కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, మన మార్కెట్ గురువారం ముందుకే దూసుకుపోయింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాలు అంచనాలను మించడం సానుకూల ప్రభావం చూపించింది. దీంతో ఐటీ షేర్లు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. కొన్ని ఆర్థిక రంగ, ఫార్మా షేర్లు పుంజుకోవడం కలసివచ్చింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 36,472 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 10,740 పాయింట్ల వద్ద ముగిశాయి. ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకొని 75.18 వద్దకు చేరింది.
చివరి గంటలో కొనుగోళ్లు: ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్న మన మార్కెట్ మాత్రం మంచి లాభాలతోనే మొదలైంది. అయితే అరగంటలోనే ఈ లాభాలన్నింటినీ కోల్పోయింది. చివరి గంట వరకూ హెచ్చుతగ్గుల్లో కదలాడింది. చివరి గంటలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. స్టాక్ సూచీలు మంచి లాభాలతో ముగిశాయి. ఒక దశలో 14 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 473 పాయింట్ల మేర లాభపడింది. వరుసగా నాలుగు రోజుల నుంచి పతనమవుతూ వస్తున్న ఆర్థిక రంగ షేర్లు ఒకింత కోలుకున్నాయి.
ప్రపంచ మార్కెట్ల పతనం..
ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళనతో చైనా షాంఘై సూచీ 4.5 శాతం మేర పతనమైంది. హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా సూచీలు 2 శాతం మేర నష్టపోయాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, హాంగ్‌కాంగ్ విషయమై అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు ముదరడం, ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో చైనా జీడీపీ అంచనాల కంటే తక్కువగానే నమోదు కావడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. నష్టాల్లో ఆరంభమైన యూరప్ సూచీలు చివరకు 1 శాతం మేర నష్టపోయాయి.
► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో ఇన్ఫోసిస్ షేర్ 10 శాతం లాభంతో రూ.911 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 14 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై, రూ.952 ను తాకింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.33,853 కోట్లు ఎగసి రూ.3,87,966 కోట్లకు పెరిగింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 420 పాయింట్ల లాభంలో ఈ షేర్ వాటా సగానికి పైగా (277 పాయింట్లు) ఉండడం విశేషం.
► జూన్ క్వార్టర్‌లో నికర లాభం 17 శాతం పెరగడంతో లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ కంపెనీ షేర్ 4 శాతం లాభంతో రూ.2,291 వద్ద ముగిసింది.
► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► స్టాక్ మార్కెట్ పెరిగినా 350 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. టాటా కన్సూమర్, అర్వింద్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కన్సూమర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఐటీ జోష్..!
Published Fri, Jul 17 2020 5:33 AM | Last Updated on Fri, Jul 17 2020 7:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment