నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్...
83 పాయింట్ల లాభంతో 24,934కు సెన్సెక్స్...
* 33 పాయింట్ల లాభంతో 7,601కు నిఫ్టీ
* నాలుగేళ్లలో సెన్సెక్స్‌కు అధ్వాన వారం
ప్రపంచ మార్కెట్లు ఒకింత కోలుకోవడంతో మన స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. దీంతో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 24,934 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 7,601 పాయింట్ల వద్ద ముగిశాయి. 19 నెలల కనిష్ట స్థాయి నుంచి సెన్సెక్స్ కోలుకుంది. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ వంటి ఇండెక్స్ షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ లాభాల్లో సాగింది. ఈ వారంలో సెన్సెక్స్ 1,227 పాయింట్లు(4.68 శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 362 పాయింట్లు (4.54 శాతం) చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్‌కు గత నాలుగేళ్లలో ఇదే అధ్వాన వారం.
చైనా ఊరట
ఈ వారంలో చైనా స్టాక్ మార్కెట్లో రెండు సార్లు ట్రేడింగ్ నిలిపేయడానికి కారణమైన సర్క్యూట్ బ్రేకర్ విధానాన్ని చైనా రద్దు చేయడంతో చైనా మార్కెట్ జోరుగా పెరగడం, దీంతో ప్రపంచ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టడం. రూపాయి మూడు వారాల కనిష్ట స్థాయి నుంచి కోలుకుని 30 పైసలు బలపడడం, గత నాలుగు రోజుల పతనం కారణంగా పడిపోయి ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జరగడం... ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక(అక్టోబర్-డిసెంబర్) కాలానికి మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో నీల్‌కమల్ షేర్ 5.2 శాతం లాభపడి రూ.1,444 వద్ద, జీఎం బ్రూవరీస్ 4.8 శాతం లాభపడి 1,088 వద్ద ముగిశాయి.
ముందు జాగ్రత్త...
సెన్సెక్స్ 24,969 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. బ్లూ చిప్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో 25 వేల పాయింట్లను దాటి ఇంట్రాడేలో 25,084 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 24,887 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 83 పాయింట్ల లాభంతో 24,934 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 7,601 పాయింట్ల వద్ద ముగిసింది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వచ్చే వారం నుంచి మొదలు కానున్న నేపథ్యంలో మార్కెట్లో ముందు జాగ్రత్త నెలకొన్నదని విశ్లేషకులంటున్నారు. హెచ్‌డీఐఎల్, డీఎల్‌ఎఫ్, ఓబెరాయ్ రియల్టీ, యూనిటెక్, ఫీనిక్స్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్‌వంటి రియల్టీ షేర్లు 5.7 శాతం వరకూ పెరిగాయి.
లాభాల్లో 17 సెన్సెక్స్ షేర్లు..
30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ 2.9 శాతం, టాటా స్టీల్ 1.4 శాతం, ఇన్ఫోసిస్ 1.3 శాతం, ఎన్‌టీపీసీ 1.2 శాతం,రిలయన్స్ 1.2 శాతం, ఐటీసీ 1.2 శాతం, సన్ ఫార్మా 1.1 శాతం, టీసీఎస్ 1.1 శాతం, విప్రో 1.1 శాతం, ఓఎన్‌జీసీ 1.1 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే సిప్లా 2.6 శాతం, లార్సెన్ అండ్ టుబ్రో 2.1 శాతం, బజాజ్ ఆటో 1.7 శాతం, కోల్ ఇండియా 1.6 శాతం, అదానీ పోర్ట్స్ 1.2 శాతం, మారుతీ 1.1 శాతం చొప్పున పడిపోయాయి. 1,959 షేర్లు నష్టాల్లో, 808 షేర్లు లాభాల్లో ముగిశాయి. జపాన్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లోనే ముగిశాయి.