
టర్కీ కరెన్సీ లిరా కోలుకుంటున్నప్పటికీ, అమెరికా వస్తువులపై టర్కీ సుంకాల పెంపు, ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1% వరకూ నష్టపోగా, యూరప్ మార్కెట్లు 1.6–2% రేంజ్‌లో క్షీణించాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు నష్టపోగా, అమెరికా సూచీలు 1.5–2% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చమురు, పుత్తడి ధరలు నేల చూపులు చూస్తుండగా, డాలర్ దుసుకుపోతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ నష్టాలు తప్పాయని నిపుణులంటున్నారు. అయితే నేడు(గురువారం) భారీ గ్యాప్‌డౌన్‌తో మన స్టాక్ మార్కెట్ ఆరంభమవుతుందని వారు అంచనా వేస్తున్నారు.
టర్కీ ‘ప్రతి’ సుంకాలు...
టర్కీ కరెన్సీ లిరా పతనం ఒకింత తగ్గినప్పటికీ, టర్కీ ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే అవకాశాల్లేవని నిపుణులంటున్నారు. దీంతో మార్కెట్ సెంటిమెంట్‌పై టర్కీ ప్రభావం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతిగా తాము కూడా అమెరికా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. అంతేగాకుండా అమెరికా నుంచి దిగుమతయ్యే ఆల్కహాల్, కార్లు, పొగాకు ఉత్పత్తులపై సుంకాలను రెట్టింపు చేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు అమెరికా సుంకాలు, సబ్సిడీ విధానాలను సవాల్ చేస్తూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు చైనా ఫిర్యాదు చేసింది. ఇవన్నీ ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఈ వార్త రాసే సమయానికి(బుధవారం రాత్రి 10 గంటలకు)నాస్‌డాక్ సూచీ 116 పాయింట్లు, డోజోన్స్ 245 పాయింట్లు మేర పతనమయ్యాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 65 పాయింట్లు క్షీణించి 11,369 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 100 పాయింట్లకు పైగా నష్టపోయింది.
13 నెలల గరిష్టానికి డాలర్..
అమెరికా డాలర్ 13 నెలల గరిష్ట స్థాయిలో, 96.82 వద్ద ట్రేడవుతోంది. డాలర్ బలపడుతుండటంతో ముడి చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. అంచనాలకు భిన్నంగా అమెరికాలో చమురు నిల్వలు భారీగా ఉన్నాయని గణాంకాలు వెల్లడికావడంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.8% క్షీణించి 70.66 వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ 2.1% పతనమై 64.85 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్ బలపడటంతో పుత్తడి, వెండి లోహాల ధరలు పతనమవుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 18 నెలల కనిష్ట స్థాయి.. 1,184 డాలర్లకు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment