స్టాక్ మార్కెట్ కు జపాన్ లాభాలు..
♦ ఈ ఏడాదిలో మార్కెట్‌కు లాభాలొచ్చిన తొలి వారం ఇదే...
♦ ముడి చమురు ధరలు పెరుగుదలా కలసివచ్చింది
♦ రూపాయి బలపడడంతో సానుకూల ప్రభావం
♦ 401 పాయింట్ల లాభంతో 24,871కు సెన్సెక్స్
♦ 139 పాయింట్ల లాభంతో 7,564కు నిఫ్టీ
ఫిబ్రవరి డెరివేటివ్స్ సిరీస్ తొలి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. జపాన్ కేంద్ర బ్యాంక్ రుణాత్మక (నెగెటివ్) వడ్డీరేట్ల విధానాన్ని ప్రకటించడం, ముడి చమురు ధరలు పెరుగుతుండడం వంటి పరిణామాలతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా భారీ లాభాలను సాధించింది. నిఫ్టీ 7,500 పాయింట్ల మార్క్‌ను దాటేసింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 401 పాయింట్ల (1.64 శాతం) లాభంతో 24,871 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 139 పాయింట్ల (1.87%) లాభంతో 7,564 పాయింట్ల వద్ద ముగిశాయి. వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెన్సెక్స్ 435 పాయింట్లు (1.78%), నిఫ్టీ 141 పాయింట్లు(1.9%) చొప్పున లాభపడ్డాయి. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసిన తొలి వారం ఇదే. రూపాయి బలపడడం, తగ్గిన ద్రవ్యలోటు, ఇన్వెస్టర్లు తాజాగా లాంగ్ పొజిషన్లు బిల్టప్ చేసుకోవడం వంటివీ సానుకూలతలే. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో బ్లూచిప్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి.
నష్టాల్లో ప్రారంభం...
బీఎస్‌ఈ సెన్సెక్స్ 24,347 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. జపాన్ రుణాత్మక వడ్డీరేట్ల విధానంతో ఆసియా మార్కెట్లు దూసుకుపోవడంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా ఉండటంతో వెంటనే లాభాల బాట పట్టింది. ఫిబ్రవరి డెరివేటివ్స్ సిరీస్ ప్రారంభం సందర్భంగా పొజిషన్ల బిల్డప్ కారణంగా ఇంట్రాడేలో 24,912 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 401 పాయింట్ల (1.64 శాతం)లాభంతో 24,871 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 7,576 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది కూడా.
జపాన్ ఎఫెక్ట్...
కేంద్ర బ్యాంక్ వద్ద ఉంచే జపాన్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లపై మైనస్ 0.1 శాతం వడ్డీరేటును విధిస్తామని జపాన్ కేంద్ర బ్యాంక్ పేర్కొంది. గతంలో జపాన్ కేంద్ర బ్యాంకే 0.1 శాతం వడ్డీరేటును బ్యాంకులకు చెల్లించేది. వడ్డీరేట్లను మరింత తగ్గించి కొనుగోళ్లు పెంచడం లక్ష్యంగా జపాన్ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైతే రుణాత్మక(మైనస్) వడ్డీరేట్లను మరింత పెంచుతామని కూడా పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పండగ చేసుకున్నాయి.
‘షేర్ల’జోరు..
♦ ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థల షేర్లు ధరలు కూడా పెరిగాయి.
♦ చమురు, కమోడిటీ ధరలు పెరుగుతుండటంతో లోహ, ఆయిల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
♦ ఇంజినీర్స్ ఇండియా 10 శాతం వాటా విక్రయం విజయవంతమైంది. రూ.189 ధర వద్ద 3.36 కోట్ల షేర్ల విక్రయాలతో కేంద్ర ఖజానాకు రూ.637 కోట్ల నిధులు వచ్చాయి.
♦ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌టీపీసీ 1.5% నష్టపోగా, లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు 2.3% పెరిగింది. గురువారం వెల్లడైన ఫలితాలు అంచనాలను అనుగుణంగా లేకపోవడంతో భారతీ ఎయిర్‌టెల్, మారుతీలు తగ్గాయి.
రూపాయి 45 పైసలు అప్...
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల రికవరీ నేపథ్యంలో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో మూడు రోజుల రూపాయి క్షీణతకు బ్రేక్ పడింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ శుక్రవారం 45 పైసలు బలపడి 67.78 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు కోలుకున్నందున మళ్లీ విదేశీ నిధులు తరలిరాగలవన్న అంచనాలతో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించినట్లు నిపుణులు పేర్కొన్నారు. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో క్రితం ముగింపు 68.23తో పోలిస్తే మెరుగ్గా 68.10 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో 68.12-67.78 మధ్య తిరుగాడింది. చివరికి 0.66 శాతం పెరిగి 67.78 వద్ద ముగిసింది.