బుల్‌ పరుగుకు బ్రేక్‌! | Sensex tanks 1,066 points on global selloff | Sakshi
Sakshi News home page

బుల్‌ పరుగుకు బ్రేక్‌!

Published Fri, Oct 16 2020 4:56 AM | Last Updated on Fri, Oct 16 2020 5:07 AM

Sensex tanks 1,066 points on global selloff - Sakshi

న్యూఢిల్లీ: సూచీల పదిరోజుల సుదీర్ఘ ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అలాగే మార్కెట్‌ 10 రోజుల ర్యాలీతో ఆయా షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపారు. ట్రేడింగ్‌ ప్రారంభంలో మొదలైన అమ్మకాల సునామీ మార్కెట్‌ ముగిసేవరకు కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్‌ 1,066 పాయింట్లను నష్టపోయి 40,000 దిగువన 39,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 291 పాయింట్లను కోల్పోయి 11,680 వద్ద ముగిసింది. అన్ని రంగాలకు షేర్లలో విపరీతమైన విక్రయాలు జరిగాయి. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో ఒక్క ఏషియన్‌ పెయింట్స్‌(0.32 శాతం)మాత్రమే లాభపడింది. ఇక నిఫ్టీలోని 50 షేర్లలో 3 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. గురువారం ఎఫ్‌ఐఐలు రూ.604 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.808 కోట్ల షేర్లను అమ్మారు. బీఎస్‌ఈ ఎక్సే్చంజ్‌లో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.75 శాతం నష్టాన్ని చవిచూశాయి.  

ఆరంభ లాభాల్ని కోల్పోయిన ఇన్ఫీ..  
ఆరంభ లాభాల్ని కోల్పోవడంతో ఇన్ఫోసిస్‌ షేరు గురువారం బీఎస్‌ఈలో 2.50 శాతం లాభపడి రూ.1,108 వద్ద ముగిసింది. రెండో త్రైమాసికపు ఫలితాల్లో లాభాల పంట పండిచిన ఇన్ఫీ షేరు ఉదయం సెషన్‌లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో షేరు 4 శాతం లాభపడి రూ.1,185 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో మార్కెట్‌ క్యాప్‌ రూ.5 లక్షల కోట్లను తాకింది. అనంతరం మార్కెట్‌ పతనంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనై 2.5% లాభంతో ముగిసింది. ప్రపంచమార్కెట్ల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ గురువారం మన మార్కెట్‌ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరుకూ ఎలాంటి ప్యాకేజీ ఉండదని తేటతెల్లం కావడం ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాగే రెండో దశ కరోనా కేసుల విజృంభణతో యూరప్‌ దేశాల్లో విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. రిలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు.   

 ‘అమెరికా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన’’ అంశం ఈక్విటీ మార్కెట్లను నడిపింది. అయితే భారత్‌ మరోమారు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోవడం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ వాయిదా పడటం ఈక్విటీలను నష్టాల వైపు మళ్లించాయి’అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌  వినోద్‌ నాయర్‌ తెలిపారు.

నష్టాల్లో ప్రపంచమార్కెట్లు
ప్రపంచమార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.  నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల వరకు ఎలాంటి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలుండవన్న అమెరికా ప్రకటనతో  అమ్మకాలు నెలకొన్నాయి. యూరప్‌లో రెండో దశ కరోనా వైరస్‌ కేసులు విజృంభణ, అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలు మరోసారి తెరపైకి రావడం తదితర కారణాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా నేడు ఆసియా మార్కెట్లు  2% వరకు నష్టాలతో ముగిశాయి. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు 2–3శాతం క్షీణించాయి. అలాగే అమెరికా సూచీలు భారీ నష్టంతో మొదలయ్యాయి.

రూ. 3.23 లక్షల కోట్ల సంపద ఆవిరి
 మార్కెట్‌ పతనంతో రూ. 3.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద  ఆవిరైంది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం విలువ గురువారం రూ.157.22 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇటీవలే ఈ సంపద రూ. 160.68 లక్షల కోట్ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది.

పతనానికి కారణాలు
► అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆశలు ఆవిరి...
అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన ఆశలు ఆవిరయ్యాయి. ఈ నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలోపు అమెరికా స్వల్ప మొత్తంలో ఉద్దీపన ప్యాకేజీని ప్రపంచ మార్కెట్లు ఆశించాయి. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మునుచిన్‌ ఈ ఆశలపై నీళ్లు చల్లారు. ఎన్నికలయ్యేంత వరకు ఎలాంటి ఆర్థిక ఉద్దీపనలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

► తెరపైకి మరోసారి లాక్‌డౌన్‌ ఆందోళనలు...
రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండడంతో లాక్‌డౌన్‌ విధింపు ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. యూరప్‌లో రోజుకు లక్షకు మించి కోవిడ్‌ –19  కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్‌ –19 కట్టడి చర్యల్లో భాగంగా యూరప్‌లోని పలు దేశాలు కఠినతరమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఫ్రాన్స్‌ దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. బ్రిటన్‌లో బడులను మూసేశారు. శస్త్రచికిత్సలను నిషేధించారు. లాక్‌డౌన్‌ విధింపుపై అక్కడి ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి.  

► అమెరికా–చైనా ఉద్రిక్తతలు...
చైనాకు చెందిన కొన్ని కంపెనీల చర్యలు అమెరికా జాతీయ సమగ్రత, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయంటూ అమెరికా వాణిజ్య గూఢచార విభాగం దేశాధ్యకుడు ట్రంప్‌నకు ఫిర్యాదు చేశాయి.  ఈ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చర్యలతో అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి వచ్చాయి.  

► ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు...
సూచీల పది రోజుల వరుస ర్యాలీకి ప్రాతినిధ్యం వహించిన ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. మెరుగైన క్యూ2 ఫలితాలు, భారీ బైబ్యాక్‌ ప్రకటనల నేపథ్యంలో కేవలం నెలరోజుల్లో 6 శాతం లాభపడిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ గురువారం 3 శాతం నష్టాన్ని చవిచూసింది. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్‌ షేర్లలో విక్రయాలు కూడా సూచీల పతనానికి కారణమయ్యాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 3.50 శాతం నష్టంతో ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement