న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.145 కోట్ల నికర లాభం ప్రకటించింది. అసెట్ క్వాలిటీ, వ్యాపార నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం ఇందుకు తోడ్పడ్డాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఓబీసీ రూ. 1,985 కోట్ల నష్టాలు నమోదు చేసింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 4,756 కోట్ల నుంచి రూ. 5,128 కోట్లకు పెరిగింది. త్రైమాసికాలవారీగా నికర వడ్డీ మార్జిన్లు క్రమంగా మెరుగుపర్చుకుంటూ వస్తున్నామని, 2017–18లో 1.95 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ తాజా మూడో త్రైమాసికంలో 2.80 శాతానికి చేరిందని ఓబీసీ తెలిపింది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ. 1,018 కోట్ల నుంచి రూ. 1,419 కోట్లకు పెరిగింది. ఎంప్లాయీ పర్చేజ్ స్కీమ్ (ఈఎస్‌పీఎస్) కింద కొత్తగా 2.61 కోట్ల షేర్లను రూ. 71.76 రేటుకు జారీ చేయనున్నట్లు ఓబీసీ తెలిపింది. జనవరి 31న ప్రకటించే ఈ ఆఫర్ ద్వారా రూ. 187.52 కోట్లు సమీకరించాలని బ్యాంక్ భావిస్తోంది.
తగ్గిన ఎన్‌పీఏలు..
క్యూ3లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 16.95 శాతం నుంచి 15.82 శాతానికి, నికర ఎన్‌పీఏలు 9.52 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గాయి. విలువపరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ. 27,551 కోట్ల నుంచి రూ. 24,353 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ. 14,195 కోట్ల నుంచి రూ. 9,973 కోట్లకు తగ్గాయి. అయితే, మొండిబాకీలకు కేటాయింపులు మాత్రం రూ. 2,340 కోట్ల నుంచి రూ. 4,082 కోట్లకు పెరిగాయి. మంగళవారం బీఎస్‌ఈలో ఓబీసీ షేరు 4% పెరిగి రూ. 94.80 వద్ద క్లోజయ్యింది.
ఓరియంటల్ బ్యాంక్ లాభం రూ. 145 కోట్లు
Published Wed, Jan 30 2019 1:10 AM | Last Updated on Wed, Jan 30 2019 1:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment