ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) మార్చి క్వార్టర్‌కు రూ.201 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,650 కోట్ల నష్టాన్ని చవిచూసింది. బ్యాంకు ఆదాయం రూ.4,689 కోట్ల నుంచి రూ.5,711 కోట్లకు పెరగ్గా ఆస్తుల నాణ్యత సైతం మెరుగుపడింది. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 17.63% నుంచి 12.66%కి.. నికర ఎన్‌పీఏలు సైతం 10.48% నుంచి 5.93%కి తగ్గాయి. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.55 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ.20,181 కోట్ల నుంచి రూ.20,537 కోట్లకు చేరింది. 2017–18లో రూ.5,872 కోట్లు, 2016–17లో రూ.1,094 కోట్ల మేర బ్యాంకు నష్టాలను చవిచూసింది.
టర్న్ అరౌండ్ అయింది...
‘‘గత మూడు త్రైమాసికాలుగా లాభాలను నమోదు చేస్తున్నాం. రానున్న కాలంలోనూ లాభాలను కొనసాగిస్తాం. ముందు సంవత్సరం రూ.12,000 కోట్ల మేర ఎన్‌పీఏలుగా మారగా, వీటిని 7,000 కోట్లకు కట్టడి చేశాం. రూ.3,161 కోట్లకు వసూళ్లు, రుణాల అప్‌గ్రేడేషన్ రూ.6,597 కోట్లకు చేరాయి. ఇవన్నీ టర్న్ అరౌండ్‌కు కారణమయ్యాయి’’ అని ఓబీసీ ఎండీ, సీఈవో ముకేశ్‌కుమార్ జైన్ తెలిపారు. బ్యాంకు 10– 12 శాతం రుణ వృద్ధి లక్ష్యాన్ని విధించుకుంది. క్యూఐపీ లేదా ఎఫ్‌పీవో తదితర మార్గాల ద్వారా రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు నిర్ణయం తీసుకుంది.
మళ్లీ లాభాల్లోకి యునైటెడ్ బ్యాంకు
ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ఏడు త్రైమాసికాల నష్టాల తర్వాత మార్చి క్వార్టర్‌లో తిరిగి లాభాలు నమోదుచేసింది. రూ.95 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.260 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. ఆదాయం రూ.2,635 కోట్ల నుంచి రూ.2,948 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం రూ.540 కోట్లుగా, నికర వడ్డీ మార్జిన్ 2.43 శాతంగా ఉన్నా యి. నికర వడ్డీ ఆదాయం కిందటేడాది ఇదే కాలం లో రూ.1,493 కోట్లుగా ఉండగా, అది రూ.1,975 కోట్లకు పెరిగింది. బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 24 శాతం నుంచి 16.48 శాతానికి, నికర ఎన్‌పీఏలు 16.49 శాతం నుంచి 8.67 శాతానికి తగ్గాయి. మార్చి నాటికి రూ.2 లక్షల కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించినట్టు యునైటెడ్ బ్యాంకు తెలిపింది. క్యూఐపీ ద్వారా రూ.1,500 కోట్ల నిధుల సమీకరణకు నిర్ణయం తీసుకుంది.
ఆరు రెట్లు పెరిగిన కర్ణాటక బ్యాంకు లాభం
మార్చి త్రైమాసికంలో రూ.61 కోట్లు
కర్ణాటక బ్యాంకు లాభం మార్చి త్రైమాసికంలో ఆరు రెట్లు పెరిగి రూ.61.73 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.11 కోట్లుగా ఉంది. అయితే, డిసెంబర్ త్రైమాసికంలో లాభం రూ.140 కోట్లతో పోలిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. బ్యాంకు ఆదాయం 5% వృద్ధితో రూ.1,737 కోట్ల నుంచి రూ.1,821 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతానికి పైగా క్షీణించి రూ.480 కోట్లకు పరిమితం అయింది. నికర వడ్డీ మార్జిన్ 3.54 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గింది. స్థూల ఎన్‌పీఏలు 4.92% నుంచి 4.41%కి, నికర ఎన్‌పీఏలు 2.96 శాతం నుంచి 2.95 శాతానికి తగ్గినట్టు బ్యాంకు తెలిపింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 46% వృద్ధితో రూ.477 కోట్లకు చేరింది. బ్యాంకు చరిత్రలో ఓ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభం ఇదే. ఒక్కో షేరుకు రూ.3.50 డివిడెండ్‌ను బోర్డు సిఫారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment