గురువారం నాటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ శుక్రవారం కోలుకుంది. త్వరలో అమెరికా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగలదన్న వార్తల కారణంగా కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ కళకళలాడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు పుంజుకొని 73.61 వద్దకు చేరడం కలసివచ్చింది. ప్రపంచ మార్కెట్లు గురువారం నాటి నష్టాల నుంచి కోలుకోవడం, గత ఆరు రోజుల పతనం కారణంగా నష్టపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం(వేల్యూ బయింగ్), కేంద్ర ప్రభుత్వం కూడా పండగ ప్యాకేజీని ఇవ్వనున్నదన్న వార్తలు.....సానుకూల ప్రభావం చూపించాయి. దీంతో ఆరు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 37,388 పాయింట్ల వద్ద, నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 11,050 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 2.2 శాతం మేర లాభపడ్డాయి. అయితే వారం పరంగా చూస్తే, స్టాక్ సూచీలు భారీగానే నష్టపోయాయి. సెన్సెక్స్1,457 పాయింట్లు,నిఫ్టీ 455 పాయింట్ల మేర పతనమయ్యాయి.సెన్సెక్స్ 3.8 శాతం, నిఫ్టీ 4 శాతం మేర క్షీణించాయి.
ఆరంభం నుంచి లాభాలే....
ఆసియా మార్కెట్ల జోష్‌తో మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 917 పాయింట్లు, నిఫ్టీ 267 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. హాంకాంగ్, షాంఘైలు మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు మ్రిÔ¶ మంగా ముగిశాయి.
► సెన్సెక్స్‌లోని అన్ని (30) షేర్లూ లాభపడ్డాయి.
► రూ.20,000 కోట్ల రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ డిమాండ్‌కు సంబంధించిన ఆర్బిట్రేషన్ కేసును గెలవడంతో వొడాఫోన్ ఐడియా షేర్ 14 శాతం లాభంతో రూ.10.36 వద్ద ముగిసింది.
► యాక్సెంచర్ కంపెనీ 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, కంపెనీ వ్యాఖ్యలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి.
► రుణ భారం తగ్గంచుకోవడానికి కాకినాడ సెజ్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను విక్రయించనుండటంతో జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేర్ 11 శాతం లాభంతో రూ.23.55 వద్ద ముగిసింది.
► 350 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు, ఈ జాబితాలో ఉన్నాయి.
► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అపోలో హస్పిటల్స్, గ్రాన్యూల్స్, అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
లాభాలు ఎందుకంటే...
► ప్యాకేజీలపై ఆశలు
కరోనాతో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి వచ్చే వారం ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనున్నదని వార్తలు వచ్చాయి. మరోవైపు పండగ జోష్‌ను పెంచడానికి మన ప్రభుత్వం కూడా ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వొచ్చన్న వార్తలు ఇన్వెస్టర్లలో జోష్‌ను పెంచాయి.
► స్టేబుల్ రేటింగ్...
భారత ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ నిలకడగా(స్టేబుల్)గా ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ, స్టాండర్డ్ అండ్ పూర్స్ పేర్కొంది. 2021 నుంచి వృద్ధి పుంజుకోగలదనే అంచనాలను వెలువరించింది.
► వేల్యూ బయింగ్....
గత ఆరు రోజుల నష్టాల కారణంగా పలు షేర్ల ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉండటంతో వేల్యూ బయింగ్ చోటు చేసుకుంది.
► పుంజుకున్న రూపాయి....
డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు పుంజుకొని 73.61 వద్దకు చేరడం కలసివచ్చింది.
3.52 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.52 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.52 లక్షల కోట్లుపెరిగి రూ.152.28 లక్షల కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment