వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర విధానం కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. దీనికి మన దగ్గర షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు, వేల్యూ బయింగ్ కూడా జత కావడంతో మన మార్కెట్ కూడా గురువారం భారీగా లాభపడింది. గత మూడు రోజులుగా అంతంత మాత్రం లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలు సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, రానున్న బడ్జెట్‌లో వ్యాపార వర్గాలకు అనుకూలమైన చర్యలు ఉంటాయనే అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 39,602 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 11,832 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
ముడిచమురు ధరలు భగ్గుమన్నా...
అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసిందన్న వార్తల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ప్రజ్వరిల్లుతాయనే ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు 3% పెరిగి 63.37 డాలర్లకు చేరింది. సాధారణంగా చమురు ధరలు పెరిగితే మన మార్కెట్ పడిపోతుంది. ఈసారి దీనికి భిన్నంగా జరిగింది. ముడిచమురు 3% పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం 23 పైసలు లాభపడటం కలసివచ్చింది.
703 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్...
సెన్సెక్స్ నష్టాల్లో ఆరంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుంది. బ్యాంక్, ఫార్మా, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయన్న ఆశలూ సానుకూల ప్రభావం చూపించాయి. మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న వార్తలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. ఇటీవల నష్టాలతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో వేల్యూబయింగ్ చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లూ జరిగాయి. ఒక దశలో 179 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 524 పాయింట్లు పెరిగింది. రోజంతా 703 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
జెట్ ఎయిర్‌వేస్ షేరు డబుల్...
జెట్ ఎయిర్‌వేస్ భారీ లాభాలను సాధించింది. స్టాక్ మార్కెట్లో ఏ షేరూ ఏ రోజూ పెరగనంత స్థాయిలో జెట్ ఎయిర్‌వేస్ షేర్ పెరిగింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేర్ 18 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.27కు పడిపోయింది. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతోఈ ఈ షేర్ పుంజుకుంది. ఇంట్రాడేలో 134 శాతం లాభంతో రూ.77కు ఎగసిన జెట్ ఎయిర్‌వేస్ షేర్ చివరకు 93 శాతం లాభంతో రూ.64 వద్ద ముగిసింది. గత 13 సెషన్లలో ఈ షేర్ దాదాపు 78 శాతం పతనమైంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని ఎన్‌సీఎల్‌టీలో ఎస్‌బీఐ కేసు వేయడం తెలిసిందే.
మరిన్ని విశేషాలు..
► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ షేర్ 8% ఎగసింది.
► యస్ బ్యాంక్ 11 శాతం లాభపడి రూ. 115 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆరంభంలో ఈ షేర్ రెండంకెల స్థాయి, రూ.98.75కి పడిపోయింది. ఈ షేర్ రెండంకెల స్థాయికి పడిపోవడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారి. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల కారణంగా ఈ నష్టాల నుంచి ఈ షేర్ కోలుకుంది.
రూ.1.75 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.75 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.75 లక్షల కోట్లు పెరిగి రూ.1,61,30,671 కోట్లకు పెరిగింది.
ఫెడ్... రేట్ల తగ్గింపు సంకేతాలు!
అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను ప్రస్తుతమున్న 2.25–2.50 శాతం రేంజ్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధి తోడ్పాటుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వివిధ పరిణామాల కారణంగా మందగమనం చోటు చేసుకోవడంతో అవసరమైతే, వచ్చే నెలలోనే రేట్లను అర శాతం మేర తగ్గించగలమని సంకేతాలు ఇచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఫెడ్ నిర్ణయాన్ని ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లూ అనుసరించే అవకాశాలుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఫెడ్ రేట్లను తగ్గిస్తే, వృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా భారత్‌కు విదేశీ నిధులు వెల్లువలా వస్తాయి. అందుకని ఫెడ్ నిర్ణయంతో మన మార్కెట్ భారీగా లాభపడింది.
ఐదేళ్ల గరిష్టానికి పసిడి పరుగు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీ య ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ధర గురువారం పరుగులు పెట్టింది. ఒక దశలో ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, 45 డాలర్ల లాభంతో 1,395 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. పసిడికి ఇది ఐదు సంవత్సరాల్లో గరిష్టస్థాయి. గతంలో పలు సార్లు పసిడి 1,360 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు ఈ స్థాయి దాటడంతో ఒక్కసారిగా 1,400 డాలర్ల వైపు పరుగుపెట్టింది. ఈ స్థాయి దాటితే మరో 50 డాలర్లకు పసిడి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.
పరుగుకు కారణం..: అమెరికాలో వృద్ధి రేటు మందగమనం, దీనితో అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు తగ్గుతుందన్న అంచనాలు (ప్రస్తుతం 2.25–2.50 శాతం) పసిడి పరుగుకు కారణంగా నిలిచాయి. అమెరికా వృద్ధి మందగమనం వార్తలతో డాలర్ ఇండెక్స్ స్పీడ్ తగ్గడం కూడా గమనార్హం. ఇక వాణిజ్యయుద్ధం వంటి అంశాలు ప్రపంచ వృద్ధి తీరును ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆయా అంశాలు పసిడికి తక్షణ బలాన్ని ఇస్తున్నాయి.
దేశంలో రూ. 1,000 అప్..: ఇక దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ చూస్తే, ఈ వార్త రాసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 లాభంతో రూ. 34,058 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 69.44 వద్ద ఉన్న రూపాయి మరింత బలహీనపడితే, దేశంలో పసిడి పరుగు మరింత వేగంగా ఉండే అవకాశం ఉందని అంచనా.
మార్కెట్‌కు ‘ఫెడ్’ జోష్!
Published Fri, Jun 21 2019 5:15 AM | Last Updated on Fri, Jun 21 2019 5:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment