Nifty profit
-
రికార్డుల హోరు
ముంబై: ఇంధన, మౌలిక, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఇంట్రాడేలో వెలువడిన అక్టోబర్ నెల టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లను మెప్పించగలిగాయి. అలాగే రూపాయి బలపడడం, కొనసాగిన విదేశీ పెట్టుబడుల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 154 పాయింట్ల లాభంతో 46,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 13,558 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు సూచీలకు కొత్త జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. మరోవైపు ఆటో, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,373 వద్ద గరిష్టాన్ని, 45,951 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,597–13,472 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో సోమవారం ఎఫ్ఐఐలు రూ.2,264 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఫండ్స్ (డీఐఐ) రూ.1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీశారు. ఇక డాలర్ మారకంలో రూపాయి 9 పైసలు బలపడి 73.55 వద్ద స్థిరపడింది. అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి అనుమతులు లభించడంతో పాటు బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్‌పై బ్రిటన్–ఈయూల మద్య జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో సాను కూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లతో పాటు యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బర్గర్ కింగ్ బంపర్ లిస్టింగ్ ఫాస్ట్‌ఫుడ్ చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో బంపర్ హిట్‌ను సాధించాయి. ఇష్యూ ధర రూ. 60తో పోలిస్తే బీఎస్ఈలో 92% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయ్యాయి. చివరకు 130% లాభంతో రూ.138 వద్ద స్థిరపడ్డాయి. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 5,282.10 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 191.55 లక్షలు, ఎన్ఎస్ఈలో 18.67 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. బర్గర్ కింగ్ కంపెనీ 2020 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 268 దుకాణాలను కలిగి ఉంది. -
ఐటీ జోష్..!
కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, మన మార్కెట్ గురువారం ముందుకే దూసుకుపోయింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాలు అంచనాలను మించడం సానుకూల ప్రభావం చూపించింది. దీంతో ఐటీ షేర్లు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. కొన్ని ఆర్థిక రంగ, ఫార్మా షేర్లు పుంజుకోవడం కలసివచ్చింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 36,472 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 10,740 పాయింట్ల వద్ద ముగిశాయి. ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకొని 75.18 వద్దకు చేరింది. చివరి గంటలో కొనుగోళ్లు: ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్న మన మార్కెట్ మాత్రం మంచి లాభాలతోనే మొదలైంది. అయితే అరగంటలోనే ఈ లాభాలన్నింటినీ కోల్పోయింది. చివరి గంట వరకూ హెచ్చుతగ్గుల్లో కదలాడింది. చివరి గంటలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. స్టాక్ సూచీలు మంచి లాభాలతో ముగిశాయి. ఒక దశలో 14 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 473 పాయింట్ల మేర లాభపడింది. వరుసగా నాలుగు రోజుల నుంచి పతనమవుతూ వస్తున్న ఆర్థిక రంగ షేర్లు ఒకింత కోలుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం.. ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళనతో చైనా షాంఘై సూచీ 4.5 శాతం మేర పతనమైంది. హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా సూచీలు 2 శాతం మేర నష్టపోయాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, హాంగ్‌కాంగ్ విషయమై అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు ముదరడం, ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో చైనా జీడీపీ అంచనాల కంటే తక్కువగానే నమోదు కావడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. నష్టాల్లో ఆరంభమైన యూరప్ సూచీలు చివరకు 1 శాతం మేర నష్టపోయాయి. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో ఇన్ఫోసిస్ షేర్ 10 శాతం లాభంతో రూ.911 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 14 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై, రూ.952 ను తాకింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.33,853 కోట్లు ఎగసి రూ.3,87,966 కోట్లకు పెరిగింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 420 పాయింట్ల లాభంలో ఈ షేర్ వాటా సగానికి పైగా (277 పాయింట్లు) ఉండడం విశేషం. ► జూన్ క్వార్టర్లో నికర లాభం 17 శాతం పెరగడంతో లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ కంపెనీ షేర్ 4 శాతం లాభంతో రూ.2,291 వద్ద ముగిసింది. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ పెరిగినా 350 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. టాటా కన్సూమర్, అర్వింద్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కన్సూమర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
కొత్త శిఖరాలకు సూచీలు
స్టాక్ మార్కెట్లో రికార్డ్ల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డ్లను సృష్టించిన సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం ముగింపులో కొత్త శిఖరాలకు చేరాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 41,021 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు ఎగసి 12,101 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు. వీటితో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా 31,876 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలో ముగిసింది. బ్యాంక్, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభాల స్వీకరణ కారణంగా నష్టపోయాయి. వాహన షేర్లకు ‘స్క్రాప్ పాలసీ’ లాభాలు ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పెరిగాయి. వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాలసీ) ప్రభుత్వం తీసుకు రానున్నదన్న వార్తల కారణంగా వాహన, వాహన విడిభాగాల షేర్లు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్, హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటోలు 1–3 శాతం రేంజ్లో పెరిగాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా ఇదే జోరు చూపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 41,076 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 12,115 పాయింట్లకు చేరాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హైల వద్ద ముగిసినప్పటికీ, వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, చెన్నై పెట్రో, జైన్ ఇరిగేషన్, ఎంఫసిస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరాయి. దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ గ్రీన్, పీఐ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► యస్ బ్యాంక్ 8 శాతం లాభంతో రూ. 68 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. నిధుల సమీకరణ నిమిత్తం ఈ నెల 29న బోర్డ్ సమావేశం జరగనున్నదన్న వార్తలు దీనికి కారణం. ► ఎస్బీఐకు చెందిన క్రెడిట్ కార్డ్‌ల విభాగం, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించిన నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 2.4 శాతం లాభంతో రూ.344 వద్ద ముగిసింది.ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ.3 లక్షల కోట్లకు ఎగబాకింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడ్డ రెండో షేర్ ఇదే. ► ఎల్ అండ్ టీ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,335 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రూ.8 పెరిగితే.. పది లక్షల కోట్లకు! రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 0.7 శాతం లాభంతో రూ.1,570 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.9.96 లక్షల కోట్లకు పెరిగింది. ఈ షేర్ రూ.8 పెరిగితే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది. భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇదే. -
నాలుగో రోజూ లాభాలే...
స్టాక్ మార్కెట్ లాభాలు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ కొనసాగాయి. ఆర్థిక, ఇంధన, ఐటీ రంగ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. అయితే ట్రేడింగ్ ఆద్యంతం సెన్సెక్స్, నిఫ్టీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. రోజం తా 249 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 93 పాయింట్ల లాభంతో 38,599 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 11,464 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకోవడం కలసివచ్చింది. 249 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, విప్రో, ఏసీసీ తదితర కంపెనీల క్యూ2 ఫలితాలు పటిష్టంగా ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ప్రపంచ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నా, మన మార్కెట్ వరుసగా నాలుగో రోజు లాభపడిందని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ తెలిపారు. కంపెనీల ఫలితాల సీజన్ అంచనాల కంటే మెరుగ్గానే ఉందని అంతేకాకుండా భవిష్యత్తు అంచనాలపై కంపెనీల యాజమాన్యాలు ఆశావహ ప్రకటనలు చేయడం సానుకూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. 20,000 కోట్ల డాలర్ల కంపెనీగా రిలయన్స్! రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 20,000 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ గల తొలి కంపెనీగా అవతరించే సత్తా ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తెలిపింది. ప్రస్తుతం 12,200 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ గల ఈ కంపెనీ రెండేళ్లలో ఈ ఘనత సాధించగలదని ఈ సంస్థ అంచనా వేస్తోంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఎస్ఎమ్ఈ ఎంటర్ప్రైజ్ స్పేస్‌లోకి ప్రవేశించడం, జియో ఫైబర్ బిజినెస్.. తదితర అంశాలతో రిలయన్స్ ఈ ఘనత సాధించనున్నదని పేర్కొంది. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ జోష్!
వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర విధానం కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. దీనికి మన దగ్గర షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు, వేల్యూ బయింగ్ కూడా జత కావడంతో మన మార్కెట్ కూడా గురువారం భారీగా లాభపడింది. గత మూడు రోజులుగా అంతంత మాత్రం లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలు సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, రానున్న బడ్జెట్లో వ్యాపార వర్గాలకు అనుకూలమైన చర్యలు ఉంటాయనే అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 39,602 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 11,832 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా... అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసిందన్న వార్తల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ప్రజ్వరిల్లుతాయనే ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు 3% పెరిగి 63.37 డాలర్లకు చేరింది. సాధారణంగా చమురు ధరలు పెరిగితే మన మార్కెట్ పడిపోతుంది. ఈసారి దీనికి భిన్నంగా జరిగింది. ముడిచమురు 3% పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం 23 పైసలు లాభపడటం కలసివచ్చింది. 703 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ నష్టాల్లో ఆరంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుంది. బ్యాంక్, ఫార్మా, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయన్న ఆశలూ సానుకూల ప్రభావం చూపించాయి. మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న వార్తలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. ఇటీవల నష్టాలతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో వేల్యూబయింగ్ చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లూ జరిగాయి. ఒక దశలో 179 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 524 పాయింట్లు పెరిగింది. రోజంతా 703 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జెట్ ఎయిర్వేస్ షేరు డబుల్... జెట్ ఎయిర్వేస్ భారీ లాభాలను సాధించింది. స్టాక్ మార్కెట్లో ఏ షేరూ ఏ రోజూ పెరగనంత స్థాయిలో జెట్ ఎయిర్వేస్ షేర్ పెరిగింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేర్ 18 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.27కు పడిపోయింది. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతోఈ ఈ షేర్ పుంజుకుంది. ఇంట్రాడేలో 134 శాతం లాభంతో రూ.77కు ఎగసిన జెట్ ఎయిర్వేస్ షేర్ చివరకు 93 శాతం లాభంతో రూ.64 వద్ద ముగిసింది. గత 13 సెషన్లలో ఈ షేర్ దాదాపు 78 శాతం పతనమైంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని ఎన్సీఎల్టీలో ఎస్బీఐ కేసు వేయడం తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ షేర్ 8% ఎగసింది. ► యస్ బ్యాంక్ 11 శాతం లాభపడి రూ. 115 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆరంభంలో ఈ షేర్ రెండంకెల స్థాయి, రూ.98.75కి పడిపోయింది. ఈ షేర్ రెండంకెల స్థాయికి పడిపోవడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారి. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల కారణంగా ఈ నష్టాల నుంచి ఈ షేర్ కోలుకుంది. రూ.1.75 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.75 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.75 లక్షల కోట్లు పెరిగి రూ.1,61,30,671 కోట్లకు పెరిగింది. ఫెడ్... రేట్ల తగ్గింపు సంకేతాలు! అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను ప్రస్తుతమున్న 2.25–2.50 శాతం రేంజ్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధి తోడ్పాటుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వివిధ పరిణామాల కారణంగా మందగమనం చోటు చేసుకోవడంతో అవసరమైతే, వచ్చే నెలలోనే రేట్లను అర శాతం మేర తగ్గించగలమని సంకేతాలు ఇచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఫెడ్ నిర్ణయాన్ని ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లూ అనుసరించే అవకాశాలుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఫెడ్ రేట్లను తగ్గిస్తే, వృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా భారత్‌కు విదేశీ నిధులు వెల్లువలా వస్తాయి. అందుకని ఫెడ్ నిర్ణయంతో మన మార్కెట్ భారీగా లాభపడింది. ఐదేళ్ల గరిష్టానికి పసిడి పరుగు న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీ య ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ధర గురువారం పరుగులు పెట్టింది. ఒక దశలో ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, 45 డాలర్ల లాభంతో 1,395 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. పసిడికి ఇది ఐదు సంవత్సరాల్లో గరిష్టస్థాయి. గతంలో పలు సార్లు పసిడి 1,360 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు ఈ స్థాయి దాటడంతో ఒక్కసారిగా 1,400 డాలర్ల వైపు పరుగుపెట్టింది. ఈ స్థాయి దాటితే మరో 50 డాలర్లకు పసిడి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. పరుగుకు కారణం..: అమెరికాలో వృద్ధి రేటు మందగమనం, దీనితో అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు తగ్గుతుందన్న అంచనాలు (ప్రస్తుతం 2.25–2.50 శాతం) పసిడి పరుగుకు కారణంగా నిలిచాయి. అమెరికా వృద్ధి మందగమనం వార్తలతో డాలర్ ఇండెక్స్ స్పీడ్ తగ్గడం కూడా గమనార్హం. ఇక వాణిజ్యయుద్ధం వంటి అంశాలు ప్రపంచ వృద్ధి తీరును ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆయా అంశాలు పసిడికి తక్షణ బలాన్ని ఇస్తున్నాయి. దేశంలో రూ. 1,000 అప్..: ఇక దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ చూస్తే, ఈ వార్త రాసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 లాభంతో రూ. 34,058 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 69.44 వద్ద ఉన్న రూపాయి మరింత బలహీనపడితే, దేశంలో పసిడి పరుగు మరింత వేగంగా ఉండే అవకాశం ఉందని అంచనా. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సుమారు 100 పాయింట్ల లాభంతోనూ, నిఫ్టీ 24.30 పాయింట్ల లాభంతోనూ ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కాపిటల్ గూడ్స్, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ళమద్దతు పెరుగుతోంది. రానున్న రైల్వే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ పై అంచనాల కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగొచ్చని ఎనలిస్టులంటున్నారు. ఫిబ్రవరి సిరీస్ కూడా ఈ వారంలో ముగుస్తున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
బడ్జెట్ అంచనాలతో మార్కెట్ జోరు
- వెలుగులో రక్షణ షేర్లు - 184 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ - నిఫ్టీ లాభం 60 పాయింట్లు - మార్కెట్ అప్డేట్ స్టాక్ మార్కెట్ బుధవారం దాదాపు మూడు వారాల గరిష్ట స్థాయికి చేరింది. వృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందని, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో వడ్డీరేట్లు దిగొస్తాయన్న ఇన్వెస్టర్ల అంచనాలతో స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో 29,320 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,869 పాయింట్ల వద్ద ముగిశాయి. గ్రీస్ రుణ సంక్షోభం పరిష్కారం అవుతుందన్న ఆశలతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయని, దాంతో ఇక్కడి ట్రేడింగ్‌పై సానుకూల ప్రభావం పడిందని ట్రేడర్లు పేర్కొన్నారు. వరుసగా ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,093 పాయింట్లు లాభపడింది. రక్షణ రంగంలో షేర్లు ఇలా..: దేశీయంగా రక్షణ రంగ పరిశ్రమకు ఊతాన్నిచ్చే చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ బెంగళూరులో ఏరో ఇండియా 2015ను ప్రారంభిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగా రక్షణ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. బీఈఎల్ 8%, బీఈఎంఎల్ 4%, పిపవావ్ డిఫెన్స్ 13%, ఆస్ట్రామైక్రోవేవ్ 17%, డైనమాటిక్ టెక్నాలజీస్ 10%, వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ 5.5% చొప్పున పెరిగాయి. ప్రైవేట్ బ్యాంకుల, ఆర్థిక సంస్థల, టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, కొన్ని వాహన షేర్లు పెరిగాయి. కోల్ బ్లాక్‌ల వేలం నేపథ్యంలో మైనింగ్, విద్యుత్ షేర్లు పెరిగాయి. హీరో గ్రూప్ 70 లక్షల ఈక్విటీ షేర్లను రూ.1,800 కోట్లకు విక్రయించడంతో హీరో మోటొకార్ప్ షేరు 5 శాతం క్షీణించింది. టర్నోవర్ ...: టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,162 కోట్లుగా, ఎన్ఎస్ఈలో నగదు విభాగంలో రూ.22,231 కోట్లుగా, డెరివేటివ్స్‌లో రూ.2,15,825 కోట్లుగా నమోదైంది. కాగా నిఘా చర్యల్లో భాగంగా బీఎస్ఈ-ఎల్డర్ ఫార్మా, క్లచ్ ఆటో వంటి 21 కంపెనీల షేర్లను, ఎన్ఎస్ఈ 5 కంపెనీల షేర్లను వచ్చే వారం నియంత్రిత ట్రేడింగ్ సెగ్మెంట్లోకి మార్చనున్నది.