న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ కంపెనీ ఐటీసీ మార్చి త్రైమాసికానికి రూ.3,482 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.2,932 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. ఇక ఆదాయం రూ.11,329 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ.12,933 కోట్లకు చేరింది. పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్, హోటల్స్, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాల పనితీరు బలంగా ఉండటమే మెరుగైన ఫలితాలకు కారణం. అధిక పన్నుల కారణంగా సిగరెట్ల విభాగంపై ఒత్తిళ్లు కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. సిగరెట్ల విభాగం వారీగా రూ.2,932 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆయిల్ సీడ్స్, గోధుమ, కాఫీ, అగ్రి వ్యాపారాల్లో స్థూల ఆదాయం అధికంగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. పేపర్ బోర్డ్స్ విభాగంలో అధిక అమ్మకాల ఆదాయం, హోటల్స్ వ్యాపారంలో రూమ్ వారీగా ఆదాయంలోనూ మెరుగుదల ఉందని పేర్కొంది.
రాణించిన అన్ని విభాగాలు
సిగరెట్లు సహా మొత్తం ఎఫ్‌ఎంసీజీ ఆదాయం మార్చి త్రైమాసికంలో రూ.8,759 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.7,988 కోట్లు కావడం గమనార్హం. సిగరెట్ల విభాగం ద్వారా ఆదాయం రూ.4,936 కోట్ల నుంచి రూ.5,486 కోట్లకు వృద్ధి చెందింది. ఎఫ్‌ఎంసీజీలో ఇతర విభాగాల ఆదాయం రూ.3,051 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ కాకుండా ఇతర విభాగాల ద్వారా (పేపర్, హోటళ్లు తదితర) ఆదాయం రూ.3,517 కోట్ల నుంచి 4,148 కోట్లకు వృద్ధి చెందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ రూ.52,035 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.12,824 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,485 కోట్లు, ఆదాయం రూ.49,520 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.5.75 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.
ఐటీసీ చైర్మన్‌గా సంజీవ్ పూరి
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ‘ఐటీసీ’కి నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సంజీవ్ పూరి నియమితులయ్యారు. సోమవారం జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈయన్ను సీఎండీగా నియమించినట్లు.. కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్) హఠాన్మరణంతో సంజీవ్ పూరిని చైర్మన్‌గా నియమిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. సీఎండీ స్థానంలో తొలిసారిగా మాట్లాడిన సంజీవ్ పూరి.. ‘ఈ నూతన పదవిని నాకు దక్కిన ప్రత్యేక అధికారం, గౌరవంగా భావిస్తున్నా. భారత కార్పొరేట్ సామ్రాజ్యంలో బలమైన సంస్థగా ఎదిగిన ఐటీసీని మరింత బలపరచడం నా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. 2015లో బోర్డు సభ్యునిగా నియమితులైన సంజీవ్.. ఆ తర్వాత 2017లో సీఈఓగా మారారు. ఐఐటీ కాన్పూర్, వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment