న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఇన్వెంటరీ లాభాలు, రూపాయి పెరుగుదల కలిసొచ్చాయి. వీటి ప్రభావంతో రిఫైనరీ మార్జిన్ల క్షీణత ప్రభావాన్ని కంపెనీ అధిగమించి మరీ మంచి లాభాలను నమోదు చేసింది. రూ.72,840 కోట్ల ఆదాయంపై రూ.2,970 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.66,351 కోట్ల ఆదాయంపై రూ.1,748 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అమ్మకాలు పెరగడం, ఇన్వెంటరీ లాభాలు, రూపాయి బలోపేతం కావడం లాభాల వృద్ధికి దోహదపడినట్టు హెచ్‌పీసీఎల్ చైర్మన్, ఎండీ ఎంకే సురానా తెలిపారు. ఇన్వెంటరీ రూపంలో రూ.916 కోట్ల లాభం గడించింది. ముడి చమురు కొనుగోలు ధర నుంచి, విక్రయించే నాటికి ధర పరంగా పెరుగుదలే ఇన్వెంటరీ లాభం. కరెన్సీ మార్పిడి రూపంలోనూ రూ.248 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రతీ బ్యారెల్ చమురుపై స్థూల మార్జిన్ 7 డాలర్ల మేర ఉంది. శుద్ధి చేసి ఇంధనంగా మార్చడంపై 4.51 డాలర్ల మార్జిన్ లభించింది. పెట్రోల్ విక్రయాలు 8.5 శాతం, డీజిల్ విక్రయాలు 3 శాతం, ఎల్‌పీజీ విక్రయాలు 12.9 శాతం, ఏటీఎఫ్ విక్రయాలు 17 శాతం చొప్పున పెరిగాయి.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి...
ఇక 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.6,029 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.6,357 కోట్లుగా ఉండడం గమనార్హం. స్థూల రిఫైనరీ మార్జిన్ ఒక్కో బ్యారెల్‌పై అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 7.4 డాలర్ల నుంచి 5 డాలర్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకుతోడు రూపాయి మారకంలో తేడాలు మార్జిన్లు తగ్గడానికి కారణంగా కంపెనీ పేర్కొంది. ఇన్వెంటరీ లాభాలు 2018–19 సంవత్సరానికి రూ.1,366 కోట్లుగా ఉన్నాయి. కరెన్సీ మారకం రూపంలో రూ.579 కోట్ల నష్టాలు వచ్చాయి. కంపెనీ రుణ భారం రూ.27,240 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం నుంచి రూ.8,000 కోట్ల ఇంధన సబ్సిడీ రావాల్సి ఉంది. ఒక్కో షేరుపై రూ.9.40 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది.
హెచ్‌పీసీఎల్‌కు 2,970 కోట్ల లాభం
Published Tue, May 21 2019 12:50 AM | Last Updated on Tue, May 21 2019 12:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment