మార్కెట్ పంచాంగం
భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్లకు కీలకమైన వారం రానే వచ్చింది. డిసెంబర్ 15-16వ తేదీల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ జరిపే సమీక్షా సమావేశంలో పావు శాతం వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాల్లో మార్కెట్ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చేశాయి. ఈ కారణంగా ఆ రోజునాటి ఫెడ్ నిర్ణయం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించకపోవొచ్చు. కానీ ఆ సందర్భంగా ఫెడ్ ఛైర్‌పర్సన్ చేసే వ్యాఖ్యల ప్రభావం రానున్న వారాలు, నెలల్లో భారత్ వంటి వర్థమాన మార్కెట్‌పై వుంటుంది. అలాగే ఈ వారమే రాజ్యసభలో జీఎస్‌టీ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ సందర్భంగా తీసుకునే నిర్ణయం కూడా రానున్న వారాల్లో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించవచ్చు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
డిసెంబర్ 11తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 594 పాయింట్ల భారీ నష్టంతో 25,044 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ భారీగా క్షీణించిన ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో సెన్సెక్స్ మొదలైతే 24,800 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు వుంది. ఈ మద్దతు ఈ ఏడాది ఇప్పటికే సూచీని రెండు దఫాలు పరిరక్షించినందున, ఈ స్థాయి దిగువనే గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలై, వెనువెంటనే కోలుకోకపోతే, సెన్సెక్స్ నిలువునా 24,400-24,500 పాయింట్ల శ్రేణికి పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఆ స్థాయిని కూడా ఈ వారంలో కోల్పోతే 24,100 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున 23,767 పాయింట్ల మద్దతు సెన్సెక్స్‌కు కీలకమైనది.
2013 ఆగస్టు కనిష్టస్థాయి 17,448 పాయింట్ల నుంచి ఈ ఏడాది మార్చినాటి రికార్డుస్థాయి 30,025 పాయింట్ల వరకూ జరిగిన 12,577 పాయింట్ల ర్యాలీలో 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 23,767 పాయింట్లు. ఈ వారం మధ్యలో సెన్సెక్స్ క్షీణించినా, తిరిగి 25,000 పాయింట్లస్థాయిపైన స్థిరపడగలిగితే, వేగంగా 25,320 స్థాయిని అందుకోవొచ్చు. ఆటుపైన క్రమేపీ 25,830 పాయింట్లవద్దకు చేరవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే తదుపరి నిరోధ స్థాయిలు 26,050, 26,250 పాయింట్లు.
నిఫ్టీ తొలి అవరోధం 7,855
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 172 పాయింట్ల నష్టంతో 7,610 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో నిఫ్టీ మొదలైతే 7,540 పాయింట్ల స్థాయి తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువనే నిఫ్టీ మొదలై, వేగంగా కోలుకోకపోతే 7,420-7,500 మద్దతు శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున 7,220- 7,350 పాయింట్ల శ్రేణి వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ స్థాయిని కూడా వదులుకుంటే కీలకమైన 7,120 పాయింట్ల స్థాయికి (గతంలో 5,118 పాయింట్ల నుంచి 9,119 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీలో 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి ఇది) పడిపోవొచ్చు. ఈ వారం పతనం జరిగినా, తిరిగి 7,540 పాయింట్ల స్థాయిపైన స్థిరపడితే 7,700 పాయింట్ల వద్దకు ర్యాలీ జరపవచ్చు. ఆపైన 7,820 స్థాయి వరకూ పెరిగే ఛాన్స్ వుంటుంది. అటుపైన ముగిస్తే 7,980 పాయింట్ల వద్దకు పెరగవచ్చు.
24,800 దిగువన మరింత క్షీణత
Published Mon, Dec 14 2015 9:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement
Advertisement