
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల సునామీ బుధవారం భారత మార్కెట్‌ను ముంచెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 40,000 స్థాయిని కోల్పోయి 600 పాయింట్ల నష్టంతో 39,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,730 వద్ద స్థిరపడింది. అమెరికా, ఐరోపా దేశాలలో రెండో దశ కోవిడ్–19 కేసుల విజృంభణతో మరోసారి లాక్‌డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థకు అండగా ప్రతిపాదించిన ఉద్దీపన ప్యాకేజీపై ఇప్పటికీ అధికారిక సమాచారం రాకపోవడం నిరుత్సాహపరిచింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తాయి.
ఈ ప్రతికూలాంశాలకు తోడుగా దేశీయంగా రూపాయి బలహీనపడడం, మెప్పించని కంపెనీల క్యూ2 ఫలితాలు, డెరివేటివ్ సిరీస్ ముగింపునకు ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత లాంటి అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్ మరింత దెబ్బతీశాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీల భారీ పతనాన్ని ఖరారు చేశాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో సెనెక్స్ 747 పాయింట్లను కోల్పోయి 39,775 దిగువన కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 200 పాయింట్లను నష్టపోయి 11,685 ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది. నగదు విభాగంలో బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1130.98 కోట్ల షేర్లను విక్రయించారు. డీఐఐలు అతి స్వల్పంగా రూ.1.48 కోట్ల షేర్లను కొన్నారు.
ఆవిరైన రూ.1.56 లక్షల కోట్ల సంపద...
స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.1.56 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.158 లక్షల కోట్లకు దిగివచ్చింది.
‘‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో వారు నిరాశచెందారు. గురువారం అక్టోబర్ డెరివేటివ్ కాంటాక్టు ముగింపు కావడంతో మార్కెట్లో మరింత ఒడిదుడుకులకు లోనైంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ల పట్ల అప్రమత్తత అవసరమని మా కస్టమర్లను హెచ్చరించాము. స్టాక్ ఆధారిత షేర్ల కొనుగోళ్లు ఉత్తమని సలహానిచ్చాము.’’ అని రెలిగేర్ బ్రోకరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
4 శాతం లాభపడ్డ ఎయిర్‌టెల్ షేరు
కన్సాలిడేటెడ్ ప్రతిపాదికన ఒక క్వార్టర్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించినట్లు భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించడంతో కంపెనీ షేరు బుధవారం 4 శాతం లాభంతో రూ.450 వద్ద ముగిసింది. క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉదయం సెషన్‌లో దాదాపు 13 శాతం రూ. 488కు చేరింది. తదుపరి మార్కెట్ భారీ పతనంలో భాగంగా లాభాలన్ని హరించుకుపోయాయి.
టాటా మోటార్స్ 6 శాతం జంప్...
రానున్న రికవరీ క్రమంగా పెరగడంతో పాటు డిమాండ్ ఊపందుకుంటుందనే ఆశాభావ ప్రకటనతో టాటా మోటర్స్ షేరు 6% లాభంతో రూ.143 వద్ద స్థిరపడింది. క్యూ2 ఫలితాలు నిరుత్సాహపరచడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment