గణాంకాల కిక్‌.. అమెరికా ఉద్దీపన ఊరట | US stocks climb amid optimism around further economic stimulus | Sakshi
Sakshi News home page

గణాంకాల కిక్‌.. అమెరికా ఉద్దీపన ఊరట

Published Fri, Oct 2 2020 4:46 AM | Last Updated on Fri, Oct 2 2020 4:55 AM

US stocks climb amid optimism around further economic stimulus - Sakshi

అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై సానుకూల అంచనాలకు తోడు ఆర్థిక గణాంకాలు ఆశావహంగా ఉండటంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ దుమ్మురేపింది.  సెన్సెక్స్‌ 38,500 పాయింట్లపైకి, నిఫ్టీ 11,400 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 63 పైసలు పుంజుకొని 73.13కు చేరడం, అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ 629 పాయింట్లు ఎగసి 38,697 పాయింట్ల వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు పెరిగి 11,417 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌1.65 శాతం, నిఫ్టీ 1.51 శాతం చొప్పున పెరిగాయి. వరుసగా రెండో రోజూ స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి.  

ఆరంభం నుంచి అంతే...
ఆసియా మార్కెట్ల జోష్‌తో ఆరంభంలోనే మన మార్కెట్‌ భారీ లాభాలను సాధించింది. రోజంతా లాభాలు  కొనసాగాయి. బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు బాగా పెరిగాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 1,308 పాయింట్లు, నిఫ్టీ 367 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. శాతం పరంగా, సెన్సెక్స్‌ 3.49 శాతం, నిఫ్టీ 3.31 శాతం చొప్పున పెరిగాయి. సెలవుల కారణంగా షాంఘై, హాంకాంగ్, దక్షిణ కొరియా మార్కెట్లు పనిచేయలేదు. సాంకేతిక సమస్యల కారణంగా జపాన్‌ మార్కెట్లో  ట్రేడింగ్‌ జరగలేదు. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  

మరిన్ని విశేషాలు....
► ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 12.4 శాతం లాభంతో రూ.593 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు షేర్లు–ఐటీసీ, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టైటాన్, ఓఎన్‌జీసీ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి.  


లాభాలు ఎందుకంటే...
► సెప్టెంబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ. 95,480 కోట్లకు చేరాయి. ఆగస్టులో వసూలయిన జీఎస్‌టీ వసూళ్లకన్నా సెప్టెంబర్‌ వసూళ్లు 10% అధికంకావడం విశేషం.
► దేశీయ తయారీ రంగం సెప్టెంబర్‌లో ఎనిమిదిన్నరేళ్ల గరిష్టస్థాయికి ఎగసింది.
► సెప్టెంబర్‌లో వాహన విక్రయాలు జోరుగా పెరిగాయి. మారుతీ, బజాజ్‌ ఆటో తదితర కంపెనీల అమ్మకాలు 10–30 శాతం రేంజ్‌లో పెరగడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉరకలేసింది.   
► కరోనా వైరస్‌ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా ప్రభుత్వం మరో భారీ ఉద్దీపన ప్యాకేజీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటించనున్నదన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి.  
► కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా  సినిమాహాళ్లు, మాల్స్‌ను  తెరవడానికి  అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల ద్వారా  కేంద్రం అనుమతిచ్చింది.
► డాలర్‌తో రూపాయి మారకం విలువ 63 పైసలు పుంజుకొని 73.13కు చేరింది.

రూ.1.7 లక్షల కోట్లు ఎగసిన సంపద
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.7 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.68 లక్షల కోట్లు ఎగసి 156.9 లక్షల కోట్లకు చేరింది

నేడు మార్కెట్‌కు సెలవు
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నేడు (అక్టోబర్‌ 2–శుక్రవారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. ఫారెక్స్, బులియన్‌ మార్కెట్లు కూడా పనిచేయవు. ట్రేడింగ్‌ మళ్లీ మూడు రోజుల తర్వాత సోమవారం(ఈ నెల 5న) జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement