మళ్లీ నష్టాలు | Nifty ends below 12100, Sensex down 150 points | Sakshi
Sakshi News home page

మళ్లీ నష్టాలు

Published Fri, Feb 21 2020 5:22 AM | Last Updated on Fri, Feb 21 2020 5:22 AM

Nifty ends below 12100, Sensex down 150 points - Sakshi

అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 153 పాయింట్లు పతనమై 41,170 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 12,081 పాయింట్ల వద్ద ముగిశాయి.  ఈ వారంలో సెన్సెక్స్‌ 87 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు పతనమయ్యాయి.  

266 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, ఆ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల చివరి రోజు కావడంతో చివరి గంట వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. చివరి గంటలో నష్టాలు పెరిగాయి. ఒక దశలో 77 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 189 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 266 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య ఛైనాలో 2,118కు పెరిగింది. కొత్త కేసులు తగ్గాయి. అయితే దక్షిణ కొరియా ఇతర దేశాల్లో వైరస్‌ సోకిన వ్యక్తుల సంఖ్య పెరిగింది. అంతే కాకుండా ఈ వైరస్‌ కారణంగా ఆర్థికంగా సంభవించే నష్టాల ఆందోళనలు తగ్గకపోవడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి.  

ఆగని ఐఆర్‌సీటీసీ జోరు  
ఐఆర్‌సీటీసీ షేరు జీవిత కాల గరిష్ట స్థాయి, రూ. 1,976ని తాకింది. చివరకు 5% లాభంతో రూ.1,928 వద్ద ముగిసింది. ఇక ఎమ్‌ఎస్‌టీసీ, ఓల్టాస్, పీవీఆర్, అదానీ గ్యాస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్‌ ఫైనాన్స్, దివీస్‌ ల్యాబ్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐనాక్స్‌ లీజర్, జేకే సిమెంట్స్, ముత్తూట్‌ ఫైనాన్స్, ట్రెంట్, ఎస్‌ఆర్‌ఎఫ్‌ షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి.
► షేర్ల బైబ్యాక్‌ వార్తలతో థామస్‌ కుక్‌ షేర్‌ 20 శాతం ఎగసి రూ.49 వద్ద ముగిసింది.  
► గ్రూప్‌ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని తేలడంతో ఇండియాబుల్స్‌ గ్రూప్‌ షేర్లు 11 శాతం మేర ర్యాలీ జరిపాయి.  


వచ్చే ఏడాది డ్రూమ్‌ ఐపీఓ  
అమెరికా స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో లిస్టింగ్‌!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ మార్కెట్‌ ప్లేస్‌  డ్రూమ్‌  ఐపీఓ (ఇనీసియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వచ్చే ఏడాది రానున్నది. ఐపీఓకు రాకముందే 15 కోట్ల డాలర్ల నిధులను సమీకరిస్తామని డ్రూమ్‌ వ్యవస్థాపకులు, సీఈఓ కూడా అయిన సందీప్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా లాభాల్లోకి వస్తామని పేర్కొన్నారు. తమ ప్లాట్‌ఫార్మ్‌పై గత ఏడాది 120 కోట్ల డాలర్ల విలువైన వస్తువుల వ్యాపారం జరిగిందని, 3.2 కోట్ల నికర రాబడిని ఆర్జించామని తెలిపారు.


నేడు సెలవు
మహాశివరాత్రి సందర్భంగా నేడు (శుక్రవారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల్లో ట్రేడింగ్‌ జరగదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement