వచ్చే కొన్నేళ్లపాటు ఇదే పనితీరు
నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి అంచనా వ్యక్తం చేశారు. ఈ రేటు 0.5 శాతం అటూ, ఇటూగా ఉండొచ్చన్నారు. అంతేకాదు, రానున్న కొన్నేళ్లపాటు ఇదే తరహా వృద్ధి రేటు నమోదవుతుందన్నారు. దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందంటూ.. వాటిని పరిష్కరించాల్సి ఉందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) జీడీపీ 7.2 శాతం వరకు వృద్ధిని నమోదు చేయవచ్చని ఆర్‌బీఐ సైతం ఇటీవలే అంచనా వేయడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం వ్యయాలు క్షీణించడంపై ఎదురైన ప్రశ్నకు విర్మాణి స్పందిస్తూ.. కరోనా విపత్తు ప్రభావంతో గృహ పొదుపు తగ్గిపోయిందని.. అంతకుముందు ఆర్థిక సంక్షోభాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉందన్నారు. రెట్టింపు కరువు పరిస్థితిగా దీన్ని అభివర్ణించారు. గతేడాది ఎల్‌నినో పరిస్థితిని చూసినట్టు చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో పొదుపులను మళ్లీ పోగు చేసుకోవాల్సి ఉన్నందున, అది వినియోగంపై ప్రభావం చూపించినట్టు వివరించారు. ‘‘బ్రాండెడ్ ఉత్పత్తులు కొనుగోలు చేసే వారు, చిన్న బ్రాండ్లు లేదా సాధారణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకుంటున్నారు’’అని వివరించారు. చారిత్రకంగా చూస్తే ప్రాంతీయ భాగస్వామి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ నిదానించినట్టుగా తెలుస్తోందని.. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ చేపట్టకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు.
వడ్డీ రేట్ల కోతతో పెట్టుబడుల ప్రవాహం..
వర్ధమాన దేశాలతో పోలిస్తే రిస్క్ లేని రాడులు యూఎస్‌లో, అభివృద్ధి చెందిన మార్కెట్లో వస్తుండడమే, మన దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తక్కువగా ఉండడానికి కారణంగా విర్మాణి చెప్పారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం మొదలైన తర్వాత మన దగ్గరకు పెట్టుబడుల ప్రవాహం మొదలవుతుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment