Derivatives Series
-
ఆర్థిక ఫలితాలు, ఎఫ్‌అండ్‌వో ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారం ప్రధానంగా రెండు అంశాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెల డెరివేటివ్ సిరీస్ గడువు గురువారం(27న) ముగియనుంది. అంటే ఏప్రిల్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు తీరనుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మే నెలకు రోలోవర్ చేసుకునే అవకాశముంది. మరోపక్క ఇప్పటికే ప్రారంభమైన క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాల సీజన్ ఊపందుకోనుంది. గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసిక ఫలితాలతోపాటు.. పూర్తి ఏడాది పనితీరును సైతం దేశీ కార్పొరేట్ దిగ్గజాలు వరుస గా వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ప్రకటించగా.. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్ వారాంతాన పనితీరును వెల్లడించాయి. దీంతో సోమవారం(24న) రిలయ న్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లపై ఫలి తాల ప్రభావం కనిపించనున్నట్లు మార్కెట్ నిపుణు లు తెలియజేశారు. వెరసి మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫలితాల జోరు ఈ వారం మరిన్ని కంపెనీలు గతేడాది చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ నెల 24న, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్ ప్రొడక్టŠస్ 25న, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ టవర్స్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, మారుతీ సుజుకీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 26న ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు ఏసీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో 27న, ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, అల్ట్రాటెక్ సిమెంట్ 28న క్యూ4తోపాటు.. పూర్తి ఏడాదికి పనితీరును తెలియజేయనున్నాయి. ఇతర అంశాలూ కీలకమే నెలల తరబడి రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొ నసాగుతుండటం, అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్ ఆందోళనలు, ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు వంటి అంశాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్ దేశీయంగానూ ప్రభావం చూపనుంది. దీనికితోడు ఇటీవల డాలరుకు పోటీ గా చైనా యువాన్ తదితర కరెన్సీలపై పలు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి కొంతమేర రికవరీ సాధించినప్పటికీ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముడిచమురు ధరలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విదేశీ అంశాలకూ ప్రాధాన్యం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగల విదేశీ అంశాల విషయానికి వస్తే.. మార్చి నెలకు మన్నికైన వస్తువుల ఆర్డర్ల గణాంకాలను ఈ నెల 26న యూఎస్ విడుదల చేయనుంది. మార్చి నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 27న వెల్లడికానున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) వడ్డీ రేట్లపై నిర్ణయాలను 28న ప్రకటించనుంది. ఇప్పటికే అనుసరిస్తున్న సరళతర విధానాలనే బీవోజే మరోసారి అవలంబించే వీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారమిలా.. ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు నామమాత్రంగా బలపడ్డాయి. గత వారం సెన్సెక్స్ 776 పాయింట్లు క్షీణించి 59,655 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 204 పాయింట్లు తక్కువగా 17,624 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం లాభంతో 24,845 వద్ద, స్మాల్ క్యాప్ 0.3 శాతం పుంజుకుని 28,234 వద్ద నిలిచాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు దేశీ మార్కెట్లను ప్రభావితం చేయగల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల(ఏప్రిల్)లో ఇప్పటివరకూ నికరంగా రూ. 8,643 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత నెల(మార్చి)లోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రధానంగా అదానీ గ్రూప్ కంపెనీలలో యూఎస్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ రూ. 7,936 కోట్లు ఇన్వెస్ట్ చేయడం దోహదపడింది. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్‌పీఐలు ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లో రూ. 4,410 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! అయితే గతేడాది(2022–23) ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 37,631 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితులు వంటి అంశాలు ప్రభావం చూపాయి. -
40 వేల దిగువకు సెన్సెక్స్
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల సునామీ బుధవారం భారత మార్కెట్‌ను ముంచెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 40,000 స్థాయిని కోల్పోయి 600 పాయింట్ల నష్టంతో 39,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,730 వద్ద స్థిరపడింది. అమెరికా, ఐరోపా దేశాలలో రెండో దశ కోవిడ్–19 కేసుల విజృంభణతో మరోసారి లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థకు అండగా ప్రతిపాదించిన ఉద్దీపన ప్యాకేజీపై ఇప్పటికీ అధికారిక సమాచారం రాకపోవడం నిరుత్సాహపరిచింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఈ ప్రతికూలాంశాలకు తోడుగా దేశీయంగా రూపాయి బలహీనపడడం, మెప్పించని కంపెనీల క్యూ2 ఫలితాలు, డెరివేటివ్ సిరీస్ ముగింపునకు ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత లాంటి అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్ మరింత దెబ్బతీశాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీల భారీ పతనాన్ని ఖరారు చేశాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో సెనెక్స్ 747 పాయింట్లను కోల్పోయి 39,775 దిగువన కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 200 పాయింట్లను నష్టపోయి 11,685 ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది. నగదు విభాగంలో బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1130.98 కోట్ల షేర్లను విక్రయించారు. డీఐఐలు అతి స్వల్పంగా రూ.1.48 కోట్ల షేర్లను కొన్నారు. ఆవిరైన రూ.1.56 లక్షల కోట్ల సంపద... స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.1.56 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.158 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో వారు నిరాశచెందారు. గురువారం అక్టోబర్ డెరివేటివ్ కాంటాక్టు ముగింపు కావడంతో మార్కెట్లో మరింత ఒడిదుడుకులకు లోనైంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ల పట్ల అప్రమత్తత అవసరమని మా కస్టమర్లను హెచ్చరించాము. స్టాక్ ఆధారిత షేర్ల కొనుగోళ్లు ఉత్తమని సలహానిచ్చాము.’’ అని రెలిగేర్ బ్రోకరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. 4 శాతం లాభపడ్డ ఎయిర్టెల్ షేరు కన్సాలిడేటెడ్ ప్రతిపాదికన ఒక క్వార్టర్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించడంతో కంపెనీ షేరు బుధవారం 4 శాతం లాభంతో రూ.450 వద్ద ముగిసింది. క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉదయం సెషన్లో దాదాపు 13 శాతం రూ. 488కు చేరింది. తదుపరి మార్కెట్ భారీ పతనంలో భాగంగా లాభాలన్ని హరించుకుపోయాయి. టాటా మోటార్స్ 6 శాతం జంప్... రానున్న రికవరీ క్రమంగా పెరగడంతో పాటు డిమాండ్ ఊపందుకుంటుందనే ఆశాభావ ప్రకటనతో టాటా మోటర్స్ షేరు 6% లాభంతో రూ.143 వద్ద స్థిరపడింది. క్యూ2 ఫలితాలు నిరుత్సాహపరచడం గమనార్హం. -
స్టాక్ మార్కెట్ కు జపాన్ లాభాలు..
♦ ఈ ఏడాదిలో మార్కెట్‌కు లాభాలొచ్చిన తొలి వారం ఇదే... ♦ ముడి చమురు ధరలు పెరుగుదలా కలసివచ్చింది ♦ రూపాయి బలపడడంతో సానుకూల ప్రభావం ♦ 401 పాయింట్ల లాభంతో 24,871కు సెన్సెక్స్ ♦ 139 పాయింట్ల లాభంతో 7,564కు నిఫ్టీ ఫిబ్రవరి డెరివేటివ్స్ సిరీస్ తొలి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. జపాన్ కేంద్ర బ్యాంక్ రుణాత్మక (నెగెటివ్) వడ్డీరేట్ల విధానాన్ని ప్రకటించడం, ముడి చమురు ధరలు పెరుగుతుండడం వంటి పరిణామాలతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా భారీ లాభాలను సాధించింది. నిఫ్టీ 7,500 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 401 పాయింట్ల (1.64 శాతం) లాభంతో 24,871 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 139 పాయింట్ల (1.87%) లాభంతో 7,564 పాయింట్ల వద్ద ముగిశాయి. వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెన్సెక్స్ 435 పాయింట్లు (1.78%), నిఫ్టీ 141 పాయింట్లు(1.9%) చొప్పున లాభపడ్డాయి. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసిన తొలి వారం ఇదే. రూపాయి బలపడడం, తగ్గిన ద్రవ్యలోటు, ఇన్వెస్టర్లు తాజాగా లాంగ్ పొజిషన్లు బిల్టప్ చేసుకోవడం వంటివీ సానుకూలతలే. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో బ్లూచిప్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. నష్టాల్లో ప్రారంభం... బీఎస్ఈ సెన్సెక్స్ 24,347 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. జపాన్ రుణాత్మక వడ్డీరేట్ల విధానంతో ఆసియా మార్కెట్లు దూసుకుపోవడంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా ఉండటంతో వెంటనే లాభాల బాట పట్టింది. ఫిబ్రవరి డెరివేటివ్స్ సిరీస్ ప్రారంభం సందర్భంగా పొజిషన్ల బిల్డప్ కారణంగా ఇంట్రాడేలో 24,912 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 401 పాయింట్ల (1.64 శాతం)లాభంతో 24,871 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 7,576 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది కూడా. జపాన్ ఎఫెక్ట్... కేంద్ర బ్యాంక్ వద్ద ఉంచే జపాన్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లపై మైనస్ 0.1 శాతం వడ్డీరేటును విధిస్తామని జపాన్ కేంద్ర బ్యాంక్ పేర్కొంది. గతంలో జపాన్ కేంద్ర బ్యాంకే 0.1 శాతం వడ్డీరేటును బ్యాంకులకు చెల్లించేది. వడ్డీరేట్లను మరింత తగ్గించి కొనుగోళ్లు పెంచడం లక్ష్యంగా జపాన్ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైతే రుణాత్మక(మైనస్) వడ్డీరేట్లను మరింత పెంచుతామని కూడా పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పండగ చేసుకున్నాయి. ‘షేర్ల’జోరు.. ♦ ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థల షేర్లు ధరలు కూడా పెరిగాయి. ♦ చమురు, కమోడిటీ ధరలు పెరుగుతుండటంతో లోహ, ఆయిల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ♦ ఇంజినీర్స్ ఇండియా 10 శాతం వాటా విక్రయం విజయవంతమైంది. రూ.189 ధర వద్ద 3.36 కోట్ల షేర్ల విక్రయాలతో కేంద్ర ఖజానాకు రూ.637 కోట్ల నిధులు వచ్చాయి. ♦ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్టీపీసీ 1.5% నష్టపోగా, లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు 2.3% పెరిగింది. గురువారం వెల్లడైన ఫలితాలు అంచనాలను అనుగుణంగా లేకపోవడంతో భారతీ ఎయిర్టెల్, మారుతీలు తగ్గాయి. రూపాయి 45 పైసలు అప్... ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల రికవరీ నేపథ్యంలో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో మూడు రోజుల రూపాయి క్షీణతకు బ్రేక్ పడింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ శుక్రవారం 45 పైసలు బలపడి 67.78 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు కోలుకున్నందున మళ్లీ విదేశీ నిధులు తరలిరాగలవన్న అంచనాలతో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించినట్లు నిపుణులు పేర్కొన్నారు. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో క్రితం ముగింపు 68.23తో పోలిస్తే మెరుగ్గా 68.10 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో 68.12-67.78 మధ్య తిరుగాడింది. చివరికి 0.66 శాతం పెరిగి 67.78 వద్ద ముగిసింది.