న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో... గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018–19, క్యూ4)లో కంపెనీ రూ.2,494 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ1,801 కోట్లతో పోలిస్తే 38.4 శాతం ఎగబాకింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 8.9 శాతం వృద్ధితో రూ.13,769 కోట్ల నుంచి రూ.15,006 కోట్లకు చేరింది. కాగా, డిసెంబర్ క్వార్టర్ (క్యూ3)లో నికర లాభం రూ.2,544 కోట్లతో పోలిస్తే సీక్వెన్షి యల్ ప్రాతిపదికన క్యూ4లో లాభం 1.9 శాతం తగ్గింది.
పూర్తి ఏడాదికి చూస్తే...
2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి విప్రో నికర లాభం రూ.9,018 కోట్లుగా నమోదైంది. 2017–18లో నికర లాభం రూ.8,003 కోట్లతో పోలిస్తే 12.6 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా 7.5 శాతం వృద్ధితో రూ.54,487 కోట్ల నుంచి రూ.58,585 కోట్లకు పెరిగింది.
ఐటీ సేవలు ఇలా...
విప్రో కీలక వ్యాపారమైన ఐటీ సేవల విభాగం ఆదాయం డాలర్ల రూపంలో క్యూ4లో 2,075 మిలియన్ డాలర్లుగా నమోదైంది. క్యూ3తో పోలిస్తే 1.4 శాతం తగ్గింది. మార్కెట్ విశ్లేషకులు 2,082 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(2019–20, క్యూ1)లో ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయం 2,046–2,087 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే వృద్ధి మైనస్ 1 నుంచి 1 శాతంగా లెక్కతేలుతోంది. కాగా, మార్కెట్ విశ్లేషకుల వృద్ధి అంచనా 0–3 శాతంతో పోలిస్తే కంపెనీ అంచనా తక్కువగా ఉండటం గమనార్హం. ఉద్యోగుల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు విప్రో ప్రకటించడం, గైడెన్స్ బలహీనంగా ఉండటంతో మంగళవారం కంపెనీ షేరు బీఎస్‌ఈలో 2.5 శాతం క్షీణించి రూ.281 వద్ద ముగిసింది.
‘పటిష్టమైన ఆర్డర్ల ఆసరాతో పాటు డిజిటల్ సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్ సేవలు, క్లౌడ్ వంటి కీలక విభాగాల్లో మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ప్రతి త్రైమాసికంలో నిలకడగా ఆదాయాలు, లాభాలు పుంజుకోవడమే దీనికి నిదర్శనం.’
– అబిదాలి నీముచ్‌వాలా, విప్రో సీఈఓ–ఎండీ
Comments
Please login to add a commentAdd a comment