బడ్జెట్ అంచనాలతో మార్కెట్ జోరు
- వెలుగులో రక్షణ షేర్లు
- 184 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- నిఫ్టీ లాభం 60 పాయింట్లు
- మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్ బుధవారం దాదాపు మూడు వారాల గరిష్ట స్థాయికి చేరింది. వృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందని, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో వడ్డీరేట్లు దిగొస్తాయన్న ఇన్వెస్టర్ల అంచనాలతో స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో 29,320 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,869 పాయింట్ల వద్ద ముగిశాయి. గ్రీస్ రుణ సంక్షోభం పరిష్కారం అవుతుందన్న ఆశలతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయని, దాంతో ఇక్కడి ట్రేడింగ్‌పై సానుకూల ప్రభావం పడిందని ట్రేడర్లు పేర్కొన్నారు. వరుసగా ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,093 పాయింట్లు లాభపడింది.
రక్షణ రంగంలో షేర్లు ఇలా..: దేశీయంగా రక్షణ రంగ పరిశ్రమకు ఊతాన్నిచ్చే చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ బెంగళూరులో ఏరో ఇండియా 2015ను ప్రారంభిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగా రక్షణ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. బీఈఎల్ 8%, బీఈఎంఎల్ 4%, పిపవావ్ డిఫెన్స్ 13%, ఆస్ట్రామైక్రోవేవ్ 17%, డైనమాటిక్ టెక్నాలజీస్ 10%, వాల్‌చంద్ నగర్ ఇండస్ట్రీస్ 5.5% చొప్పున పెరిగాయి. ప్రైవేట్ బ్యాంకుల, ఆర్థిక సంస్థల, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, కొన్ని వాహన షేర్లు పెరిగాయి. కోల్ బ్లాక్‌ల వేలం నేపథ్యంలో మైనింగ్, విద్యుత్ షేర్లు పెరిగాయి. హీరో గ్రూప్ 70 లక్షల ఈక్విటీ షేర్లను రూ.1,800 కోట్లకు విక్రయించడంతో హీరో మోటొకార్ప్ షేరు 5 శాతం క్షీణించింది.
టర్నోవర్ ...: టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,162 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో నగదు విభాగంలో రూ.22,231 కోట్లుగా, డెరివేటివ్స్‌లో రూ.2,15,825 కోట్లుగా నమోదైంది. కాగా నిఘా చర్యల్లో భాగంగా బీఎస్‌ఈ-ఎల్డర్ ఫార్మా, క్లచ్ ఆటో వంటి 21 కంపెనీల షేర్లను, ఎన్‌ఎస్‌ఈ 5 కంపెనీల షేర్లను వచ్చే వారం నియంత్రిత ట్రేడింగ్ సెగ్మెంట్‌లోకి మార్చనున్నది.