న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా తగ్గాయి. గత క్యూ1లో రూ.919 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.342 కోట్లకు తగ్గాయని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) తెలిపింది. రుణాల రికవరీ బావుండటం, కేటాయింపులు తగ్గడంతో నష్టాలు కూడా తగ్గాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.5,327 కోట్ల నుంచి 6 శాతం తగ్గి రూ.5,006 కోట్లకు చేరిందని తెలిపింది. వడ్డీ ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.4,336 కోట్లకు పెరగ్గా, ఇతర ఆదాయం మాత్రం 38 శాతం తగ్గి రూ.670 కోట్లకు పరిమితమైందని పేర్కొంది.
తగ్గినా, అధికంగానే మొండి బకాయిలు....
మొండి బకాయిలు గణనీయంగానే తగ్గినా, అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. గత క్యూ1లో 25.64 శాతం(రూ.38,146 కోట్లు)గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 22.53 శాతాని(రూ.33,262 కోట్ల)కి తగ్గాయని ఐఓబీ తెలిపింది. నికర మొండి బకాయిలు 15.10 శాతం(రూ.19,642 కోట్లు)నుంచి 11.04 శాతాని(రూ.14,174 కోట్లు)కి తగ్గాయని పేర్కొంది. మొండి బకాయిలు తగ్గడంతో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,051 కోట్ల నుంచి రూ.1,170 కోట్లకు తగ్గాయని వివరించింది. రుణ రికవరీలు రూ.3,389 కోట్ల నుంచి రూ.2,238 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఇక తాజా మొండి బకాయిలు రూ.2,050 కోట్లకు పరిమితమయ్యాయని వివరించింది. తాజా మొండి బకాయిలు కన్నా రికవరీలు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.2.21 లక్షల కోట్లకు, రుణాలు రూ.1.47 లక్షల కోట్లకు, మొత్తం వ్యాపారం రూ.3.69 లక్షల కోట్లకు చేరాయని ఐఓబీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 0.7 శాతం లాభంతో రూ.11.80 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment