ఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అంతేకాదు.. ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో.. సెంట్రల్ బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది.
2023-24 ఆర్థిక సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో.. దేశ ఆర్థిక వృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన, ఆర్థిక క్రమశిక్షణపై దృష్టిసారించిన మోదీ ప్రభుత్వం.. ఈ బడ్జెట్ లో వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. కరోనా సమయంలో మందగించిన ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టడంతో పాటు.. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం, పేదల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాబోయే ఆర్థిక సంవత్సరంలో 198 బిలియన్ డాలర్ల రుణాలు సేకరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు రాయిటర్స్ ఆర్థికవేత్తల పోల్ సర్వే వెల్లడిస్తోంది.
పన్ను రాబడిలో పతనం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవృద్ధి మందగించడం వల్ల సమీప కాలంలో రుణ సామర్థ్యాన్ని పరిమితం చేయాలన్న యోచనలో కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 14.2 ట్రిలియన్ రూపాయులుగా ఉన్న స్థూల రుణ పరిమితి ఈసారి 16 ట్రిలియన్ రూపాయలకు చేరనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కాగా.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 2014లో దేశ స్థూల రుణం 5.92 ట్రిలియన్ రూపాయలుగా ఉంది.
మరోవైపు.. 2023-24 ఆర్థిక సంవత్సర జీడీపీలో బడ్జెట్ లోటును 6 శాతానికి తగ్గించగలదని రాయిటర్స్ కు చెందిన మరో ఆర్థికవేత్తల పోలింగ్ నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పటికీ 1970ల నుంచి చూసిన సగటు 4% నుండి 5% కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2025-26 నాటికి 4.5 శాతానికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది.
రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రికార్డు స్థాయిలో 8.85 ట్రిలియన్ రూపాయలకు చేరుతుందని, ఇది జీడీపీలో 2.95 శాతమని రాయిటర్స్ పోల్ నివేదిక చెబుతోంది. అయితే.. ప్రపంచ తయారీ రంగంలో చైనాను అధిగమించి భారత్ అగ్రగామిగా నిలవాలంటే.. మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment