
ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు నష్టపోయి 75.73కు చేరడం, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభం కావడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 659 పాయింట్లు లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 81 పాయింట్ల నష్టంతో 31,561 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,440 పాయింట్లకు ఎగసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 12 పాయింట్ల నష్టంతో 9,239 వద్దకు చేరింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 801 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.
ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు.....
కరోనా అనిశ్చితిని తట్టుకోవడానికి పలు ఆర్థిక రంగ కంపెనీలు కేటాయింపులు పెంచాయి. దీంతో మొండి బకాయిలు ఎగబాకుతాయన్న ఆందోళనతో ఈ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
► ఐసీఐసీఐ బ్యాంక్ 5% నష్టంతో రూ.320 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్ ఇదే.
► నేటి(మంగళవారం) నుంచి 15 రైళ్లు నడవనుండటంతో ఐఆర్‌సీటీసీ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.1,303 వద్ద ముగిసింది.
► దేశీయంగా విమాన సర్వీసులను ఈ నెల 18 నుంచి అనుమతించవచ్చన్న వార్తలతో స్పైస్‌జెట్, ఇండిగో షేర్లు 4% మేర లాభపడ్డాయి.
► కొన్ని ప్రాంతాల్లో షోరూమ్స్ ప్రారంభమై, వాహన విక్రయాలు మొదలుకావడంతో వాహన షేర్లు జోరుగా పెరిగాయి.
మళ్లీ రూ. 10 లక్షల కోట్లకు రిలయన్స్ మార్కెట్ విలువ
రైట్స్ ఇష్యూకు రికార్డ్ డేట్‌ను ఈ నెల 14గా నిర్ణయించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇంట్రాడేలో 3.4% లాభంతో రూ.1,615కు ఎగసింది. ఆల్‌టైమ్ హై ధరకు మరో రూ.3 మాత్రమే తక్కువ. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ.10 లక్షల కోట్లకు ఎగబాకింది. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 10% మేర ఎగసింది. చివరకు ఈ షేర్ 1% లాభంతో రూ.1,576 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.9,99,565 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment