చైనా ప్యాకేజీపై ఆశలతో ప్రపంచ మార్కెట్లు కళకళ
291 పాయింట్లు లాభంతో 24,480 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై: ప్రపంచ మార్కెట్ల దన్నుతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. చైనా జీడీపీ గణాంకాలు మార్కెట్ ఆశించిన స్థాయిలోనే ఉండటంతో 20 నెలల కనిష్ట స్థాయి నుంచి బీఎస్‌ఈ సెన్సెక్స్ కోలుకుంది. ఆ దేశం ఆర్థికాభివృద్ధి ప్యాకేజీ అంచనాలు సానుకూలమయ్యాయి. నిఫ్టీ మళ్లీ కీలకమైన 7,400 పాయింట్లపైకి ఎగసింది. బ్యాంక్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ షేర్ల తోడ్పాటుతోనూ, షార్ట్ కవరింగ్ కారణంగానూ సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 24,480 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 7,435 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది ఒక్క రోజులో సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు లాభపడడం ఇదే మొదటిసారి.
చైనా ప్యాకేజీ?
వృద్ధి పెంపు కోసం చైనా ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు పెరిగాయి. కన్సాలిడేటెడ్ నికర లాభం 38 శాతం పెరగడంతో రిలయన్స్ పవర్ షేర్ 3.8 శాతం పెరిగింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లో ముగిశాయి.