కొత్త ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్ రికార్డు లాభాలతో స్వాగతం పలికింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే సెన్సెక్స్ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి (ఇంట్రాడే) రికార్డ్‌ను సాధించింది. అయితే ఆ తర్వాత గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు దాదాపు సగం మేర ఆవిరయ్యాయి. చైనా తయారీ రంగ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం, వాణిజ్య యుద్ధం నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య చర్చల్లో పురోగతి కనిపిస్తుండటంతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారి ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతుండటం, వడ్డీరేట్ల తగ్గింపు దిశగా ఆర్‌బీఐ పాలసీ ఉండనున్నదన్న అంచనాలు బలం పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు మెరుగుపడటం కూడా కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 199 పాయింట్ల లాభంతో 38,872 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 11,669 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 39,116 పాయింట్లను తాకింది. లోహ, వాహన, ఇంధన, మౌలిక రంగ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు నష్టపోయాయి. మొత్తం 19 రంగాల సూచీల్లో 12 లాభాల్లో, 7 నష్టాల్లో ముగిశాయి.
పావు శాతం తగ్గింపు...
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి పాలసీని ఆర్‌బీఐ ఈ గురువారం వెల్లడిస్తుంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎమ్‌పీసీ) సమావేశం నేడు మొదలై గురువారం ముగుస్తుంది. కీలకమైన రెపో రేటును ఆర్‌బీఐ పావు శాతం మేర తగ్గిస్తుందనే అంచనాలున్నాయి. అమెరికాలో పదేళ్ల బాండ్ల రాబడులు పెరగడంతో అంతర్జాతీయ వృద్ధి అంచనాలపై అనిశ్చితి తొలగిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది.
ఇంట్రాడేలో కొత్త రికార్డ్
సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలతో ఆరంభమయ్యాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఈ లాభాలు మరింతగా ఎగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 443 పాయింట్ల లాభంతో 39,116 పాయింట్ల వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు ఎగసి 11,738 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిలను తాకాయి. ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్‌టైమ్ హై, 30,646 పాయింట్లను తాకింది. ట్రేడింగ్ చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఈ లాభాలు తగ్గాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 244 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయినట్లయింది. ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. గత ఆర్థిక సంవత్సరం వార్షిక ముగింపు కారణంగా సోమవారం నాడు ఫారెక్స్, బాండ్ల మార్కెట్ పనిచేయలేదు. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
మరిన్ని విశేషాలు..
►స్టాక్ మార్కెట్ లాభాల కారణంగా సోమవారం ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.1.11 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే స్టాక్ మార్కెట్లో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,52,19,554 కోట్లకు ఎగసింది.
►దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమై, ఆ రెండు బ్యాంక్‌ల వాటాదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు జారీ కావడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 3 శాతం లాభపడి రూ.133 వద్ద ముగిసింది.
►మార్చి క్వార్టర్లో మంచి ఫలితాలు సాధించగలమని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేయడంతో టాటా మోటార్స్ షేర్ 7.3 శాతం ఎగసి రూ.187 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అధికంగా లాభపడిన షేర్ ఇదే.
►ధరల పెంపు వార్తల కారణంగా సిమెంట్ షేర్లు లాభపడ్డాయి. జేకే లక్ష్మీ సిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, హెడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా,, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, శ్రీ సిమెంట్, జేకే సిమెంట్స్ తదితర షేర్లు 1–5 శాతం రేంజ్‌లో పెరిగాయి.
రూపాయికి మరింత బలం!
ముంబై: ఆర్‌బీఐ... వ్యవస్థలోకి 5 బిలియన్ డాలర్లను (రూ.35,000 కోట్లు) పంప్ చేయనుంది. డాలర్–రూపాయి స్వాప్ ఆక్షన్ ద్వారా 23వ తేదీన ఈ లిక్విడిటీని బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంప్ చేయనున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ ఈ తరహా చర్యలు చేపట్టడం వారంలో ఇది రెండవసారి. మార్చి 26న కూడా ఇదే విధమైన చర్యలను (మూడేళ్ల కాలానికి డాలర్/రూపాయి కొనుగోలు/అమ్మకం వేలం) ఆర్‌బీఐ తీసుకుంది. ఈ చర్య రూపాయి మరింత బలోపేతానికి దారితీసే అంశం.
రూ. 9 లక్షల కోట్లకు చేరువలో రిలయన్స్...
ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయిని తాకినట్లుగానే పలు షేర్లు కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇంట్రాడేలో 3.8 శాతం లాభంతో రూ.1,407(ఆల్‌టైమ్ హై)ను తాకింది. చివరకు 2 శాతం లాభంతో రూ.1,392 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.18,084 కోట్లు పెరిగి రూ.8,82,061 కోట్లకు ఎగసింది. రూ.9 లక్షల మార్కెట్‌క్యాప్ విలువకు కేవలం రూ.17,939 కోట్లు మాత్రమే తక్కువ. మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే, భారత్‌లో అత్యంత విలువైన కంపెనీ ఇదే. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, సిటీ యూనియన్ బ్యాంక్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, హావెల్స్ ఇండియా, ఐసీఐసీఐ లాంబార్డ్, ఐనాక్స్ లీజర్, ఎస్‌కేఎఫ్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
రికార్డ్.. రికార్డ్
సూచీ ఇంట్రాడే ఆల్‌టైమ్ హై
సెన్సెక్స్ 39,116
బ్యాంక్ నిఫ్టీ 30,648
Comments
Please login to add a commentAdd a comment