాల్లో పాస్‌పోర్ట్ ఉండటం అనేది అదనపు అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రముఖ కంపెనీలు పాస్‌పోర్ట్‌లోని వివరాలనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో పాస్‌పోర్ట్ తప్పనిసరైంది.– పి.జశ్వంత్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ఎక్కడికైనా.. రెడీ
పాస్‌పోర్ట్ అనేది కీలక ఐడెంటిటీ. పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుంది. అందుకే తొలుత పాస్‌పోర్ట్ పొంది ఆపై అవకాశాల కోసం ఈ తరం ఎదురు చూస్తోంది.– నీలిమ, మేనేజర్, ఐటీ
Comments
Please login to add a commentAdd a comment