2024–25లో 17–19% వృద్ధి అంచనా
క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారు ఆభరణాల రంగంలో ఉన్న వ్యవస్థీకృత రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17–10 శాతం ఆదాయ వృద్ధి సాధించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. పుత్తడి ధర పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆభరణాల అమ్మకాల పరిమాణం 2023–24 మాదిరిగానే స్థిరంగా ఉంటుందని అంచనా. బంగారం ధరలు గణనీయంగా పెరగడం, నూతన ఔట్‌లెట్స్ జోడింపులు.. వెరశి అధిక సరుకు నిల్వల స్థాయిల కారణంగా రిటైలర్ల మూలధన అవసరాలు పెరగవచ్చు.
సురక్షిత పెట్టుబడి..
ఆభరణాల మార్కెట్లో వ్యవస్థీకృత రంగం వాటా మూడింట ఒక వంతు కంటే కొంచెం ఎక్కువగా ఉంది. మిగిలిన వాటా అవ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. దేశీయంగా బంగారం ధర 2023–24లో 15 శాతం పెరిగి 2024 మార్చి చివరి నాటికి 10 గ్రాములకు రూ.67,000కి చేరుకుంది. ఏప్రిల్‌లో ధర రూ.73,000 స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్ బ్యాంకులు, అలాగే భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య వినియోగదారులు చూసే సురక్షిత పెట్టుబడి ఎంపికలలో బంగారం ఒకటిగా నిలవడమే ధర పెరుగుదలకు కారణం.
అధిక తగ్గింపులు..
బ్రాండింగ్, మార్కెటింగ్ వ్యయాన్ని పెంచడమే కాకుండా, అధిక బంగారం ధరల మధ్య వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో ఉత్పత్తి డిజైన్స్, ఆఫర్లను విస్తరించడం కొనసాగించినప్పటికీ, రిటైలర్లు కొనుగోలుదారులకు అధిక తగ్గింపులను అందించే అవకాశం ఉంది. అమ్మకాలు దూసుకెళ్లేందుకు గోల్డ్ ఎక్సే్ఛంజ్ ఆఫర్లను ప్రమోట్ చేయవచ్చు. ఫలితంగా మూడింట ఒకవంతు ఉన్న గోల్డ్ ఎక్సే్చంజ్ పథకాల వాటా గణనీయంగా పెరగనుంది. కస్టమర్ల ప్రాధాన్యతల్లో మార్పు రావడం, విక్రయ సంస్థలు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంతో వ్యవస్థీకృత రంగం వాటా వృద్ధి చెందనుంది. కాగా, పసిడి ధర దూసుకెళ్లిన నేపథ్యంలో తక్కువ క్యారట్ కలిగిన ఆభరణాలకు కస్టమర్లు మళ్లే అవకాశం ఉందని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు.
స్థిరంగా క్రెడిట్ ప్రొఫైల్స్..
ఆరోగ్యకర బ్యాలెన్స్ షీట్స్ మద్దతుతో స్టోర్ విస్తరణలు మహమ్మారి తర్వాత బలమైన రెండంకెల వృద్ధిని సాధించాయి. స్థిర పరిమాణం కారణంగా 2024–25లో స్టోర్ల జోడింపు వేగం 10–12 శాతానికి తగ్గవచ్చు. పెరిగిన బంగారం ధరల ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ధరతో బంగారం నిల్వలు భర్తీ అవుతాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలలో ఆశించిన పెరుగుదల ఉన్నప్పటికీ.. ఆరోగ్యకర రాబడి పెరుగుదల, తగిన లాభదాయకత కారణంగా బలంగా నగదు రాకతో వ్యవస్థీకృత బంగారు ఆభరణాల రిటైలర్ల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతున్నట్టు క్రిసిల్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment