న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో రూ.608 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.606 కోట్ల నికర లాభం ఆర్జించామని భారతీ ఇన్‌ఫ్రాటెల్ తెలిపింది. ఆదాయం రూ.3,662 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.3,600 కోట్లకు చేరిందని భారతీ ఇన్‌ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం ఫ్లాట్‌గా రూ.2,494 కోట్లుగా నమోదైందని వివరించారు. ఆదా యం మాత్రం రూ. 14,490 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.14,582 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.7.50 రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.
విలీన ప్రభావం....
టెలికం రంగంలో ఏకీకరణ కారణంగా మొబైల్ టవర్ల అద్దెలు తగ్గడంతో నికర లాభంలో ఎలాంటి వృద్ధి లేదని అఖిల్ గుప్తా తెలిపారు. వొడాఫోన్–ఐడియా కంపెనీల విలీనం కారణంగా మొత్తం మీద 75,000 కో–లొకేషన్లను కోల్పోయామని పేర్కొన్నారు. అందుకని గత ఆర్థిక సంవత్సరం క్యూ4ల్లో ఆర్థికంగా కంపెనీ పనితీరు అంతంతమాత్రంగానే ఉందని వివరించారు.
భవిష్యత్తు బాగు....
డేటాకు డిమాండ్ జోరుగా పెరుగుతోందని, భారీ స్థాయిలో నెట్‌వర్క్ విస్తరణ జరుగుతోందని, ఫలితంగా తమ కంపెనీకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండనున్నదని అఖిల్ గుప్తా అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇండస్ టవర్స్‌తో తమ కంపెనీ విలీన ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని, మరికొన్ని నెలల్లో విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేర్ 3 శాతం లాభంతో రూ.302 వద్ద ముగిసింది.
భారతీ ఇన్‌ఫ్రాటెల్‌కు విలీనం సెగ
Published Thu, Apr 25 2019 1:13 AM | Last Updated on Thu, Apr 25 2019 1:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment