హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అదుర్స్‌ | HDFC Bank Net Profit Jumps 18per cent To ₹ 8,758.3 Crore In Q3 Results | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అదుర్స్‌

Published Mon, Jan 18 2021 5:45 AM | Last Updated on Mon, Jan 18 2021 5:45 AM

HDFC Bank Net Profit Jumps 18per cent To ₹ 8,758.3 Crore In Q3 Results - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం ఎగసి రూ. 8,760 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన సైతం నికర లాభం 18 శాతం పెరిగి రూ. 8,758 కోట్లను అధిగమించింది. ఇందుకు నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 16,317 కోట్లకు చేరింది. డిపాజిట్లు 19 శాతం పురోగమించగా.. కాసా డిపాజిట్లు 43 శాతం ఎగశాయి.  

తొలి బ్యాంకు
ఈ ఏడాది క్యూ3 ఫలితాలు ప్రకటించిన తొలి ఫైనాన్షియల్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకాగా.. కొత్త సీఈవో, ఎండీ శశిధర్‌ జగదీశన్‌ అధ్యక్షతన తొలిసారి త్రైమాసిక పనితీరును వెల్లడించింది. బ్యాంకుకు 25 ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలందించడం ద్వారా ప్రయివేట్‌ రంగంలో టాప్‌ ర్యాంకులో నిలిపిన ఆదిత్య పురీ ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం విదితమే. కాగా.. క్యూ3లో రుణ వృద్ధి 15.6 శాతం పుంజుకోగా.. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.2 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 11 శాతం బలపడి రూ. 7,443 కోట్లకు చేరింది. ఇందుకు పెట్టుబడుల విలువ 67 శాతం ఎగసి రూ. 1,109 కోట్లను తాకడం దోహదపడింది.  

రుణ నాణ్యత
క్యూ3లో బ్యాంకు స్థూల మొండి బకాయిలు(జీఎన్‌పీఏ) 1.42 శాతం నుంచి 0.81 శాతానికి వెనకడుగు వేశాయి. త్రైమాసిక ప్రాతిపదికన చూసినా 1.08 శాతం నుంచి 0.81 శాతానికి తగ్గాయి. అయితే మారటోరియం సమయంలో నమోదైన రుణ ఒత్తిడులను మొండిబకాయిలుగా పరిగణించవద్దంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ప్రభావం చూపాయి. వీటిని పరిగణించినప్పటికీ జీఎన్‌పీఏలు 1.38 శాతంగా నమోదయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.  

రిటైల్‌ వాటా..
కోవిడ్‌–19 నేపథ్యంలోనూ రికవరీ చాటుతూ ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,043 కోట్ల నుంచి రూ. 3,414 కోట్లకు మాత్రమే పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 18.9 శాతంగా నమోదైంది. వీటిలో టైర్‌–1 క్యాపిటల్‌ 17.1 శాతానికి చేరింది. రుణాలలో 48 శాతం రిటైల్‌ వాటాకాగా.. కార్పొరేట్‌ విభాగం 52 శాతం ఆక్రమిస్తోంది. కాగా.. కంపెనీ వారాంతాన ఫలితాలను ప్రకటించడంతో సోమవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరుపై ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,467 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,472–1,445 మధ్య ఊగిసలాడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement