S&P Global keeps India's economic growth forecast unchanged at 6% in FY24 - Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి రేటు.. 6 శాతం!

Mar 28 2023 6:29 AM | Updated on Mar 28 2023 10:35 AM

India economic growth forecast unchanged at 6percent in FY24 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వృద్ధి ఏప్రిల్‌ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతంగా ఉంటుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజా నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ రేటు తిరిగి 6.9 శాతానికి చేరుతుందని అంచనా వేసిన రేటింగ్‌ దిగ్గజ సంస్థ– మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఎకానమీ వేగాన్ని 7 శాతంగా ఉద్ఘాటించింది. కాగా, ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 6.5 శాతం)  మరింత పెంచే అవకాశం ఉందని కూడా రేటింగ్‌ దిగ్గజం అంచనా వేసింది. 

(ఇదీ చదవండి: జాక్‌ మా రిటర్న్స్‌: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్‌)

  ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి ఎస్‌అండ్‌పీ త్రైమాసిక ఎకనమిక్‌ అప్‌డేట్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.8 శాతంకాగా, 2023–24లో ఈ రేటు 5 శాతానికి తగ్గనుంది.  
► 2024–2026 మధ్య భారత్‌ ఎకానమీ వృద్ధి తీరు సగటున 7 శాతం.  
► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరంలలో భారత్‌ జీడీపీ వృద్ధి తీరు 6.9 శాతంగా ఉండనుంది. 2026–27లో 7.1%కి పెరుగుతుందని అంచనా.  
► భారత్‌ ఎకానమీకి సాంప్రదాయకంగా ‘దేశీయ డిమాండ్‌’ చోదక శక్తిగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ప్రతికూల ప్రభావం కొంత ఎకానమీపై కనబడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌)  జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో ఈ రేటు 4.4%కి నెమ్మదించడం గమనార్హం.  
► ఆర్‌బీఐ రేటు పెంపునకు ప్రాతిపదిక అయిన వినియోగ ద్రవ్యోల్బణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ సవాళ్లుసహా పలు అడ్డంకులూ ఉన్నాయి.  

 (రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్‌ రిపోర్ట్‌ ఎలా ఉందంటే..!)

అంతర్జాతీయంగా చూస్తే..
ఆసియా–పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించి ఎస్‌అండ్‌పీ ఆశావాద దృక్పథాన్నే వెలువరించింది. ఈ సంవత్సరం చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. 2023 చైనా వృద్ధికి సంబంధించి నవంబర్‌లో వేసిన 4.8 శాతం అంచనాలను 5.5 శాతానికి పెంచింది. మార్చిలో జరిగిన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ప్రకటించిన 5 శాతం అంచనాలకన్నా ఇది అధికం కావడం గమనార్హం. వినియోగం, సేవల రంగాలు ఎకానమీ పురోగతికి దోహదపడతాయని అభిప్రాయపడింది. అమెరికా, యూరోజోన్‌లో ఎకానమీలో 2023లో భారీగా మందగించవచ్చని రేటింగ్‌ దిగ్గజం పేర్కొంది. ఈ ఏడాది అమెరికా 0.7 శాతం, యూరోజోన్‌ 0.3 శాతం వృద్ధి సాధిస్తాయన్నది తమ అంచనాగా తెలిపింది. చైనా కోలుకోవడం ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంపై అమెరికా, యూరప్‌లోని మందగమన ప్రభావాన్ని పూర్తిగా భర్తీ చేయబోదని పేర్కొన్న ఎస్‌అండ్‌పీ, ఇది కొంత ఉపశమనాన్ని  మాత్రం కలిగిస్తుందని అంచనావేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement