ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆర్థిక ప్యాకేజీ ఉసూరుమనిపించడంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ప్రపంచ మార్కెట్లు పతనమవడం, ముడి చమురు ధరలు 4% మేర ఎగబాకడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం.....ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 32,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 955 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 886 పాయింట్ల నష్టంతో 31,123 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 241 పాయింట్లు క్షీణించి 9.143 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.77 శాతం, నిఫ్టీ 2.57 శాతం చొప్పున నష్టపోయాయి.
రోజంతా నష్టాలు...: ప్రపంచ మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజంతా స్టాక్ సూచీల క్షీణత కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మరింతగా పెరగడంతో నష్టాలు కూడా మరింతగా పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, మీడియా,హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, బ్యాంక్, టెలికం షేర్లు నష్టపోయాయి.
మరిన్ని విశేషాలు....
► టెక్ మహీంద్రా షేర్ 5% నష్టంతో రూ.516 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్ ఇదే.
► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, దాదాపు 40 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. అలెంబిక్ ఫార్మా, ఆర్తి డ్రగ్స్, రుచి సోయా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► కంపెనీల ఐటీ వ్యయాలు 8 శాతం మేర తగ్గుతాయని గార్ట్‌నర్ సంస్థ వెల్లడించడంతో ఐటీ షేర్లు 5 శాతం వరకూ నష్టపోయాయి.
► 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఎన్‌బీసీసీ,ఐనాక్స్ విండ్, జుబిలంట్ లైఫ్‌సైన్సెస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. మరోవైపు మహీంద్రా సీఐఈ ఆటోమేషన్ ,జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ తదితర 200 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి.
రూ.2 లక్షల కోట్లు ఆవిరి...
మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్‌ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.1.99,620 కోట్లు హరించుకుపోయి రూ.122.68 లక్షల కోట్లకు పడిపోయింది.
నష్టాలు ఎందుకంటే....
నిరాశపరిచిన ప్యాకేజీ 2.0: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ 2.0 మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. రూ.6 లక్షల కోట్ల మేర ఆమె ప్రకటించిన ఉద్దీపన చర్యలు సరిపోవని, ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాల్లేవనే ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉద్దీపన చర్యలు సానుకూలంగానే ఉన్నాయని, కానీ వాటి ఆచరణే కీలకమని పలు బ్రోకరేజ్ సంస్థలు వ్యాఖ్యానించాయి.
ప్రపంచ మార్కెట్ల పతనం: స్పానిష్ ఫ్లూ తదితర వైరస్‌ల్లాగా కరోనా వైరస్ కనుమరుగయ్యే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు తీవ్ర అనిశ్చితిలో ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1–2 శాతం, యూరప్ మార్కెట్లు
2–3 శాతం రేంజ్‌లో నష్టపోయాయి.
లాక్‌డౌన్ 4.0: ఈ నెల 18 నుంచి కొత్త నిబంధనలతో నాలుగో దశ లాక్‌డౌన్ మొదలు కానున్నది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటివరకైతే వెల్లడి కాలేదు. ఇప్పటికే 50 రోజులకు మించిన లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్ 4.0 మరింత ప్రతికూల ప్రభావం చూపగలదన్న ఆందోళన నెలకొన్నది.
పెరుగుతున్న కరోనా కేసులు: దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా 2.0 కేసులు కూడా పెరుగుతుండటం తీవ్రమైన ప్రభావమే చూపుతోంది.
మార్కెట్లకు ప్యాకేజీ నచ్చలే..!
Published Fri, May 15 2020 3:19 AM | Last Updated on Fri, May 15 2020 3:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment