న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,025 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.913 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.6,644 కోట్లకు ఎగసిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.2,246 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2,583 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 4.3 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలను కూడా కలుపుకుంటే, బ్యాంక్ నికరలాభం (కన్సాలిడేటెడ్) 17% వృద్ధితో రూ.1,574 కోట్లకు పెరిగింది. బ్యాంక్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ బ్యాంక్ నికర లాభం 28 శాతం వృద్ధితో రూ.1,165 కోట్లకు చేరుతుందని విశ్లేషకులు అంచనా వేశారు.
మెరుగుపడిన రుణనాణ్యత...: గతేడాది క్యూ1లో 2.58 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 2.17 శాతానికి తగ్గాయని బ్యాంక్ తెలిపింది. అలాగే నికర మొండి బకాయిలు 1.25 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయని పేర్కొంది. ‘‘తాజా మొండి బకాయిలు రూ.594 కోట్ల నుంచి రూ.321 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలకు ఇతరాలకు కేటాయింపులు రూ.204 కోట్ల నుంచి 131 శాతం పెరిగి రూ. 470 కోట్లకు ఎగిశాయి. రుణాలు 24 శాతం వృద్ధితో రూ.1.76 లక్షల కోట్లకు, కాసా నిష్పత్తి 43.9 శాతం నుంచి 50.3 శాతానికి పెరిగాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 18.3 శాతంగా, టైర్ వన్ రేషియో 17.6 శాతంగా ఉన్నాయి’’ అని బ్యాంకు వివరించింది.
3 % నష్టపోయిన షేర్..
ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో బీఎస్‌ఈలో కోటక్ బ్యాంక్ నష్టపోయింది. ఇంట్రాడేలో రూ.1,335–రూ.1,412 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన ఈ షేర్ చివరకు 3.69% నష్టంతో రూ.1,350 వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా జోరుగా పెరుగుతున్న ఈ షేర్‌లో ఫలితాల అనంతరం లాభాల స్వీకరణ చోటు చేసుకుందని నిపుణులంటున్నారు. కాగా, బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.9,874 కోట్లు ఆవిరై రూ.2,57,375 కోట్లకు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment