న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) చివరినాటికి కోవిడ్–19 ముందస్తు స్థాయికి మెరుగుపడుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 8%లోపే ఉంటుందన్నది కూడా తమ అంచనా అని ఒక వార్తా సంస్థతో పేర్కొన్నారు. భారత్ రికవరీ ఊహించినదానికన్నా వేగంగా ఉందన్నారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియ
పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేకంగా దృష్టి సారించిందనీ, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ)తన వాటా అమ్మకం ద్వారా రూ.1.20 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లలో వాటాల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల సమీకరణ లక్ష్యం.
బ్యాంకింగ్ సేవల విస్తరణ జరగాలి
బ్యాంకింగ్ సేవల విస్తరణ మరింతగా జరగాలని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జీడీపీలో ప్రైవేటు రుణ నిష్పత్తి ప్రస్తుతం 50 శాతంగానే ఉన్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నిష్పత్తి 100 శాతానికిపైగా ఉందని అన్నారు. వ్యవసాయ రంగం గురించి ఆయన మాట్లాడుతూ, రసాయనాల రహిత సహజ సాగు కార్యక్రమాల పురోగతిపై నీతి ఆయోగ్ దృష్టి సారిస్తోందన్నారు. ఈ దిశలో ముందడుగు వేయడానికి తన వంతు కృషి చేస్తుందన్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గుతాయని అన్నారు. అలాగే పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని వివరించారు. వ్యవసాయ రంగంలో పోటీతత్వం, అలాగే రైతుల ఆదాయాల పెరుగుదల వంటి అంశాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు.
ఫ్యాంటసీ స్పోర్ట్స్ కోసం స్వీయ నియంత్రణ సంస్థ
నీతి ఆయోగ్ సిఫార్సు
ఆన్‌లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి ఒక స్వీయ–నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను స్వతంత్ర బోర్డుకు అప్పగించాలని సూచించింది. 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఆన్‌లైన్ ఫ్యాంటసీ గేమ్స్ ఆడేలా, మైనర్లను దూరంగా ఉంచేలా ఆంక్షలు ఉండాలని ఒక ముసాయిదా నివేదికలో పేర్కొంది. గవర్నెన్స్, చట్టాలు, పాలన తదితర రంగాల్లో పేరొందిన వ్యక్తులను స్వతంత్ర పర్యవేక్షణ బోర్డులో నియమించాలని అందులో సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇటీవలి నివేదిక ప్రకారం ఆన్‌లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య 2016 జూన్‌తో పోల్చితే, 2019 డిసెంబర్ నాటికి 212 శాతం వృద్ధి చెంది 9 కోట్ల మందికి పెరిగింది. 2023 నాటికి దీని ద్వారా 150 కోట్ల మేర ఆన్‌లైన్ లావాదేవీలు జరగొచ్చని అంచనా.
15 నెలల్లో కోవిడ్ ముందు స్థాయికి ఎకానమీ!
Published Mon, Dec 7 2020 5:39 AM | Last Updated on Mon, Dec 7 2020 5:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment