న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం, బ్యాంక్ ఆఫ్ బరోడా నికర నష్టాలు(స్టాండ్‌అలోన్) గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.3,102 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.991 కోట్లకు తగ్గాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నష్టాలు ఈ స్థాయిలో వచ్చాయని వివరించింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం, బ్యాంక్ నిరాశపరిచింది. గత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో ఈ బ్యాంక్‌కు రూ.471 కోట్ల నికర లాభం వచ్చింది. ఇక మొత్తం ఆదాయం రూ. 12,735 కోట్ల నుంచి రూ.15,285 కోట్లకు పెరిగింది.
11 శాతం పెరిగిన ఏడాది ఆదాయం....
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.2,432 కోట్ల నికర నష్టాలు(స్టాండ్ అలోన్)రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.433 కోట్ల నికర లాభం వచ్చింది. కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,887 కోట్ల నికర నష్టాలు రాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,100 కోట్ల నికర లాభం వచ్చింది. మొత్తం ఆదాయం(స్టాండ్‌అలోన్) 11% వృద్ధితో రూ.56,065 కోట్లకు, కన్సాలిడేటెడ్ పరంగా అయితే 13% వృద్ధితో రూ.60.793 కోట్లకు పెరిగింది.
మెరుగుపడిన రుణ నాణ్యత...
బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి నాటికి 12.26 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 9.61 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 5.49 శాతం నుంచి 3.33 శాతానికి తగ్గాయి. విలువ పరంగా చూస్తే, నికర మొండి బకాయిలు రూ.15,609 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ.3,521 కోట్లకు చేరాయి. ఇది ఎనిమిది క్వార్టర్ల కనిష్ట స్థాయి. కేటాయింపులు రూ.7,053 కోట్ల నుంచి రూ.5,550 కోట్లకు తగ్గాయి. మొత్తం వ్యాపారం రూ.10,18,747 కోట్ల నుంచి 9 శాతం ఎగసి రూ.11,07,509 కోట్లకు పెరిగింది.
ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 0.6 శాతం లాభంతో రూ.126 వద్ద ముగిసింది.
తగ్గిన బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టాలు
Published Thu, May 23 2019 12:04 AM | Last Updated on Thu, May 23 2019 12:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment